వడగండ్లు.. కడగండ్లు..!
కూలిన గోడలు, ఎగిరిపోయిన గుడిసెల పైకప్పులు
రామాయంపేట: మండలంలోని దంతేపల్లి, కాట్రియాల గ్రామాల్లో శుక్రవారం రాత్రి భారీ స్థాయిలో ఈదురు గాలులు వీయడంతోపాటు వడగళ్ల వాన కురిసింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భారీ స్థాయిలో కురిసిన వడగళ్ల ప్రభావం నిరుపేదల గుడిసెలపై పడింది. కాట్రియాల తండా, దంతేపల్లి తండా, భిక్షపతి తండా, సుభాష్ తండాల్లో నివాస గుడిసెల పైకప్పులు ఎగిరిపోయాయి. అంతేకాకుండా ఇటీవల నిర్మించిన మరుగుదొడ్ల గోడలు కూలిపోయాయి. ఈదురు గాలులతో నాలుగైదు గుడిసెలు నేల మట్టమై గిరిజనులు నష్టపోయారు. మొక్కజొన్న పంట దెబ్బతింది. దీంతో తీవ్ర భయాందోళన చెందిన ప్రజలు వర్షం కురుస్తున్నంతసేపు తమ కుటుంబాలతో ఆరుబయటకు వచ్చి నిలుచున్నారు. ఈదురు గాలులు, వర్షాలతో నష్టపోయిన తమను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.