ఏకగ్రీవంగా ఆమోదం
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)పై పూర్తి పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న బీసీసీఐ ప్రయత్నాలు ఫలించేటట్టు కనిపిస్తున్నాయి. మంగళవారం జరిగిన ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో కొత్త ప్రతిపాదనల్లో చాలా వాటికి సభ్య దేశాల నుంచి ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఆరు గంటలపాటు వాడివేడిగా జరిగిన చర్చలో ఇతర సభ్య దేశాల నుంచి ఈ విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో వాటిపై ఓటింగ్ జరుపకుండా వచ్చే నెలలో మరోసారి చర్చిద్దామని తెలిపింది.
భవిష్యత్ నిర్మాణం, పరిపాలన, ఆదాయ పంపిణీకి సంబంధించి ప్రతిపాదనలపై ఏకగ్రీవ ఆమోదం లభించినట్టు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం అంగీకారం పొందిన వాటితో బీసీసీఐ, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులకు అధిక ప్రయోజనం కలుగనుంది. ఆదాయ పంపిణీలోనూ, కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ ఈ ముగ్గురిదే ఇక ఆధిపత్యం ఉండనుంది.
ఆమోదం పొందిన ప్రతిపాదనలు:
ఐసీసీలో ఇక నుంచి బీసీసీఐ ప్రధాన నాయకత్వ బాధ్యతలు తీసుకుంటుంది.
ఐసీసీలోని సభ్య దేశాలన్నింటికీ మెరిట్ ఆధారంగా అన్ని ఫార్మాట్లలో ఆడే వీలు కలుగుతుంది. సభ్యత్వ విషయంలో మార్పు ఉండదు.
టెస్టు క్రికెట్ నిధిని కొత్తగా ఏర్పాటు చేస్తారు. దీంట్లో నుంచి బీసీసీఐ, ఆసీస్, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులకు మినహా మిగిలిన అన్ని దేశాలకు వార్షిక పద్దతిన ఆదాయం సమానంగా పంపిణీ అవుతుంది.
శాశ్వత సభ్య దేశాలు కాని బోర్డుల్లో అత్యున్నత ప్రదర్శన కనబరిచిన వాటికి ప్రోత్సాహకంగా అధిక ఆదాయాన్ని పంపిణీ చేస్తారు.
నాలుగేళ్లలో మూడు ప్రధాన ఐసీసీ ఈవెంట్స్ జరుగుతాయి. దీంట్లో చాంపియన్స్ ట్రోఫీ కూడా ఉంటుంది. ముందుగా అనుకున్నట్లు టెస్టు చాంపియన్షిప్ ఆలోచన విరమించుకున్నారు.
నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటవుతుంది. ఆర్థిక , వాణిజ్య వ్యవహారాల కమిటీతో కలిసి పలు కీలక నిర్ణయాల్లో దీనిదే పెత్తనం. భారత్, ఆసీస్, ఇంగ్లండ్ బోర్డుల ప్రతినిధులతో పాటు ఈ కమిటీలో ఐదుగురు సభ్యలు ఉంటారు.
ఐసీసీ బోర్డుకు వచ్చే జూన్ నుంచి శ్రీనివాసన్ చైర్మన్గా వ్యవహరిస్తారు. ఎగ్జిక్యూటివ్ కమిటీకి క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధి చైర్మన్, ఆర్థిక , వాణిజ్య వ్యవహారాల కమిటీకి ఈసీబీ ప్రతినిధి చైర్మన్గా వ్యవహరిస్తారు. రెండేళ్ల పాటు వీరు పదవిలో ఉంటారు.