యువతిపై ప్రేమోన్మాది దాడి
పెళ్లి చేసుకోనన్నందుకు కత్తితో పొడిచిన దినేశ్
ఆ తర్వాత తానే తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించిన యువకుడు
యువతి పరిస్థితి విషమం.. నగర శివార్లలో దారుణం
హైదరాబాద్: ప్రేమోన్మాదం తలకెక్కిన ఓ యువకుడు ఒక యువతిపై కత్తితో దాడి చేశాడు. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందనే కసితో.. మూడు చోట్ల పొడిచాడు. అయితే తీవ్రగాయాలైన ఆ యువతిని నిందితుడే తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించాడు. హైదరాబాద్ శివార్లలోని కోకాపేట సమీపంలో ఔటర్ సర్వీస్ రోడ్డుపై గురువారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఈ దాడిలో గాయపడిన యువతి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సెంట్రల్ ఎక్సైజ్‌లో పనిచేసే రవికుమార్ కుమార్తె పి.దివ్య (23). ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఇంటర్ చదివే సమయంలో.. అదే కాలేజీలో చదివే దినేశ్ (23)తో పరిచయమైంది. ప్రస్తుతం భీమవరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న దినేశ్... అప్పుడప్పుడు దివ్యతో ఫోన్లో మాట్లాడేవాడు. అయితే కొద్దిరోజులుగా అతను ఫోన్ చేసినా దివ్య లిఫ్ట్ చేయలేదు. దీంతో దినేశ్ గురువారం రైల్లో హైదరాబాద్‌కు వచ్చాడు.
స్నేహితుడి బైక్ తీసుకుని సాయంత్రం 6 గంటలకు దివ్య ఉండే క్వార్టర్స్ వద్దకు వచ్చాడు. దివ్యకు ఫోన్ చేసి వారి క్వార్టర్ వద్ద ఉన్నానని, బయటికి రావాలని కోరాడు. బయటకు రాకపోతే తానే లోపలికి వస్తానని బెదిరించడంతో ఆమె కిందికి వచ్చింది. బయటకు వెళ్లి మాట్లాడుకుందామని చెప్పి ఆమెను బైక్ మీద కోకాపేట శివార్లలోని ఔటర్ సర్వీస్ రోడ్డుపైకి తీసుకెళ్లాడు. తనను పెళ్లిచేసుకోవాలని, లేదంటే ఇద్దరం కలిసి చనిపోదామని దివ్యపై ఒత్తిడి తెచ్చాడు.
కానీ ఆమె దినేశ్‌ను తాను ప్రేమించడం లేదని, బెదిరించినందుకే వచ్చానని చెప్పింది. ఆగ్రహించిన దినేశ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో దివ్యపై దాడి చేశాడు. దీంతో ఆమె ముఖం, కాలర్ బోన్ , వీపుపై మూడు చోట్ల తీవ్రగాయాలయ్యాయి. దివ్య స్పృహ తప్పిపడిపోవడంతో.. పైకి లేపి బైక్‌పై కూర్చోబెట్టుకొని గచ్చిబౌలి స్టేడియం ముందుకు వచ్చాడు. అదే సమయంలో అటుగా వచ్చిన తైక్వాండో కోచ్ మహేష్ ఏమైందని అడగగా.. ప్రమాదంలో గాయపడిందని, ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పాడు.
మహేశ్ సహయంతో నానక్‌రాంగూడలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో దివ్యను చేర్పించాడు. అయితే ఆమెను పరిశీలించిన వైద్యులు అవి యాక్సిడెంట్ గాయాలు కావని, కత్తితో దాడి చేసినట్లుగా ఉన్నాయని గుర్తించారు. దినేశ్‌ను అక్కడే ఉండాలని చెప్పి, గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని.. దినేశ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కాగా.. దివ్య కాలర్ బోన్, వీపుపై తీవ్రంగా గాయాలయ్యాయని, దివ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 48 గంటలు గడిస్తేనే ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.