హ్యుందయ్ ఐ30 కారు చూశారా?
ముంబై:
హ్యుందయ్ కంపెనీ నుంచి వచ్చిన ఐ10, ఐ20 కార్లు మార్కెట్లో మంచి విజయాలే సాధించాయి. దాంతో ఈ కొరియా కంపెనీ ఆ రెండింటికీ మరో సీక్వెల్ తీసుకురావాలని నిర్ణయించింది. హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో మంచి విజయాలు సాధించిన ఐ సిరీస్ను కొనసాగించేందుకే కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం నిర్ణయించింది. ఇప్పటికే యూరోపియన్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా మార్కెట్లలో విడుదలైన ఐ30 వ్యాగన్ కారును భారతదేశంలో కూడా విడుదల చేస్తుందని ఆశిస్తున్నారు. వచ్చే నెలలో జెనీవాలో జరగబోయే మోటర్ షో కంటే ముందుగానే ఈ కారును చూపించడం గమనార్హం.
ఈ కారుకు సంబంధించిన టీజర్ ఇమేజిని తాజాగా విడుదల చేశారు. ఐ30లో ఇంతకుముందు వచ్చిన రెండు ఎడిషన్ల కంటే ఎక్కువ స్థలం ఉంటుందని చెబుతున్నారు. దాని డిజైన్ కూడా అద్భుతంగా ఉండబోతోందని కంపెనీ చీఫ్ డిజైనర్ థామస్ బర్కిల్ అన్నారు. ఇందులో కొత్త స్టీరింగ్, పనోరమిక్ గ్లాస్ సన్రూఫ్, 8 అంగుళాల టచ్ స్క్రీన్.. ఇవన్నీ ఉంటాయని భావిస్తున్నారు.