కేంద్ర ఇంటెలిజెన్స బ్యూరోకు వెళ్లిన అశోక్ ప్రసాద్
తర్వాత ఐబీ చీఫ్ ఆయనే అంటున్న ఐపీఎస్ వర్గాలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అశోక్ ప్రసాద్ కేంద్ర ఇంటెలిజెన్స బ్యూరోలో రిపోర్టు చేశారు. నిన్నటి వరకు జమ్మూకాశ్మీర్ రాష్ట్ర డీజీపీగా బాధ్యతలను నిర్వహించిన అశోక్ ప్రసాద్, తన స్థానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజేంద్రకుమార్ ఆ రాష్ట్ర డీజీపీగా నియమితులు కావడంతో ఆయన ఏపీకి తిరిగి వస్తారా? అనే చర్చ సాగింది. అయితే 1979 బ్యాచ్‌కు చెందిన ఈయన రాష్ట్రంలో కొంత కాలం ఎస్పీ, డీఐజీ స్థాయిలలో పనిచేశాక నేరుగా కేంద్ర ఇంటెలిజెన్స బ్యూరోకి వెళ్లి పోయారు.
అప్పటి నుంచి ఆయన ఐబీలోనే కొనసాగుతూ, తర్వాత డెప్యుటేషన్‌పై జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక పరిస్థితుల్లో డీజీపీగా నియమితులయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఎవరు డీజీపీ అవుతారనే విషయమై చర్చ సాగుతుండగా జేకేలో రిలీవ్ అయిన అశోక్‌ప్రసాద్ తిరిగి రాష్ట్రానికి రావచ్చనే ఊహాగానాలు సాగాయి. కాగా ఆయన ఐబీలోనే కొనసాగడానికి ఆసక్తిని చూపించారు. అంతేగాక ప్రస్తుత ఐబీ డెరైక్టర్ జనరల్ ఇబ్రహీం పదవీ కాలం ముగిశాక అశోక్ ప్రసాద్‌ను ఈ విభాగం చీఫ్‌గా నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.