పదకొండేళ్లుగా కూతురిపై అత్యాచారం.. ఆమె బిడ్డకు తండ్రి!!
సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన ఇది. కన్న కూతురిపై పదకొండేళ్లుగా అత్యాచారం చేస్తూ ఆమెతో కలిసి ఓ బిడ్డను కూడా కన్నాడో నీచుడు. ఈ ఘోరానికి పాల్పడిన ఇబ్రహీం షేక్ (50), చివరకు ఆమెను పెళ్లాడేందుకు కూడా సిద్ధపడటంతో, ఇక తట్టుకోలేక ఆమె ఓ సామాజిక కార్యకర్త సాయంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ దారుణం ముంబైలో చోటుచేసుకుంది. మల్వానీ ప్రాంత పోలీసుల కథనం ప్రకారం, బాధితురాలికి 15 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి ఈ ఘోరం కొనసాగుతోంది.
ఆమెకు మానవ శరీర నిర్మాణం గురించి చెబుతాననే వంకతో అతడు పలుమార్లు కన్నకూతురిపై అత్యాచారం చేశాడు. విషయం తెలిసిన భార్య అభ్యంతరం వ్యక్తం చేయగా, ఆమెను గొడ్డును బాదినట్లు బాదేశాడు. ముంబై శివార్లలోని మల్వానీ ప్రాంతంలో ఉన్న తమ ఇంట్లోనే ఇన్నేళ్లపాటు కూతురిపై అత్యాచారం చేశాడు. తన ఎనిమిదేళ్ల బిడ్డకు కూడా తన తండ్రే కన్న తండ్రి అని బాధితురాలు వాపోయింది. ప్రతిరోజూ పని కోసం జైపూర్ - ముంబై నగరాల మధ్య ఇబ్రహీం షేక్ తిరుగుతుంటాడు. అతడిని అరెస్టు చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇబ్రహీం షేక్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు అతడికి డిసెంబర్ 3వ తేదీ వరకు రిమాండు విధించింది. బాధితురాలి కూతురికి అతడే తండ్రా.. కాదా అనే విషయాన్ని నిర్ధరించేందుకు తగిన వైద్య పరీక్షలు చేయిస్తామని పోలీసులు తెలిపారు.