ఇక మహర్దశ
ఎన్‌హెచ్ విస్తరణ పనులకు నేడు శ్రీకారం
99.10 కిలోమీటర్లు.. రూ.1905 కోట్లు..
మడికొండ వద్ద ప్రారంభించనున్న
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం కేసీఆర్
ముల్లకట్ట బ్రిడ్జిని జాతికి అంకితం చేసేదీ ఇక్కడే..
వరంగల్ : హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే జిల్లాకు మహర్దశ పట్టనుంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి యూదగిరిగుట్ట వరకు నాలుగు లేన్ల నిర్మాణం పూర్తి కాగా, ఇప్పుడు దాన్ని వరంగల్ వరకు పొడిగిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని భూపాలపట్నం వెళ్లే ఈ (163వ నంబర్) జాతీయ రహదారి అభివృద్ధిలో భాగంగా రెండో దశ పనులకు మడికొండ వద్ద కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం శంకుస్థాపన చేస్తారని నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా(నాయ్) అధికారులు తెలిపారు. నార్త్-సౌత్ కారిడార్ కింద ఈ జాతీయ రహదారిని పూర్తి స్థాయిలో (హైదరాబాద్ నుంచి భూపాలపట్నం వరకు) నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు నాయ్‌కి అప్పగించారు. మొదటి దశలో హైదరాబాద్ నుంచి యూదగిరిగుట్ట వరకు నాలుగు లేన్లుగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు యూదగిరిగుట్ట నుంచి వరంగల్ ఆరెపల్లి వరకు 99.10 కి.మీ. రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.1905 కోట్లు కేటాయించింది. గత ఏడాది అక్టోబర్‌లో రెండుసార్లు ఈ పనులను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమైనప్పటికీ ఉప ఎన్నికల కోడ్ రావడంతో కార్యక్రమం వాయిదా పడింది. కాగా, గోదావరిపై నిర్మించిన మహా వారథి పూర్తి కావడంతో దాన్ని కూడా సోమవారం రోజునే జాతికి అంకితం చేయనున్నా రు. ఆ బ్రిడ్జి ప్రారంభోత్సవం, జాతీయ రహదారి శంకుస్థాపన కార్యక్రమాలు మడికొండ వద్దనే నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
99.10 కిలో మీటర్లు...
జాతీయ రహదారి 163లో యాదగిరిగుట్ట నుంచి వరంగల్ వర కు ఉన్న 99.10 కిలో మీటర్లు రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు రూ.1905 కోట్లు వ్యయం చేయనున్నారు. ఈపీసీ పద్ధతిలో నిర్మించనున్న ఈ రహదారిలో వంగపల్లి, ఆలే రు, జనగామ, వరంగల్ పట్టణాల వెలుపల నాలుగు బైపాస్ రోడ్లు వేస్తారు. ఇంకా ఈ రహదారిలో 3 మేజర్ బ్రిడ్జి(బస్బే) లు, 25 మైనర్ బ్రిడ్జీలు, రెండు ప్రాంతాల్లో ట్రక్లేబేస్లు, మూడు ప్రాంతాల్లో ఆర్వోబీలను నిర్మిస్తారు.