ఫ్యూచర్ కోసం.. ఫీచర్ కార్లు
కొత్త కారు మార్కెట్లోకి వచ్చిందంటే చాలు.. దాంట్లో ఏయే ఫీచర్లు ఉన్నాయి? మైలేజీ బాగుంటుందా? ఇంటీరియర్ ఎలా ఉంది అనే విషయాలను మనం ఆసక్తిగా గమనిస్తాం. టెక్నాలజీ రోజు రోజుకూ మారిపోతున్న ఈ తరుణంలో భవిష్యత్తులో వచ్చే అవకాశమున్న కార్ల గురించి మరీ ఎక్కువ ఆసక్తి ఉండటం సహజం.
మరి.. ఒకేచోట కొన్ని పదుల సంఖ్యలో కొత్త కార్లు కొలువుదీరితే...? అబ్బో సూపర్ అంటున్నారా? నిజమే. ఇటీవలే ముగిసిన జెనీవా మోటర్ షోలో జరిగింది ఇదే. ఇక్కడ ప్రదర్శించిన కొన్ని కార్లు, వాహనాల వివరాలను ఇప్పటికీ కొన్నిసార్లు ముచ్చటించుకున్నప్పటికీ మరికొన్ని ఫ్యూచర్కార్ల గురించి స్థూలంగా.
స్కిల్లా : ఇటలీకి చెందిన రవాణా వాహనాల డిజైనింగ్ సంస్థకు చెందిన 16 మంది విద్యార్థులు సిద్ధం చేసిన కాన్సెప్ట్ కారు ఇది. వీరిలో ఐదుగురు భారతీయ విద్యార్థులూ ఉండటం విశేషం. 2030 నాటికల్లా ఇలాంటి కారును మార్కెట్లోకి తీసుకురావాలన్నది కంపెనీ లక్ష్యం. అయితే ఇందులో కేవలం ఇద్దరు మాత్రం ప్రయాణించగలరు. పూర్తిగా విద్యుత్తుతోనే నడుస్తుంది. బ్రష్లెస్ ఎలక్ట్రిక్ మోటర్ల సాయంతో నడవడం వల్ల అతితక్కువ విద్యుత్తుతో ఎక్కువ దూరం ప్రయాణించగలదు.
ఐ–ట్రిల్ : టయోటా కంపెనీ అభివృద్ధి చేస్తున్న కాన్సెప్ట్ కారు ఇది. టాటా నానో కారును పోలిన డిజైన్ ఉన్నప్పటికీ ఎన్నో శక్తిమంతమైన ఫీచర్లు ఉన్నాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 250 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చు. ఈ మూడు చక్రాల వాహనంలో ముగ్గురు ప్రయాణించవచ్చు. వెనుకవైపున ఉన్న రెండు చక్రాలు... వంపులకు అనుగుణంగా పైకి, కిందకు కూడా కదులుతాయి. తద్వారా ఒకపక్కకు ఒరిగిపోయే అవకాశాలు ఏమాత్రం ఉండవు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్