8 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు సెప్టెంబర్ 8న ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని అసెంబ్లీ సమావేశ మందిరంలో సమావేశాలు జరుగుతాయి. సమావేశాలకు సంబంధించి శుక్రవారం శాసనసభ ఇన్చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ నోటిఫికేషన్ జారీ చేశారు. జీఎస్టీ బిల్లును మెజారిటీ రాష్ట్రాలు ఆమోదిస్తేనే అమలుచేసేందుకు వీలవుతుంది. ఈ నేపథ్యంలో సమావేశాలను నిర్వహిస్తున్నారు. పనిలో పనిగా వర్షాకాల సమావేశాలను కూడా పూర్తిచేస్తారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సమగ్రంగా చర్చించేందుకు అసెంబ్లీని కనీసం నాలుగు వారాల పాటు నిర్వహించాలని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఇప్పటికే డిమాండ్ చేశారు.
ఈ సమావేశాల్లో ప్రధానంగా కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం, కృష్ణా పుష్కరాలు, రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, దళితులపై దాడులు, ఏపీకి ప్రత్యేక హోదా తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మండలి సమావేశాలు 8వ తేదీ ఉదయం ప్రారంభమవుతాయి.