I watch
-
యాపిల్ ఐఫోన్ 11 వచ్చేసింది..
కాలిఫోర్నియా: ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తోన్న కొత్త ఐఫోన్లను యాపిల్ విడుదల చేసింది. ఐఫోన్ 11, 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్ అధునాతన స్మార్ట్ఫోన్లను యాపిల్ హెడ్‌క్వార్టర్స్ క్యుపర్టినోలోని స్టీవ్ జాబ్స్ ఆడిటోరియమ్‌లో జరిగిన ప్రత్యేక ఈవెంట్లో ఆవిష్కరించారు. ఐఫోన్ 11 ఆరు రంగుల్లో లభ్యం కానున్నది. కొత్తగా గ్రీన్, పర్పుల్ రెడ్, యెల్లో రంగుల్లో లభించనున్నది. స్పెషల్ ఆడియో, డాల్బీ అట్మోస్ ఫీచర్, ఇరువైపులా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 6.1 లిక్విడ్ రెటినా డిస్ప్లే, స్లో మోషన్ సెల్ఫీలు, ఏ13 బయోనిక్ చిప్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఐఫోన్ 11 ధర 699 డాలర్ల నుంచి మొదలవుతుంది. యాపిల్ ఐ వాచ్ 5.. మరోపక్క, ఐవాచ్ సిరీస్ 5ను తీసుకొచ్చింది. మామూలు వాచ్‌లాగానే ఎప్పుడు డిస్ప్లే కంటికి కనిపించేలా ఐ వాచ్ సిరీస్ 5ను ఆవిష్కరించింది. ఈ వాచ్‌ల్లో కంపాస్‌ను కూడా అమర్చింది. ధర 399 నుంచి 499 డాలర్లు. ఏడో జనరేషన్ ఐప్యాడ్లను కూడా యాపిల్ ప్రవేశపెట్టింది. ధరలు 329 డాలర్ల నుంచి ప్రారంభమవుతాయి. వీటి అమ్మకాలు ఈ నెల 30 నుంచి మొదలవుతాయి. కొత్తగా వీడియో స్ట్రీమింగ్ సర్వీస్–యాపిల్ టీవీ, వీడియో గేమింగ్ సర్వీస్–ఆర్కేడ్లను అందుబాటులోకి తెచ్చింది. యాపిల్ టీవీ... నెట్‌ఫ్లిక్స్ తరహా స్ట్రీమింగ్ వీడియో సర్వీస్, ఆపిల్ టీవీని యాపిల్ కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ఆపిల్ టీవీ ద్వారా ఓఫ్రా విన్ఫ్రే, జెన్నిఫర్ అనిస్టిన్ తదితర స్టార్స్ నటించిన ఒరిజినల్ ప్రోగ్రామ్స్‌ను ప్రసారం చేస్తుంది. వంద దేశాల్లో ఈ సర్వీస్ నవంబర్ 1 నుంచి లభించనున్నది. నెలకు సబ్స్క్రిప్షన్ 4.99 డాలర్లు. కొత్త ఐఫోన్లు, ఐపాడ్లు కొన్నవాళ్లకు ఏడాది పాటు ఈ సర్వీస్‌ను ఉచితంగా అందిస్తారు. యాపిల్ ఆర్కేడ్ యాపిల్ కంపెనీ వీడియో గేమింగ్ సర్వీస్–ఆర్కేడ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ధర 4.99 డాలర్లు ఇది ఈ నెల 19 నుంచి అందుబాటులోకి వస్తుంది. కొత్తగా వంద గేమ్స్‌ను అందిస్తోంది. మన అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ కూడా కొన్ని గేమ్స్‌ను అందిస్తుండటం విశేషం. సర్వీసులపై దృష్టి... ఐఫోన్ల అమ్మకాలు పడిపోవడంతో ఇప్పుడు యాపిల్ కంపెనీ సర్వీసులపై దృష్టి పెట్టిందని నిపుణులంటున్నారు. గత ఏడాది వరుసగా మూడు క్వార్టర్ల పాటు ఐఫోన్ల అమ్మకాలు పడిపోయాయి. గతంలో కొత్తది రాగానే పాత ఫోన్‌ను పక్కనపెట్టి, కొత్త ఫోన్ కోసం పరుగులు పెట్టేవాళ్లు. ఇప్పుడు సీన్ మారింది. కనీసం ఐఫోన్ యూజర్లలో చాలా మంది మూడేళ్లు దాటిన తర్వాతనే కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేస్తున్నారని నిపుణులంటున్నారు. డివైస్ల అమ్మకాలు పడిపోతుండటంతో ఆపిల్ మ్యూజిక్, ఐక్లౌడ్, యాపిల్ టీవీ వంటి సర్వీసులపై యాపిల్ కంపెనీ దృష్టిని ఎక్కువగా పెడుతోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఐ వాచ్ ఎలా ఉంటుందంటే...!
ఈ ప్రపంచంలో ‘ఐ ఫోన్ వాడకం దార్లు’అనే ప్రత్యేకమైన తరగతిని సృష్టించిన సంస్థ యాపిల్. ఐఫోన్ వాడటం అనేది ఒక హోదా. ఒక డిగ్నిటీ. ఒక మనస్తత్వం. మరి మార్కెట్లో ఇలాంటి గుర్తింపును సంపాదించుకొన్న యాపిల్ కంపెనీ ఇప్పుడు స్మార్ట్‌వాచ్‌తో పలకరించబోతోంది. మొబైల్‌ను స్మార్ట్‌ఫోన్‌గా మార్చేసి, ఇప్పుడు వాచ్‌ను కూడా మరింత స్మార్ట్‌గా తీర్చిదిద్దడానికి రెడీ అయ్యింది. దాదాపు ఏడాది నుంచి మార్కెట్లో స్మార్ట్‌వాచ్‌లు సందడి చేస్తున్నాయి. శామ్సంగ్ గెలాక్సీ గేర్, సోనీ స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే అందుబాటులో ఉన్న వీటి కన్నా, యాపిల్ కంపెనీ రూపొందిస్తున్నానని ప్రకటించిన స్మార్ట్‌వాచ్ గురించే జనాలు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఎప్పుడు విడుదల అవుతుందా.. అని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకూ ఈ స్మార్ట్‌వాచ్ గురించి కానీ, దాని కాన్సెప్ట్ గురించి గానీ యాపిల్ కంపెనీ అధికారికంగా స్పందించింది లేదు. యాపిల్ ఉద్యోగులు కూడా ఆఫ్ ది రికార్డ్‌గా స్మార్ట్‌వాచ్ గురించి మాట్లాడింది లేదు. వాళ్లంతా చాలా గుంభనంగా పనిచేసుకొంటూ వెళుతున్నారు. వాళ్ల గోప్యతను చూస్తే అసలు ఐ స్మార్ట్‌వాచ్ రూపొందుతోందా! లేదా! అనే సందేహం కూడా వచ్చింది. అయితే యాపిల్ సీఈవో టీమ్‌కుక్ స్మార్ట్‌వాచ్‌ను ధ్రువీకరించాడు. ఈ యేడాది చివరకల్లా అది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనేది ఆయన మాటల సారాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు! వార్తాసంస్థ ‘రాయిటర్స్’ ఇచ్చే సమాచారాన్ని బట్టి ఐవాచ్కు సంబంధించి డిజైన్ దాదాపు పూర్తి అయ్యింది. వచ్చే నెల నుంచి తైవాన్‌లో వీటి ప్రొడక్షన్ మొదలుకానుంది. అక్టోబర్ కళ్లా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీర్ఘచతురస్రాకారంలో ఉండే డిస్ప్లే 2.5 ఇంచెస్ డయాగ్నల్(కర్ణం)తో ఉంటుందనేది ఊహాగానం. ఐ వాచ్‌కు వైర్లెస్చార్జింగ్కు సదుపాయం ఉంటుంది. ఈ వేరబుల్ టెక్నాలజీ విషయంలో యాపిల్ కంపెనీ నైక్ సహకారం కూడా తీసుకొందని తెలుస్తోంది. ధర విషయంలో మాత్రం ఇంతవరకూ ఎలాంటి క్లారిటీ లేదు. మరి ధర విషయంలో అంచనాలను పరిశీలించినట్లైతే.. లైట్ వెయిల్ స్మార్ట్ వాచ్ ధర ప్రస్తుతం దాదాపు 150 పౌండ్లు ఉంటుంది. సెప్టెంబర్‌లో విడుదల కానున్న సోనీ స్మార్ట్ వాచ్-2 కూడా దాదాపు ఇదే ధరలో అందుబాటులోకి రానుంది. అయితే ఇతర కంపెనీలతో పోలిస్తే యాపిల్ ధర స్థాయి ఎక్కువే. మరి ఈ రకంగా అంచనా వేస్తే యాపిల్ స్మార్ట్ వాచ్ ధర 180 పౌండ్ల నుంచి 220 పౌండ్ల వరకూ ఉండవచ్చు. ఇక యాపిల్ కంపెనీలో ఎలాంటి రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయి. ఎవరిని హైర్ చేస్తోంది... వంటి అంశాలను బట్టి కూడా స్మార్ట్ వాచ్ గురించి అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి.