‘ఎమర్జింగ్ క్రికెటర్’ పుజారా
దుబాయ్: టెస్టుల్లో నిలకడగా ఆడుతున్న భారత యువ క్రికెటర్ చతేశ్వర్ పుజారాకు... ‘ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్’ అవార్డు లభించింది. టీమిండియా కెప్టెన్ ధోని ‘పీపుల్స్ చాయిస్’ పురస్కారాన్ని ఇప్పటికే సొంతం చేసుకోగా, ఆసీస్ సారథి మైకేల్ క్లార్క్ రెండు అత్యున్నత అవార్డులను గెలుచుకున్నాడు. మొత్తం 11 వ్యక్తిగత విభాగాల్లో ఐసీసీ వార్షిక అవార్డులను శుక్రవారం ప్రకటించింది. ఉత్తమ క్రికెటర్ (గ్యారిఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ), ఉత్తమ టెస్టు క్రికెటర్ పురస్కారాలు క్లార్క్‌కు దక్కాయి. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఓ టీవీ షోలో ఈ అవార్డులను ప్రకటించారు. ఈ కార్యక్రమం శనివారం (స్టార్ స్పోర్ట్స్ -1లో సా. గం. 7.00 నుంచి) టీవీలో ప్రసారం అవుతుంది.
డిసెంబర్ 3న ఎంపిక చేసిన ఐసీసీ టెస్టు, వన్డే జట్టులో క్లార్క్‌కు చోటు దక్కిన సంగతి తెలిసిందే.
తొలిసారి ఐసీసీ అవార్డు అందుకుంటున్న పుజారా ఈ ఏడాది టెస్టుల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. హైదరాబాద్‌లో ఆసీస్‌పై డబుల్ సెంచరీ సాధించడంతో పాటు మురళీ విజయ్‌తో కలిసి రెండో వికెట్‌కు 370 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో పాటు టెస్టుల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా 15 టెస్టుల్లో 65.50 సగటుతో 1310 పరుగులు చేశాడు.
మహిళల టి20 ఉత్తమ క్రికెటర్‌గా సారా టేలర్ (ఇంగ్లండ్) వరుసగా రెండో ఏడాది ఐసీసీ అవార్డును సొంతం చేసుకుంది. గాలె (2012)లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో 91 పరుగుల వద్ద అవుటైనప్పుడు అంపైర్ నిర్ణయాన్ని ప్రకటించకముందే పెవిలియన్‌కు వెళ్లిపోయిన జయవర్ధనేకు రెండోసారి ‘స్పిరిట్ ఆఫ్ క్రికెట్’ అవార్డు లభించింది. అవార్డులు గెలుచుకున్న క్రికెటర్లకు ఐసీసీ అధ్యక్షుడు అలెన్ ఇసాక్ శుభాకాంక్షలు తెలిపారు.
అవార్డు విజేతల జాబితా
ఉత్తమ క్రికెటర్ (సర్ గ్యారిఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ) : మైకేల్ కార్ల్క్ (ఆస్ట్రేలియా)
ఉత్తమ టెస్టు క్రికెటర్: మైకేల్ క్లార్క్
ఉత్తమ వన్డే క్రికెటర్: సంగక్కర (శ్రీలంక)
ఉత్తమ మహిళా వన్డే క్రికెటర్:
సుజీ బేట్స్ (న్యూజిలాండ్)
ఎమర్జింగ్ క్రికెటర్: చతేశ్వర్ పుజారా (భారత్)
అసోసియేటెడ్, అఫిలియేటెడ్ ఉత్తమ క్రికెటర్: కెవిన్ ఓబ్రియాన్ (ఐర్లాండ్)
అంతర్జాతీయ టి20ల్లో ఉత్తమ ప్రదర్శన: ఉమర్ గుల్ (పాకిస్థాన్)
టి20ల్లో ఉత్తమ మహిళా క్రికెటర్: సారా టేలర్ (ఇంగ్లండ్)
స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు: జయవర్ధనే (శ్రీలంక)
ఉత్తమ అంపైర్ (డేవిడ్ షెపర్డ్ ట్రోఫీ): రిచర్డ్ కెటెల్బోర్గ్
పీపుల్స్ చాయిస్ అవార్డు: ఎం.ఎస్.ధోని