అలాంటి అలవాటు నాకు లేదు
పార్టీలకు, పబ్‌లకు వెళ్లే అలవాటు నాకు లేదు అంటోంది నటి ప్రణీత. ఈ బెంగళూరు బ్యూటీ తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం
అంటూ అన్ని భాషల్లోనూ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఏ భాషలోనూ ఇంకా ప్రముఖ కథానాయకి స్థాయికి చేరుకోలేదు.
కోలీవుడ్‌లో ఉదయన్ చిత్రంతో నాయకిగా ఉదయించిన ఈ అమ్మడు ఆ తరువాత కార్తీకి జంటగా శకుని, సూర్యతో మాస్, జై సరసన
ఎనకు వాయ్‌ంద అడిమైగళ్ వంటి చిత్రాల్లో నటించినా అవేవీ ఆశించిన విజయాలను సాధించికపోవడంతో ప్రణీత మార్కెట్ వేడెక్కలేదు.
అయినా ఏం పర్వాలేదు. నటన అన్నది నా ఫ్యాషన్ మాత్రమే అంటున్న ప్రణీతతో చిన్న చిట్‌చాట్
తమిళసినిమా:
⇒ కోలీవుడ్‌లో ఎక్కువగా నటించడం లేదే?
♦ అందుకు నా పాలసీ కూడా ఒక కారణం కావచ్చు. ఎక్కువ చిత్రాలు చేయాలన్న ఆసక్తి, వచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకోవా లన్న ఆశ నాకు లేవు. మా అమ్మానాన్న ఇద్దరు డాక్టర్లు. వారి కలలు, లక్ష్యాలు నెరవేర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. మరో విషయం ఏమిటంటే అన్ని భాషల్లోనూ ఒకేసారి నటించ డం సాధ్యం కాదు. తెలుగు, కన్నడ భాషల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఆ భాషల్లో నటించడానికే సమయం సరి పోతోంది. అయితే తమిళంలో నటించాలన్న ఆసక్తి ఉంది. మంచి అవకాశం అనిపిస్తే అంగీకరిస్తున్నాను. ఇటీవల అధర్వతో నటించిన‘ జెమినీగణేశనుమ్ సురళీరాజనుమ్’ చిత్రంలో నటించిన పాత్రకు మంచి పేరు వచ్చింది.
⇒ ప్రస్తుతం హీరోయిన్ల మధ్య పోటీ ఎక్కువగా ఉన్నట్లుందే?
♦ పోటీ అనేది అన్ని రంగాల్లోనూ ఉం టుంది. సినిమారంగంలో నూతన నటీమణులు చాలామందే వస్తున్నారు. అయితే ఎవరికి ఏది దక్కాలో అదే దక్కుతుంది. ప్రతిభను బట్టే అవకాశాలు వస్తుంటాయి. అందుకని నేనెవరినీ పోటీగా భావించను. ఎవరు బాగా నటించినా భుజం తట్టి అభినందిస్తా.
⇒ మీరు గ్లామర్‌కు అధిక ప్రాముఖ్యం ఇస్తున్నారనే వారికి మీరిచ్చే సమాధానం?
♦ అని మీరంటున్నారు. ప్రేక్షకులెవరూ నా గ్లామర్ గురించి కామెంట్ చేయడం లేదు. తెలుగు చిత్రాల్లో హీరోయిన్లు ఎక్స్పోజ్ చేయాల్సి ఉంటుందన్న విషయం గురించి నేనూ విన్నాను. అయితే నేను నటించిన చిత్రాలు చూస్తే అలాంటి కామెంట్లకు అవకాశం ఉండదు. నన్నెవరూ గ్లామరస్‌గా నటించమని ఒత్తిడి చేయలేదు కూడా. కథ, పాత్రలకు తగ్గట్టుగానే నా నటన ఉంటుంది.
⇒ బాలీవుడ్ ఆశ లేదా?
♦ కలలో కూడా అలాంటి ఆశ లేదు. అసలు ఆ ప్రయత్నాలు కూడా చేయలేదు. జీవితంలో ఎక్కువగా ఆశించకూడదు. ఒక వేళ ఆశపడింది జరగకపోతే చాలా నిరాశ పడాల్సి వ స్తుంది. అందుకే నన్ను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాల్లో నాకు నచ్చిన, నాకు నప్పే పాత్రలను ఎంచుకుని నటిస్తున్నాను. నేను ఎన్నేళ్లు నటిస్తానో తెలియదు. అది నా చేతుల్లో లేదు. నటన నాకు ఫ్యాషన్. అందుకే నటిస్తున్నాను.
⇒ పబ్‌లకు పార్టీలకు వెళ్లే అలవాటు ఉందా?
♦ అసలు లేదు. ఇంకా చెప్పాలంటే నాకు సినిమారంగంలో స్నేహితులంటూ ఎవరూ లేరు. కాలేజీ స్నేహితులతోనే ఖాళీ సమయాల్లో గడుపుతాను.
⇒ ప్రేమ, పెళ్లి గురించి?
♦ నేనెవరిని ప్రేమించలేదు. పెళ్లి కూడా అమ్మానాన్నలు కుదిర్చిన అబ్బాయినే చేసుకుంటాను.
⇒ వ్యాపార రంగంలోకి ప్రవేశించాలనుకుంటున్నారట?
♦ హోటల్ బిజినెస్ చేయాలన్న ఆలోచన ఉంది. అయితే అమ్మానాన్నలకు సొంతంగా బెంగళూరులో ఆస్పత్రి ఉంది. నటన చాలు ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలను చూసుకో అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో!