రేపు ఐసెట్ ఫలితాల విడుదల
కేయూ క్యాంపస్ (వరంగల్) : తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 19న నిర్వహించిన ఐసెట్-2016 ప్రవేశ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేయనున్నట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఓంప్రకాశ్ వెల్లడించారు. హైదరాబాద్లోని కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, కేయూ ఇన్చార్జి వీసీ టి.చిరంజీవులు మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారని తెలిపారు.
ఐసెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 72,474 మంది అభ్యర్థులకు 66,701 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్ష అనంతరం అదే రోజు ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించామని తెలిపారు. మంగళవారం ఫలితాలతో పాటు ఫైనల్ కీ విడుదల చేస్తామన్నారు. అనంతరం అభ్యర్థులు www.tsicet-2016.org వెబ్సైట్ ద్వారా మార్కుల వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు.