ఐస్లాండ్ ప్రధాని ఔట్
పారిస్/వాషింగ్టన్/సియోల్/బీజింగ్: ప్రపంచ దేశాల్లో పనామా పత్రాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పలువురు దేశాధ్యక్షులు, ప్రధానుల పేర్లు ఇందులో వెలుగుచూడడంతో ఆ దేశాల్లో రాజకీయ దుమారం రేగుతోంది. ప్రజాగ్రహం పెల్లుబికడంతో ఐస్లాండ్ ప్రధాని సిగ్ముందర్ గన్లాగ్సన్ గద్దెదిగారు. ఈయన తన భార్య అన్నా సిగుర్లాగ్ పేరిట విదేశాల్లో పెద్దఎత్తున నల్లధనం వెనకేశారని పనామా పత్రాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం వేలాది మంది ప్రజలు పార్లమెంట్ చెంత ఆందోళనకు దిగారు.
తాను ఎలాంటి తప్పు చేయలేదని, అన్ని పన్నులు చెల్లించానని వివరణ ఇచ్చుకున్నా ప్రజలు శాంతించలేదు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో మంగళవారం రాజీనామా చేశారు. అంతకుముందు పార్లమెంట్‌ను రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్తానని ఆయన హెచ్చరించారు. ఇదే విషయాన్ని అధ్యక్షుడు ఒలాఫర్ రగ్నార్ గ్రిమ్సన్ను కలిసి చెప్పారు. అయితే అందుకు అధ్యక్షుడు నిరాకరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేశారు. పార్లమెంట్ రద్దుకు ప్రధాని చేసిన ప్రతిపాదనను అధ్యక్షుడు తిరస్కరించడం అసాధారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
టునీషియాలో ఇ-మేగజీన్ హ్యాక్
పనామా పత్రాలను విశ్లేషిస్తామని వెల్లడించిన కాసేపటికే టునీషియాలోని ‘ఇంకిఫదా’ అనే ఇ-మేగజీన్‌ను కొందరు దుండగులు హ్యాక్ చేశారు. హ్యాక్ చేశాక మేగజీన్ సైట్లో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేశారని ఆ పత్రిక ఎడిటోరియల్ చీఫ్ మోనియా బెన్ హమాది వెల్లడించారు.
ఆ పత్రాలను పరిశీలిస్తున్నాం: అమెరికా
పనామా పత్రాలు వెల్లడించిన అంశాల్లోని నిజానిజాలను పరిశీలిస్తున్నట్టు అమెరికా తెలిపింది. ఆ పత్రాల్లోని ఆరోపణలపై స్పందించబోమని, అయితే అందులో వెల్లడైన అంశాలను జాగ్రత్తగా గమనిస్తున్నట్టు దేశ న్యాయ శాఖ ప్రతినిధి పీటర్ కర్ తెలిపారు. ‘‘అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో మేం పారదర్శకత కోరుకుంటున్నాం. అలాగే అవినీతి నిర్మూలనకు, అక్రమ లావాదేవీలను కట్టడి చేసేందుకు అమెరికా కట్టుబడి ఉంటుంది’’ అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జోష్ ఎర్నెస్ట్ పేర్కొన్నారు.
పనామాను ఆ జాబితాలో చేరుస్తాం: ఫ్రాన్స్
తమ దేశానికి సహకరించని జాబితాలో పనామాను మళ్లీ చేరుస్తామని ఫ్రాన్స్ ప్రకటించింది. పన్నులు ఎగ్గొట్టేవారికి పనామా స్వర్గధామంగా మారినట్టు తాజా పరిణామాలతో రుజువవడంతో ఆ దేశాన్ని ‘అన్కోపరేటివ్ స్టేట్స్ అండ్ టెరిటరీస్’(ఈటీఎన్సీ) జాబితాలో చేరుస్తామని ఆర్థిక మంత్రి మిషెల్ సపిన్ తెలిపారు. ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదరడంతో పనామాను ఫ్రాన్స్ ఈ జాబితా నుంచి 2012లో తొలగించింది.
ఫోన్సెకా క్లయింట్‌గా కొరియా ‘అణు’ కంపెనీ
ఉత్తర కొరియా అణు కార్యకలాపాలకు సహకరిస్తున్న ఓ కంపెనీ మొసాక్ ఫోన్సెకాకు క్లయింట్‌గా ఉన్నట్టు పనామా పేపర్ల ద్వారా వెలుగులోకి వచ్చింది. డీసీబీ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ మొసాక్ సహకారంతో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో 2006లో ఓ ఉత్తుత్తి కంపెనీ నెలకొల్పింది. కాకతాళీయంగా అదే ఏడాదిలో ఉత్తర కొరియా తొలి అణుపరీక్ష నిర్వహించింది.
చైనాలో ‘పనామా’పై ఆంక్షలు
పనామా పత్రాల్లో 12 మంది ప్రస్తుత, మాజీ దేశాధినేతల పేర్లు వెలుగుచూడడంతో ఆయా దేశాల్లో జనం ఆందోళనలకు దిగుతున్నారు. అవినీతి నేతలు గద్దెదిగాలని డిమాండ్ చేస్తున్నారు. అటు విపక్షాలూ పనామా పత్రాలను ఆయుధంగా మార్చుకొని అధికారపక్షంపై దాడికి దిగుతున్నాయి. మరికొన్ని దేశాలేమో పనామా సమాచారంపై ఆంక్షలు విధించాయి. ఈ విషయంలో చైనా ముందుంది. మొసాక్ ఫోన్సెకా నుంచి బట్టబయలైన పత్రాల వివరాలు జనాలకు అందుబాటులోకి లేకుండా చూసేం దుకు నానా తంటాలు పడుతోంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా అనేక మంది ముఖ్య రాజకీయ నేతలు పెద్దఎత్తున నల్లధనం కూడబెట్టారని పనామా పేపర్స్ వెల్లడించడంతో వివిధ వెబ్సైట్లు, సామాజిక మాధ్యమాలపై అధికార యంత్రాంగం ఆంక్షలు విధించింది. ఇంటర్నెట్లో పనామా, దానికి సంబంధించిన పేర్లతో శోధించే ప్రయత్నాలన్నింటినీ నిలువరిస్తోంది. ‘‘పనామా పేపర్స్‌లోని అంశాలన్నీ నిరాధారం. దీని వెనుక పశ్చిమ దేశాల శక్తులున్నాయి’’ అని చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
బ్రిటన్ ప్రధానిపై ఒత్తిడి
పనామా పత్రాల్లో తన తండ్రి ఇయాన్ కామెరూన్ పేరు వెలుగుచూడడంతో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ తల పట్టుకున్నారు. విదేశాల్లో పేపర్ కంపెనీ నెలకొల్పిన ఇయాన్(2010లో చనిపోయారు) పన్ను ఎగ్గొట్టారని పనామా పేపర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో కామెరూన్ ప్రధాని పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.