ఇబ్రహీంపూర్.. సూపర్
సాక్షి, సిద్దిపేట: ‘ఊరంటే ఇలా ఉండాలి.. ప్రభుత్వం చేపట్టిన ప్రతీ సంక్షేమ పథకం ఇక్కడ అమలవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలయ్యే నిధుల్లో ప్రతీ పైసా సద్వినియోగం అవుతోంది. ఉపాధి హామీ పథకం అమల్లో ఇబ్రహీంపూర్ గ్రామం దేశాని కే ఆదర్శంగా నిలిచింది. మీ నాయకుడు హరీశ్‌రావు ప్రత్యేక శ్రద్ధకు, మీ అందరి ఐక్యతకు అభినందనలు.. మీ గ్రామం నుంచి మేం ఎంతో నేర్చుకున్నాం’ అని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రతినిధుల బృందం ప్రశంసించింది. ఎన్ఐఆర్డీ ఆధ్వర్యంలో దేశంలోని 15 రాష్ట్రాల నుంచి వచ్చిన చీఫ్ విప్‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హరియాణా విధాన సభ స్పీకర్ సహా మొత్తం 61 మందితోపాటు, 25 మంది ఐఏఎస్‌లు సిద్దిపేట నియోజకవర్గంలోని హరీశ్‌రావు దత్తత గ్రామం ఇబ్రహీంపూర్ గ్రామాన్ని గురువారం సందర్శించారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు వారికి స్వాగతం పలికారు. ప్రధానంగా ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా చేపట్టే 26 పనులు ఇబ్రహీంపూర్లో సంపూర్ణంగా అమలు జరగడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతీ పని గురించి ఫొటోలు తీసుకున్నారు. హరియాణా స్పీకర్ కుంపర్పాల్ మాట్లాడుతూ.. ఇబ్రహీంపూర్ గ్రామం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇక్కడి పథకాలను తమ రాష్ట్రాల్లో అమలు చేస్తామని చెప్పారు. గ్రామస్వరాజ్యమే దేశ స్వరాజ్యం అనడానికి ఇబ్రహీంపూర్ గ్రామం నిదర్శనమని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కాపురాజయ్య పెయింటింగ్‌లు, మహిళా ప్రతినిధులకు సిద్దిపేట జిల్లాకు ప్రత్యేకతగా నిలిచే గొల్లభామ చీరలను అందజేశారు.
ఐకమత్యంతోనే సాధ్యపడింది..
గ్రామస్తుల ఐకమత్యంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమైందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వం ఏదైనా కొత్త పథకం ప్రవేశపెడితే దానిని ఇక్కడ అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు. దక్షిణ భారత దేశంలోనే నగదు రహిత క్రయవిక్రయాలు అమలు చేసిన గ్రామంగా ఈ ఊరుకు పేరుందని చెప్పారు. ఇబ్రహీంపూర్ గ్రామాన్ని సందర్శించేందుకు వివిధ రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులు రావడం సంతోషంగా ఉందన్నారు. కొందరు విదేశీ ప్రతినిధులు కూడా గ్రామాన్ని సందర్శించి వెళ్లారని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇబ్రహీంపూర్ గ్రామం గురించి చర్చ జరగడం ఈ గ్రామస్తుల అదృష్టంగా ఆయన అభివర్ణించారు. గ్రామంలోని చిన్నా.. పెద్దా ఐక్యంగా ఉండటం అభినందనీయమని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. భవిష్యత్‌లో కూడా గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిస్తామని చెప్పారు.