పరిశ్రమలకు ప్రోత్సాహం
శామీర్‌పేట్: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ బంగారు తెలంగాణ సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండలంలోని తుర్కపల్లి గ్రామ పరిధిలో ఉన్న పలు పరిశ్రమలను మంగళవారం ఆయన సందర్శించారు. అనంతరం ఐకేపీ నాలెడ్జ్ పార్క్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వూట్లాడారు. పరిశ్రమలకు అన్నివిధాలా సహాయుసహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
పరిశ్రమల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. దీనికోసం చదువుకున్న యువకులను గుర్తించి ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇస్తుందన్నారు. చిన్నచిన్న పరిశ్రమలకు పెట్టుబడి అందిస్తుందన్నారు. వీటిలో ఎస్సీ, ఎస్టీలకు క్యాపిటల్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోందన్నారు. పరిశ్రమల్లో ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటుందన్నారు.
మేడ్చల్‌లో ఐ గ్రీన్ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మండలంలో పలు పరిశ్రమల కోసం గతంలో 1400 ఎకరాలు కేటాయించినట్లు చెప్పారు. వాటిలో 800 ఎకరాలు ఐసీఐసీఐ, 200 ఎకరాలు ఐకేపీ నాలెడ్జ్ పార్క్, 400 ఎకరాలు అలెక్జాండ్రియా కంపెనీలకు కేటాయించినట్లు వివరించారు. ఒక్క ఐకేపీ నాలెడ్జ్ పార్క్‌లోనే 700 మంది స్థానికులకు స్థానం కల్పించినట్లు ఐకేపీ యాజవూన్యం పేర్కొంది. తాగునీరు, విద్యుత్ తదితర సమస్యలను మంత్రికి విన్నవించారు.
సాధ్యమైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల మేనేజింగ్ డెరైక్టర్ కం వీసీ జెడ్రంజన్, ఈడీ వెంకట్‌నర్సింహారెడ్డి, డిప్యూటీ జనరల్ మేనేజర్ గోపాల్‌రెడ్డి, ఐకేపీ నాలెడ్జ్ పార్క్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, (సీఓఓ, సీఎఫ్ఓ) ఈడె ప్రసాద్, మేనేజర్ జీవీవీఎస్ ప్రసాద్, ఈఎంహెచ్ మేనేజర్ చంద్రమోహన్ వివిధ పరిశ్రమల సిబ్బంది పాల్గొన్నారు.