హైబ్రీడ్ కంది రెడీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తికి ప్రత్యామ్నాయంగా సోయాబీన్‌ను ప్రోత్సహించాలని వ్యవసాయాధికారులు భావిస్తోంటే.. ఇక్రిశాట్ మాత్రం హైబ్రీడ్ కందినే సరైన ప్రత్యామ్నాయం అంటోంది. కంది సాగు కు పెద్దగా పెట్టుబడులు అవసరం లేకపోవడం.. దిగుబడి కూడా అధికంగా ఉండటంతో రైతులకు ఇది లాభసాటిగా ఉంటుందన్నది శాస్త్రవేత్తల అంచనా. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా మన్నెంకొండ పరిశోధన కేంద్రంలో ఇక్రిశాట్ హైబ్రీడ్ కందిని అభివృద్ధి చేసింది. దీనికి ‘మన్నెంకొండ హైబ్రీడ్ కంది’గా నామకరణం చేసింది.
నల్లరేగడి నేలల్లో పండే ఈ హైబ్రీడ్ కంది వల్ల ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని తేలినట్టు వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. మార్కెట్లో కందికి క్వింటాలుకు రూ.4 వేల నుంచి 6 వేల వరకు మద్దతు ధర లభిస్తుందని, ఇది రైతులకు లాభసాటిగా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ హైబ్రీడ్ కందికి చీడపీడలను తట్టుకునే శక్తి ఉంది. ఇక్రిశాట్‌తో చర్చిం చాక తెలంగాణ రాష్ట్ర విత్తన సంస్థ ద్వారా హైబ్రీడ్ కందిని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు పార్థసారథి తెలిపా రు. దీనిపై మంగళవారం ఇక్రిశాట్లో ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ పట్నాయక్ ఈ సదస్సుకు రానున్నారు.
రెండేళ్లలో పూర్తి ప్రత్యామ్నాయం
రెండు మూడేళ్లలో హైబ్రీడ్ కందిని పత్తికి పూర్తి ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దేందు కు ఇక్రిశాట్ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఖరీఫ్‌లో కంది సాగు సాధారణ విస్తీర్ణం 6.95 లక్షల ఎకరాలు. గతేడాది ఖరీఫ్‌లో 5.62 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తితో రైతులు నష్టపోతుండటం, ఎగుమతి సుంకంపై కేంద్రం ఇటీవలి నిర్ణయంతో ఆ పంటను నిరుత్సాహపరచాలని తెలంగాణ వ్యవసాయ శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. వచ్చే ఖరీఫ్‌లో కనీసం 10 లక్షల ఎకరాల్లో పత్తి సాగును తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా పప్పు ధాన్యాల దిగుబడి పెంపుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యం లో హైబ్రీడ్ కందికి ఇక్రిశాట్ రూపకల్పన చేయడం ప్రాధాన్యం సంతరిం చుకుంది.