హైదరాబాద్ పోటుగాడి వేట.. ఉత్కంఠ
- 15 మందిని చంపేసిన ఏనుగు కోసం వేట.. కొనసాగుతోన్న ఉత్కంఠ
- జార్ఖండ్ ప్రభుత్వ అభ్యర్థనతో రంగంలోకి నవాబ్ షఫత్ అలీ ఖాన్
- నేడు(ఆగస్టు 12) ప్రంపంచ ఏనుగుల దినోత్సవం
న్యూఢిల్లీ: గ్రామలమీదపడి జనాన్ని చంపేస్తోన్న మదపుటేనుగు ఆట కట్టించేందుకు హైదరాబాద్‌కు చెందిన టాప్ హంటర్ నవాబ్ షఫత్ అలీ ఖాన్ మళ్లీ తుపాకి పట్టారు. గడిచిన కొద్ది రోజులుగా జార్ఖండ్, బిహార్లలో 15 మంది ఆదివాసీలను పొట్టనపెట్టుకున్న భారీ ఎనుగును మట్టుపెట్టేందుకు.. ఆయన షహీబ్‌గంజ్ అడవుల్లో ఆపరేషన్ ప్రారంభించారు. ఆపరేషన్ ఉత్కంఠభరితంగా సాగుతున్నదని, నేడో, రేపో.. ఆ మహమ్మారి చనిపోయిందనే వార్త రావొచ్చని జార్ఖండ్ అటవీశాఖ ముఖ్య అధికారి ఎల్ఆర్ సింగ్ శుక్రవారం మీడియాతో అన్నారు.
జార్ఖండ్-బిహార్ సరిహద్దులోని షహీబ్‌గంజ్ అభయారణ్యంలో మంద నుంచి తప్పిపోయిన ఓ ఏనుగు.. గ్రామాలపై దాడిచూస్తూ ఇప్పటివరకు 15 మందిని పొట్టనపెట్టుకుంది. ఈ అబయారణ్యంలో పహారియా తెగకు చెందిన ఆదివాసీలు జీవిస్తున్నారు. ఏనుగు దాడిలో చనిపోయిన 15 మందిలో 9మంది పహారియా తెగకు చెందినవారే కావడం గమనార్హం. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అటవీశాఖ చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలం కావడంతో చివరికి ఏనుగును చంపేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఎల్ఆర్సింగ్ తెలిపారు.
హైదరాబాద్‌కు చెందిన నవాబ్ షఫత్ అలీ ఖాన్.. దేశంలోనే ఏకైక లెసైన్డ్స్ హంటర్. వేటగాడిగా 40 ఏళ్ల అనుభవం. పలు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల సూచన మేరకు ఆయన 12 చిరుతపులులను, 7 ఏనుగులను, 3 పులులను హతమార్చారు. 15,200 అడవి పందులు, 1300 అడవి కుక్కలు, 1000 అడవి దున్నలు కూడా నవాబ్ తూటాలకు నేలకొరిగివాటిలో ఉన్నాయి. జనం కోసమే తాను తుపాకి పట్టానని, ప్రభుత్వాల అభ్యర్థన మేరకే క్రూరమృగాలను చంపుతున్నానని అంటారు నవాబ్.
ఇదిలా ఉంటే, ఆగస్టు 12.. ప్రపంచ ఏనుగుల దినోత్సవం కావడంతో నవాజ్ హంటింగ్పై జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్ర ప్రభుత్వాలు క్రూరజంతువులను చంపించేందుకు నవాజ్‌ను పిలిపించడంపై కేంద్ర మంత్రి మనేకా గాంధీ సాక్షాత్తు పార్లమెంట్‌లోనే మండిపడ్డారు. విమర్శల సంగతి ఎలా ఉన్నా నవాజ్ మాత్రం తన పని తాను చేసుకుపొతున్నారు.