సీలేరు జల విద్యుత్ ఏపీకే!
* వర్కింగ్ గ్రూపు అభిప్రాయం
* పునర్వ్యవస్థీకరణ చట్టం పరిశీలించిన ఈఎన్సీలు
* నివేదిక రూపకల్పనకు సమాయత్తం
సాక్షి, హైదరాబాద్: సీలేరుపై ఉన్న రెండు జల విద్యుత్ కేంద్రాల ఉత్పత్తిలో తెలంగాణకు వాటా ఉండదని గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూపు భావిస్తున్నట్లు తెలిసింది. సీలేరు జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో 53.89 శాతం తెలంగాణకు వాటాగా ఇవ్వాలని, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోనూ విద్యుత్ ఉత్పత్తి విభజన గురించి స్పష్టంగా ఉందని ఇటీవలి గోదావరి బోర్డు సమావేశంలో తెలంగాణ వాదించింది. అయితే అంతర్ రాష్ట్ర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)లేని ప్రాజెక్టులు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికే చెందుతాయని పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉందని, అందువల్ల సీలేరు విద్యుత్‌లో తెలంగాణకు వాటా రాదని ఏపీ వాదించింది. దీంతో ఈ అంశాన్ని అధ్యయనం చేసి నివేదిక ఇచ్చే బాధ్యతను వర్కింగ్ గ్రూపునకు బోర్డు అప్పగించింది.
బోర్డు సభ్య కార్యదర్శి చంద్రశేఖరన్ అయ్యర్, రెండు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లతో (ఈఎన్సీలు) వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేసి.. నివేదిక సమర్పించడానికి రెండు వారాల గడువు ఇచ్చింది. బోర్డు భేటీ తర్వాత ఈఎన్సీలు చర్చించుకున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, సీలేరు విద్యుత్‌లో తెలంగాణకు వాటా ఉండదనే అభిప్రాయానికి వచ్చారు. ఇదే విషయాన్ని బోర్డు సభ్య కార్యదర్శికి నివేదించారు. ఈ మేరకు నివేదిక తయారు చేయడానికి వర్కింగ్ గ్రూపు సమాయత్తమవుతోందని తెలిసింది. ఈమేరకు రూపొందించనున్న నివేదికను బోర్డు చైర్మన్ మహేంద్రన్‌కు పంపనున్నారు. బోర్డు ఆమోదముద్ర వేస్తే మొత్తం 725 మెగావాట్ల విద్యుత్‌లో తెలంగాణకు వాటా లభించనట్టే. ఇప్పటికే ఈ మూడు కేంద్రాల నుంచి తెలంగాణకు విద్యుత్ ఇవ్వడం లేదు.