దిలీప్ బిల్డ్‌కాన్- సింజీన్.. అదుర్స్
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(NHAI) నుంచి ప్రాజెక్టులు లభించినట్లు వెల్లడించడంతో మౌలిక సదుపాయాల కంపెనీ దిలీప్ బిల్డ్‌కాన్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క కోవిడ్-19 వ్యాధి పరీక్షల కిట్‌కు ఐసీఎంఆర్ నుంచి అనుమతి లభించినట్లు పేర్కొనడంతో సింజీన్ ఇంటర్నేషనల్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
దిలీప్ బిల్డ్‌కాన్
ఎన్హెచ్ఏఐ నుంచి కొత్త హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో ప్రాజెక్టు లభించినట్లు దిలీప్ బిల్డ్‌కాన్ తాజాగా పేర్కొంది. కాంట్రాక్టు విలువ రూ. 1,905 కోట్లుకాగా.. దీనిలో భాగంగా బీహార్‌లో ఎన్‌హెచ్ 131Aలో నరేన్పూర్ నుంచి పూర్నియా వరకూ 4 లైన్ల రహదారిని అభివృద్ధి చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ఇదే విధంగా పూర్నియా సమీపంలో రెండు లైన్ల రహదారిని సైతం నిర్మించవలసి ఉన్నట్లు వెల్లడించింది. రెండేళ్లలోగా ప్రాజెక్టును పూర్తి చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో దిలీప్ బిల్డ్‌కాన్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 7 శాతం జంప్‌చేసి రూ. 373 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 386 వరకూ ఎగసింది.
సింజీన్ ఇంటర్నేషనల్
కోవిడ్-19 టెస్ట్ కిట్‌కు ఐసీఎంఆర్ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు హెల్త్‌కేర్ కంపెనీ సింజీన్ ఇంటర్నేషనల్ తాజాగా వెల్లడించింది. కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీవో) నుంచి కూడా అనుమతి మంజూరైతే ఈ ప్రొడక్టును మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. హైమీడియా ల్యాబొరేటరీస్‌తో సంయుక్తంగా ఎలీసేఫ్ 19 పేరుతో కోవిడ్-19 టెస్ట్ కిట్‌ను రూపొందించినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో సింజీన్ ఇంటర్నేషనల్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 9 శాతం దూసుకెళ్లి రూ. 494ను అధిగమించింది. ప్రస్తుతం 7 శాతం లాభంతో రూ. 485 వద్ద ట్రేడవుతోంది.