మన ఆధ్యాత్మిక రాజధాని
కాశీకి ఇప్పుడు మన రాష్ట్రం నుంచి రైలులో వెళితే (హైదరాబాద్-కాశీకి రైలు మార్గం 1,230 కి.మీ.)ఒకటిన్నరరోజులో చేరుకోవచ్చు. అదే విమానంలో అయితే 3-4 గంటల్లో వెళ్లిపోవచ్చు. రవాణా సదుపాయాలు పుష్కలంగా ఉన్న ఈ రోజుల్లో కాశీకి వెళ్లి రావడం అంటే పొరుగూరు వెళ్లి వచ్చినంత సులువు. కాని ఒకప్పుడు.. అంటే రెండుమూడు వందల ఏళ్ల క్రితం...
కాలినడకన ప్రయాణం
కాశీకి పోవటం అంటే కాటికిపోవటంతో సమానమే అనేవారు. అంటే ఆ రోజుల్లో భద్రతలేని కారణంగా కాశీ వెళ్లినవారు క్షేమంగా ఇంటికి చేరేవారు కారు. కానీ, కాశీ పుణ్యరాశి. వరుణ-అసి నదుల సంగమస్థలి. భారతీయులకు అత్యంత పవిత్ర తీర్థస్థానం. కాబట్టి కాశీ వెళ్లి తీరాల్సిందే! కాని వాహనసదుపాయం లేని రోజులవి. కాలినడకనే ప్రయాణం. కొండకోనలు, నదీప్రవాహాలు, దుర్భేద్యమైన అడవులు, క్రూరమృగాలు, దారిదోపిడీలు... అన్నింటినీ దాటుకొని కాశీ చేరేసరికి ఎన్నో గండాలు. అన్నదాన సత్రాలలో భోజనాలు.. లేదంటే ఉపవాసాలు... అడవుల గుండా ప్రయాణించేటప్పుడు కాయగసరే మహాప్రసాదాలు. అందుకే జీవితంలో అన్ని బాధ్యత లూ తీరిన 60 ఏళ్లకు పైబడినవారే కాశీ ప్రయాణమయ్యేవారు.
1800 ప్రాంతంలో!
ఏనుగుల వీరాస్వామయ్య, ఆయన బంధుగణం, పరిజను లు సుమారు వందమందితో కలిసి మద్రాసు నుండి బయలుదేరి తిరుపతి, కడప, కర్నూలు, హైదరాబాద్, నాగపూర్, ప్రయాగల మీదుగా కాశీ వెళ్లారు. అప్పటికి రోడ్లు కూడా సరిగా లేవు. ప్రయాణం ఎక్కువగా పల్లకీలు మోసే బోయీల ద్వారా జరిగినట్లు తెలుస్తోంది. యాత్రాఫలాన్ని తనకొకడికే పరిమితం చేసుకోకుండా 40 బిందెల గంగాజలాన్ని 10 గుర్రాల మీద చెన్నైకి పంపించే ఏర్పాటు చేయించాడట. 15 నెలలు సాగిన ఆ ప్రయాణపు రోజులను ‘కాశీయాత్రా చరిత్ర’గా గ్రంథస్థం చేశారు. ఆ తరువాతి సంగతులకొస్తే- ఇప్పటికి సరిగ్గా వందేళ క్రితం రచయిత చెళ్లపిళ్లవెంకటశాస్త్రీ కాశీ వెళ్లిన తన అనుభవాలను పుస్తకంగా తీసుకొచ్చారు. ఐతే ఈయన కాలానికి పరిస్థితులలో మార్పులు వచ్చాయి. బ్రిటీషువారి హయంలో రైలు-పడవలు వంటి ప్రయాణ సాధనాలు ఉన్నాయి. గంగానదికి వరదలు వస్తే బల్లకట్టువేసి బండ్లు దాటించేవారనీ, ఎద్దు లు నడవకపోతే బండివాడే కాడి భుజానికి ఎత్తుకునేవాడ నీ, మిగతావారు కాలినడకన సాగేవారని.. తెలియజేశారు.
తిరిగొస్తే పండగే!
కాశీ వెళ్లిన వారు తిరిగి ఊరు చేరుకున్నారంటే.. వారిని సాక్షాత్తు భగవత్స్వరూపులుగా భావించేవారు. మేళతాళాలతో ఎదురెళ్లి, ఇంటికి తీసుకెళ్లి, పెద్ద పండగ చేసుకునేవారు. వెళ్లిన వారు తమ ప్రయాణపు అనుభవాలను చెబుతుంటే ఆ అనుభూతిలో తామూ ప్రయాణించేవారు.
ఆ రోజుల్లో కాశీ చేరాలనే సంకల్పం రైలు, విమాన ప్రయాణాలను మించిన ధైర్యాన్ని కలిగించేది. ఇప్పటికీ కొంతమంది కాలినడకన కాశీ చేరేవారున్నారు. అయితే నేడు వారి ప్రయాణానికి భరోసానిచ్చే అనేక మార్గాలున్నాయి.
- నిర్మలారెడ్డి