పదో వంతు ఖర్చుతోనే ప్రకృతి సేద్యం!
కూరగాయలు, బొప్పాయి, అరటి సాగులో రాణిస్తున్న గుంటూరు జిల్లా రైతు
జీవామృతం, కషాయాలతోనే సేద్యం..
ప్రకృతి సేద్యంతో భారీగా తగ్గిన సాగు ఖర్చు
అభ్యుదయ పంథాలో అలుపెరగని ఆయన సేద్య ప్రస్థానానిది మూడు దశాబ్దాల చరిత్ర.ఉన్నత చదువులు చదివి వారసత్వంగా వ్యవసాయాన్ని చేపట్టిన ఆయన అమృత హస్తాల్లో పలు పంటలు చివుర్లు తొడిగాయి. పెరిగిన ఖర్చులు తరిగిన దిగుబడులతో రేపిన ఆలోచన ఆయనను ప్రకృతి సేద్యం చేసేందుకు ప్రేరేపించాయి.
ప్రకృతి సేద్యంలో కూరగాయల సాగుతో వినియోగదారులకు ఆత్మబంధువుగా మారారు ఆరుమళ్ల సాంబిరెడ్డి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి ఆయన స్వగ్రామం. డిగ్రీ వరకు చదివి వారసత్వంగా వ్యవసాయాన్ని చేపట్టారు. స్వీట్‌కార్న్, కీరదోస వంటి పంటలను ఈ ప్రాంతంలోనే తొలిసారిగా సాగు చేసిన ఘనత సాంబిరెడ్డిది. సుభాష్ పాలేకర్ తరగతులకు హాజరై పుడమికి, మనిషికి ప్రకృతి సేద్యమే రక్ష అని తెలుసుకున్నారు. గత మూడేళ్లుగా ఆరెకరాల తన నల్లరేగడి పొలంలో తోటకూర, గోంగూర, పాలకూర, బచ్చలి, చుక్కకూర, మెంతి, పుదీనా, కొత్తిమీర వంటి ఆకుకూరలను... సొర, వంగ వంటి కూరగాయలు... బొప్పాయి, అరటి వంటి పండ్లతోటలను సాగు చేస్తున్నారు.
సొర, వంగలో అంతర పంటలుగా ఆకుకూరలు
సొర, వంగ పంటలను సాంబిరెడ్డి ఎకరంలో సాగు చేస్తున్నారు. రెండు విడతలుగా పంట చేతికొచ్చేలా 25 సెంట్ల మడుల్లో సాగు చేస్తున్నారు. తొలకరిలో పశువుల ఎరువు వేసి పొలాన్ని సిద్ధం చేసుకొని ముందుగా ఆకుకూరల విత్తనాలు చల్లుతారు. తరువాత సొర, వంగ విత్తనాలను బీజామృతంతో విత్తనశుద్ధి చేసుకుంటారు. బోదెల మధ్య 8, మొక్కల మధ్య నాలుగు అడుగుల ఎడం ఉండేలా విత్తుకొని, పొలమంతా తడిచేలా నీటి తడి ఇస్తారు. ప్రతి 15 రోజులకోసారి 200 లీటర్ల జీవామృతం నీటి ద్వారా అందిస్తారు. చీడపీడల నివారణకు 20 లీ. నీటికి 50 మి. లీ. దశపత్ర కషాయం పిచికారీ చేస్తారు. శిలీంధ్ర నాశనిగా 20 లీటర్ల నీటికి పావు లీటరు పులిసిన మజ్జిగను కలిపి పిచికారీ చేస్తున్నారు. పావు ఎకరాలో 5 వేల సొరకాయలు కాస్తున్నాయి. పావు ఎకరాలో సాగుకు రూ. 5 వేలు ఖర్చవుతోంది. కాయ రూ. 10– 15 చొప్పున రూ. 50 –70 వేల వరకు ఆదాయం లభిస్తోంది. వంగలో పావు ఎకరాలో పంటకు 13 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. కిలో రూ. 20–30 చొప్పున విక్రయిస్తున్నారు. సాగు ఖర్చులు రూ. 5 వేలు పోను రూ. 25 వేల వరకు నికరాదాయం లభిస్తోంది. అంతర పంటలుగా సాగుచేసిన ఆకుకూరల ద్వారా రూ. 10 వేలు అదనపు ఆదాయంగా సమకూరుతోంది.
బొప్పాయి, అరటిలో సగానికి తగ్గిన ఖర్చు..
హైబ్రిడ్ బొప్పాయి పంటను సాంబిరెడ్డి రెండెకరాల్లో సాగు చేస్తున్నారు. గతేడాది జూలైలో మొక్కలు నాటుకున్నారు. సాళ్ల మధ్య ఆరడుగులు, మొక్కల మధ్య ఏడడుగులు ఉండేలా ఎకరాకు వెయ్యి మొక్కలు నాటుకున్నారు. 15 రోజులకోసారి డ్రిప్ ద్వారా మొక్కలకు నీరందిస్తున్నారు. తడి ఇచ్చినప్పుడు పాదుల్లో మొక్కకు అర లీటరు చొప్పున జీవామృతం పోస్తారు. 20 లీటర్ల నీటికి 2 లీటర్ల జీవామృతం కలిపి పిచికారీ చేస్తారు. ప్రస్తుతం కాయదశలో ఉంది. గతేడాది జూలైలో హైబ్రిడ్ అరటి కర్పూరం, చక్రకేళిని సాలు విడిచి సాలు పద్ధతిలో నాటుకున్నారు. ప్రస్తుతం పంట గెలల దశలో ఉంది. గతంలో రసాయన ఎరువులు, పురుగుమందులకు ఎకరాకు రూ. 70 వేలు ఖర్చయ్యేది. ప్రకృతి సేద్యంలో రూ. 30 వేలకు తగ్గిందని సాంబిరెడ్డి చెప్పారు.
ఏటా ఎకరానికి రూ. లక్ష నికరాదాయం
ఎకరంనర పొలంలో వివిధ రకాల ఆకుకూరలను ఆయన సాగు చేస్తున్నారు. ముందుగా పొలాన్ని దుక్కి చేసుకొని పశువుల ఎరువు వేస్తారు. 80 గజాల విస్తీర్ణంలో మడులు చేసుకుంటారు. విత్తనాలను మడుల్లో చల్లి చేతిగొర్రుతో మట్టిలో కలిసేలా దున్ని తడి ఇస్తారు. ఆకుకూరలకు వారం వ్యవధితో నీటి తడులిస్తారు. ఎకరాకు 200–400 లీటర్ల జీవామృతం నీటిద్వారా ఇస్తారు. 15 రోజులకు లీటరు నీటికి 100 ఎం. ఎల్ జీవామృతం, 3 మి.లీ.వేపనూనెను కలిపి ఆకుకూరలపై పిచికారీ చేస్తారు. దోమ నివారణకు గ్రీజు పూసిన పసుపు రంగు అట్టలు వాడతారు. నెల రోజులకు పంట కోతకొస్తుంది. రూ. 5 చొప్పున కట్టలు కట్టి విజయవాడలోని సేంద్రియ కూరగాయలు విక్రయించే షాపులకు అమ్ముతారు. ఎకరా ఆకుకూరల సాగుకు రూ. 20–25 వేల ఖర్చవుతుంది. రూ. 30 వేల వరకు నికరాదాయం లభిస్తుంది.
రసాయన సేద్యంలో ఎరువులు, పురుగుమందులకు ఏటా రూ. 3 లక్షల వరకు ఖర్చయ్యేదని.. ప్రకృతిసేద్యంలో రూ. 30 వేలకు మించి అవ్వటం లేదని సాంబిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇలా ఏడాదికి ఐదు పంటల ద్వారా ఎకరాకు రూ. లక్షకు తగ్గకుండా నికరాదాయం పొందుతున్నారు సాంబిరెడ్డి.
కూరగాయల నాణ్యత బావుండటం.. పొలం హైవేకు దగ్గరగా ఉండటంతో నిత్యం 200 మంది వినియోగదారులు వాహనాల్లో వచ్చి నేరుగా కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. సాంబిరెడ్డి ప్రకృతి సేద్యం చేస్తున్న తోటి రైతులందరితో కలిసి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఏర్పాటు చేసి విజయవాడలో దుకాణం నిర్వహిస్తున్నారు.
– బి.ఎల్. నారాయణ, సాక్షి, తెనాలి, గుంటూరు జిల్లా
మూడో ఎడాదికి దిగుబడి పెరిగింది
మందుకట్టలు కొని పొలంలో చల్లితే పోయేదానికి ఇంత చాకిరీ చేయాలా అనుకుంటున్నారు కొందరు రైతులు. ప్రకృతి సేద్యంలో మొదటి రెండేళ్లు దిగుబడి తగ్గింది. మూడో ఏడాది రసాయన సేద్యంలో సాగు చేసిన దానికన్నా ఎక్కువ దిగుబడి వచ్చింది. పొలం గుల్లబారింది. నేలలో వానపాములు, తేనెటీగల సంఖ్య పెరిగింది. రసాయన సేద్యం చేసేటప్పుడు వీటి జాడే లేదు. ఖర్చు ఎకరాకు రూ. 20–25 వేల వరకు తగ్గింది. మంచి కూరగాయలు పండిస్తున్నారని కొనుగోలు దారులు అభినందిస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది.
– ఆరుమళ్ల సాంబిరెడ్డి (94939 21929),కుంచనపల్లి, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా