icij
-
సంచలనం: అడ్డదారిలో ఉబర్ క్యాబ్,వేల కోట్ల డాలర్ల నిధులు మళ్లింపు!
యాప్ ఆధారిత చౌక ట్యాక్సీ సేవల పేరుతో దశాబ్ద కాలం క్రితం (2009లో) కార్యకలాపాలు ప్రారంభించిన ఉబర్ .. అతి తక్కువ కాలంలోనే అత్యంత వేగంగా 30 పైచిలుకు దేశాల్లో వ్యాపారాన్ని విస్తరించింది. ఈ క్రమంలో వ్యవస్థలను, రాజకీయ నేతలను మేనేజ్ చేసింది. డ్రైవర్లను వాడుకుంది. కార్మిక, ట్యాక్సీ చట్టాలను తనకు అనుకూలంగా మల్చుకునేందుకు వేల కోట్ల డాలర్లు వెచ్చించి నేతలతో లాబీయింగ్ చేయడం మొదలుకుని, పన్నుల ఊసు ఉండని దేశాలకు లాభాలను మళ్లించడం, డ్రైవర్లను బలిపశువులను చేయడం వరకూ అన్ని అడ్డదారులూ తొక్కింది. ఇలా ఉబర్ పాటించిన తప్పుడు విధానాలను రుజువు చేసే డాక్యుమెంట్స్ లీకవడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. టెక్ట్స్ మెసేజీలు, ఈమెయిల్స్ రూపంలో ఉన్న వీటిని ఉబర్ ఫైల్స్ పేరిట అంతర్జాతీయంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల కన్సార్టియం అయిన ఐసీఐజే బైటపెట్టింది. గతంలో ప్రముఖుల అక్రమాస్తులను పనామా పేపర్స్ పేరిట బైటపెట్టి సంచలనం సృష్టించినది కూడా ఈ ఐసీఐజేనే కావడం గమనార్హం. 1,24,000 పైచిలుకు డాక్యుమెంట్స్ లీక్ కాగా వీటిలో 83,000 పైచిలుకు ఈమెసేజీలు, వాట్సాప్ మెసేజీలు ఉన్నాయి. ఉబర్ సహ–వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో ట్రావిస్ కలానిక్ సారథ్యంలో 2013–2017 మధ్య కాలంలో ఉబర్ విస్తరణ గురించిన వివరాలు వీటిలో ఉన్నాయి. లింగ వివక్ష, లైంగిక వేధింపుల ఆరోపణలతో 2017లో కలానిక్ బలవంతంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ డాక్యుమెంట్లు తొలుత బ్రిటిష్ న్యూస్‌పేపర్ ది గార్డియన్‌కు, అక్కణ్నుంచి ఐసీఐజేకి అందాయి. యూరప్‌లో ఉబర్ తరఫున లాబీయిస్టుగా పనిచేసిన మార్క్ మెక్‌గాన్.. ఈ అక్రమాలను బైటపెట్టడంలో కీలకమైన ప్రజావేగుగా వ్యవహరించారు. యధేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన.. రైడ్ షేరింగ్ యాప్ ద్వారా చౌకగా ట్యాక్సీ సేవలను అందించే క్రమంలో ఉబర్ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినట్లు అనిపించినప్పటికీ.. వాస్తవానికి వ్యాపార విస్తరణ కోసం నిబంధనలన్నింటినీ ఉల్లంఘించినట్లు ఉబర్ ఫైల్స్ ద్వారా వెల్లడైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సన్నిహితులైన వ్యక్తులు ఉబర్‌కు లాబీయిస్టులుగా పనిచేశారు. కంపెనీ మీద వస్తున్న ఆరోపణలపై విచారణ నిలిపివేయాలంటూ దర్యాప్తు సంస్థలను, కార్మిక .. ట్యాక్సీ చట్టాలను సవరించాలంటూ, డ్రైవర్ల బ్యాగ్రౌండ్ ధ్రువీకరణ నిబంధనలను సడలించాలంటూ అధికారులపై వారు ఒత్తిడి తెచ్చారు. యూరప్ తదితర మార్కెట్లలోనూ ఉబర్ ఇదే తరహా ధోరణిలో విస్తరించింది. అప్పటి ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి ఎమాన్యుయెల్ మాక్రాన్ (ప్రస్తుత అధ్యక్షుడు), యూరోపియన్ కమిషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ నీలీ క్రోయెస్ వంటి వారు ఇందుకు సహకరించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇక, మిగతా మార్గాలేవీ పనిచేయనప్పుడు విచారణ జరిపే దర్యాప్తు సంస్థలకు వివరాలను దొరకనియ్యకుండా చేసేందుకు ఉబర్ ‘‘కిల్ స్విచ్’’అనే స్టెల్త్ టెక్నాలజీని ఉపయోగించింది. సోదాల్లో కీలక ఆధారాలు అధికారులకు చిక్కకుండా ఇది ఆటోమేటిక్‌గా ఉబర్ సర్వర్లకు యాక్సెస్ నిలిపివేసేది. ఉబర్ ఇలా కనీసం ఆరు దేశాల్లో చేసింది. అలాగే, మిలియన్ల కొద్దీ డాలర్ల పన్నులను ఎగ్గొట్టేందుకు ఉబర్ తనకు వచ్చే లాభాలను బెర్ముడా తదితర ట్యాక్స్ హేవెన్స్కు (పన్నుల భారం ఉండని దేశాలు) మళ్లించింది. ఔను తప్పే.. కానీ ఇప్పుడు మారాము.. తాజా పరిణామాలపై ఉబర్ స్పందించింది. గతంలో తప్పిదాలు జరిగిన సంగతి వాస్తవమేనని.. వాటిని సమర్థించుకోబోమని పేర్కొంది. ఆ తప్పిదాల ఫలితంగా పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించినట్లు ఉబర్ తెలిపింది. కొత్త సీఈవో దారా ఖుస్రోవ్షాహీ వచ్చాక గత అయిదేళ్లలో కంపెనీ పనితీరు పూర్తిగా మారిపోయిందని వివరించింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో 90 శాతం మంది .. దారా సీఈవోగా వచ్చాక చేరినవారేనని పేర్కొంది. పోటీ సంస్థలతో పాటు లేబర్ యూనియన్లు, ట్యాక్సీ కంపెనీలు మొదలైన వర్గాలతో చర్చలు జరిపేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు ఉబర్ వివరించింది. -
పనామా పేపర్లు : మళ్లీ సంచలనం
న్యూఢిల్లీ : పనామా పేపర్ల కుంభకోణం మళ్లీ తెరపైకి వచ్చింది. రెండేళ్ల తర్వాత లా కంపెనీ మొస్సాక్ ఫొన్సెకాకు చెందిన మరికొన్ని పరిశోధనాత్మక పత్రాలు బయటకు వచ్చాయి. దాదాపు 12 లక్షలకు పైగా సరికొత్త పత్రాలను ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) అధ్యాయనం చేసిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం బయటపెట్టిన పత్రాలన్నింటిని దక్షిణ జర్మనీ వార్తాపత్రిక సేకరించింది. వీటిలో దాదాపు 12 వేల పత్రాలు భారతీయులకు సంబంధించినవి కావడం గమనార్హం. 2016లో దాదాపు 500 మంది భారతీయుల పేర్లు మొస్సాక్ ఫొన్సెకాకు చెందిన పత్రాల్లో ఉన్నాయి. వీటిపై విచారణ జరిపేందుకు భారత ప్రభుత్వం మల్టీ ఏజెన్సీ గ్రూప్(ఎమ్‌ఏజీ)ను ఏర్పాటు చేసింది. 2016 లీక్‌ల ద్వారా దాదాపు 1000 కోట్ల రూపాయల నల్లధనాన్ని ఎమ్‌ఏజీ గుర్తించింది. కొత్త లీక్‌లో ఉన్న విషయాలేంటి..? కొత్త పత్రాల్లో భారత్‌కు చెందిన పలువురు ప్రముఖ వ్యాపారవేత్తల పేర్లు ఉన్నాయి. వీరి పేర్లు 2016 లీక్స్‌లో లేవు. - పీవీఆర్ సినిమా యజమాని అజయ్ బిజ్లీ, ఆయన కుటుంబ సభ్యులు - సునీల్ మిట్టల్ కుమారుడు, హైక్ మెసేంజర్ సీఈవో, భారతీ ఎయిర్టెల్ సీఈవో కవిన్ భారతి మిట్టల్ - ఏషియన్ పెయింట్స్ ప్రమోటర్ అశ్విన్ దాని కుమారుడు జలాజ్ అశ్విన్ దాని వీరికి లింక్‌లు ఉన్నాయని తేలింది.. పనామా పేపర్లలో తమ పేర్లు రావడాన్ని ఖండించిన కొందరు ప్రముఖుల పేర్లు మళ్లీ బయటకు వచ్చాయి. వీరికి ఆఫ్ షోర్ కంపెనీలతో బిజినెస్ లింక్స్ ఉన్నట్లు కచ్చితమైన ఆధారాలను ఐసీఐజే జర్నలిస్టులు సంపాదించారు. సదరు ప్రముఖుల పేర్లు ఇవే.. - శివ్ విక్రమ్ ఖేమ్కా - నటుడు అమితాబ్ బచ్చన్ - మాజీ సొలిసిటర్ జనరల్ తనయుడు జహంగీర్ సోరబ్జీ - డీఎల్ఎఫ్ గ్రూప్‌కు చెందిన కేపీ సింగ్, ఆయన కుటుంబం - అనురాగ్ కేజ్రీవాల్ - మెహ్రాసన్స్ జ్యువెల్లర్స్‌కు చెందిన నవీన్ మెహ్రా - అండర్ వరల్డ్ డాన్ ఇక్బాల్ మిర్చి భార్య హజ్రా ఇక్బాల్ మెమన్ -
‘ప్యారడైజ్ పేపర్లు’ లీక్
-
ప్రపంచ వ్యాప్తంగా ‘ప్యారడైజ్’ ప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ : పనామా పత్రాలు సృష్టించిన కల్లోలం ఇంకా పూర్తిగా మార్చిపోకముందే అదే తరహాలో పరిశోధక జర్నలిస్టులు విడుదల చేసిన ‘ప్యారడైజ్ పత్రాలు’ ప్రపంచవ్యాప్తంగా కుబేరుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. బ్రిటన్ రాణి ఎలిజబెత్, అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రోస్ సహా పలువురు భారతీయ కుబేరుల అక్రమాలను బహిర్గతం చేశాయి. దాదాపు 714 మంది భారతీయ సంపన్నులు, వందలాది కంపెనీలు పన్నులు ఎగ్గొట్టాయని తెలిపాయి. పన్నులు ఎగ్గొట్టేందుకు తమ ఆస్తులను బెర్ముడా, కేమాన్ ఐలాండ్స్ వంటి దేశాల్లో ఎలా దాచుకున్నదీ ఇవి వెల్లడించాయి. వివిధ దేశాల్లోని 96 వార్తాసంస్థల భాగస్వామ్యంతో విచారణ జరిపిన ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) మొత్తం 1.3 కోట్ల పత్రాలను బహిర్గతం చేసింది. ఈ అక్రమాస్తులకు సంబంధించి 180 దేశాలకు ర్యాంకులు కేటాయించగా మనదేశం 19వ స్థానంలో నిలిచింది. గతంలో పనామా పేపర్స్‌ను లీక్ చేసింది కూడా ఐసీఐజేయే! బెర్ముడా దేశంలోని ‘ఆపిల్‌బీ’ అనే న్యాయసంస్థ నుంచి, సింగపూర్‌కు చెందిన ఆసియా సిటీ సంస్థల నుంచి ఈ డాక్యుమెంట్లను రాబట్టింది. ఈ రెండు సంస్థలూ కుబేరుల సంపద, ఆస్తులను విదేశాలకు తరలిస్తుంటాయి. నంద్లాల్ ఖేమ్కా అనే భారతీయ వ్యాపారికి ఆపిల్బీలో ఏకంగా 118 కంపెనీలను నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. కేంద్ర వైమానికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా, బీజేపీ ఎంపీ ఆర్కే సిన్హా, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ పేర్లు కూడా ప్యారడైజ్పత్రాల్లో కనిపించాయి. కార్పొరేట్ లాబీయిస్టు నీరా రాడియా, సంజయ్ దత్ భార్య మాన్యత సైతం విదేశాల్లో ఆస్తులు కూడబెట్టినట్టు తేలింది. తాము ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదని, తమ ఆస్తుల లెక్కలన్నీ సక్రమంగానే ఉన్నాయని వారు వివరణ ఇచ్చారు. రెండోస్థానంలో భారతీయులు ఆపిల్‌బీ ఖాతాదారుల్లో భారతీయులు రెండోస్థానంలో ఉన్నారు. మరో రెండు రోజుల్లో ప్రభుత్వం పెద్ద నోట్లను ప్రకటించి ఏడాది పూర్తయిన క్రమంలో నల్లధన వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంలో ఈ కుంభకోణం వెలుగులోకి రావడం తీవ్ర ప్రకంపనాలను సృష్టిస్తోంది. ఈ ప్యారడైజ్ పేపర్లు ఆఫ్‌షోర్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన అంతర్జాతీయస్థాయి ప్రముఖుల వివరాలను కూడా బయటపెట్టాయి. వీటిలో అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రోస్ పేరు కూడా ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అల్లుడికి చెందిన ‘నేవిగేటర్ హోల్డింగ్స్’లో ఆయనకి వాటా ఉన్నట్టు వెల్లడయింది. పేపర్ల లీకేజీపై స్పందించిన ఆపిల్‌బీ తమ సమాచారం చోరీ అయిందని, అయితే తమ వద్ద ఎటువంటి అవకతవకలూ జరగలేని స్పష్టం చేసింది. కాగా, పనామా పేపర్స్ కుంభకోణంలో చిక్కుకున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీప్ తన పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో పాక్ మాజీ ప్రధాని షౌకత్ అజీజ్ పేరు కూడా ఈ జాబితాలో కనిపించింది. బెర్ముడా దేశంలో దాచిన నగదు గురించి ఆయన ఎన్నడూ వెల్లడించలేదని ఐసీఐజే తెలిపింది. దాదాపు 135 పాకిస్థాన్ సంపన్నుల పేర్లు అప్లెబీలో ఉన్నాయి. విచారణ జరుపుతాం : సెబీ ప్యారడైజ్ పత్రాలు పేర్కొన్న భారతీయ కార్పొరేట్ సంస్థలపై, పారిశ్రామిక వేత్తలపై విచారణ జరుపుతామని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రకటించింది. ఈ పత్రాలు పేర్కొన్న కంపెనీల్లో కొన్నింటిపై ఇది వరకే విచారణ కొనసాగుతోందని తెలిపింది. పన్నుల్లేని దేశాల్లో మదుపు చేసిన వాళ్లంతా నేరం చేసినట్టుగా భావించలేమని సెబీ అధికారి ఒకరు అన్నారు. లెక్కలు లేని ధనం, అక్రమంగా డబ్బు తరలిస్తే మాత్రం చర్యలు ఉంటాయని తెలిపింది. విజయ్ మాల్యా కంపెనీలతోపా టు జిందాల్‌స్టీల్, ఎస్సార్ షిప్పింగ్, వీడియోకాన్ ఇండస్ట్రీస్, సన్ టీవీ, అపోలో టైర్స్ సంస్థల పేర్లు ఈ పత్రాల్లో ఉన్నాయి. -
‘ప్యారడైజ్ పేపర్లు’ లీక్
వాషింగ్టన్ : అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి విల్బర్ రాస్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితులకు చెందిన షిప్పింగ్ కంపెనీతో ఉన్న వ్యాపార సంబంధాలు బట్టబయలయ్యాయి. ఇంటర్నేషనల్ కన్సోర్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) ఇందుకు సంబంధించిన ప్యారడైజ్ పేపర్లను లీక్ చేసింది. ప్రపంచంలోని పలువురు ప్రముఖుల పేర్లు ఈ ఆఫ్ షోర్ ఇన్వెస్ట్మెంట్ పేపర్లలో ఉన్నాయి. బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2తో పాటు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడూకు చెందిన టాప్ ఫండ్ రైజర్, సీనియర్ సలహాదారు స్టీఫెన్ బ్రౌన్ఫ్మన్ల పేర్లు కూడా ‘ప్యారడైజ్ పేపర్లు’ లో ఉన్నాయి. కెనడా ప్రధానమంత్రికి చెందిన సన్నిహిత వర్గం పన్నును ఎగవేసేందుకు మాజీ సెనేటర్ లియో కొల్బెర్తో కలసి 60 మిలియన్ల డాలర్లు సీ గ్రామ్ ఫార్చూన్‌లో పెట్టుబడి పెట్టినట్లు ఐసీఐజే పేర్కొంది. రాస్, ఎలిజబెత్ 2, బ్రౌన్ఫ్మన్లు అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే, రాస్కు రష్యా కంపెనీలతో సంబంధాలు ఉండటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాస్ రష్యన్ కంపెనీల్లో 31 శాతం వాటాను కలిగివున్నట్లు ప్యారడైజ్ పేపర్ల ద్వారా తెలుస్తోంది. మరోవైపు ట్రుడూకు చెందిన సన్నిహితుల పేర్లు బయటకు రావడంతో ఆయన చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది. వివాదంలో రాణి ఎలిజబెత్-2 : కేమన్ ద్వీపాలు, బెర్ముడాల్లో క్వీన్ 13 మిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టినట్లు ప్యారడైజ్ పేపర్లలో వెల్లడైంది. ఇందులో రెంట్ టూ బై రీటైలర్‌ను బ్రైట్ హౌస్‌ను కూడా క్వీన్ కొనుగోలు చేశారు. దీనివల్ల పేదవారు దోపిడీకి గురయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘ప్యారడైజ్ పేపర్లు’ ఏంటి? బెర్ముడా తదితర ప్రాంతాల్లో ఉన్న ఆఫ్ షోర్ కంపెనీలకు చెందిన డాక్యుమెంట్లే పార్యడైజ్ పేపర్లు. దాదాపు 1,34 లక్షల ప్యారడైజ్ పేపర్లను ఐసీఐజే క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం వివరాలను బయట పెట్టింది. ఈ పేపర్లను తొలుత జర్మనికి చెందిన న్యూస్‌పేపర్ సుడ్డేట్చే జీటంగ్ సంపాదించింది. నిశిత పరిశీలన కొరకు ఐసీఐజే, సహ మీడియా సంస్థలకు అందజేసింది. -
ఇక ఆన్ లైన్ లో పనామా 'నల్ల' పేర్లు!
పనామా సిటీ: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్లు తాజాగా ప్రజలకు ఆన్ లైన్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలో గొప్ప స్థానాల్లో ఉన్న కొందరి అక్రమాలను పనామా పేపర్లు బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఇన్వేస్టిగేటివ్ జర్నలిజంలో ముఖ్య పాత్ర పోషించిన ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వేస్టిగేటివ్ జర్నలిజం (ఐసీఐజే) కోటికిపైగా ఉన్న ఈ డాక్యుమెంట్లన్నింటినీ డిజిటల్ రూపంలో అందరికీ అందుబాటులో ఉండేలా చేసేవిధంగా నిర్ణయించింది. భారతకాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ఆరుగంటల నుంచి పనామా పేపర్లన్నీ ఆఫ్ షోర్ లీక్స్.ఐసీఐజే.ఓఆర్జీ లో అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలో సంపద కలిగి ఆఫ్ షోర్ కంపెనీలను కలిగివున్న 2,00,000 మంది పేర్లను ఇందులో వెల్లడించనున్నట్లు ఐసీఐజే తెలిపింది. ఇప్పటివరకు కేవలం పెద్ద ప్రొఫెల్ ఉన్న వ్యక్తుల వివరాలను(ఐస్ ల్యాండ్ ప్రధానమంత్రి, బ్రిటన్ ప్రధాని, రష్యా ప్రెసిడెంట్, అర్జెంటీనా ప్రధానమంత్రి, చైనా రాజకీయ నాయకులు) మాత్రమే న్యూస్ పేపర్ల ద్వారా బయటపెట్టిన ఐసీఐజే తాజాగా తీసుకున్న నిర్ణయంతో నల్లకుబేరుల జాబితా బయటకు రానుంది. అయితే, సమాచారాన్ని ప్రజలకు తెలియజేయండం తప్పంటూ మొస్సాక్ ఫోన్సెకా ఐసీఐజే మీద పిటిషన్ దాఖలు చేసేందుకు లాయర్ ను నియమించుకుంది. దీనికి సంబంధించి ఐసీఐజే ఎటువంటి ప్రకటనా చేయలేదు. డాక్యుమెంట్లను బయటపెట్టడంలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. -
పనామాలో కేసముద్రం వాసి..?
కేసముద్రం :ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘పనామా పత్రాల’ వ్యవహారంలో కేసముద్రం మండల కేంద్రానికి చెందిన ఓ వ్యాపారి పేరు వినబడడం చర్చనీయూంశమైంది. సదరు వ్యాపారి పేరు బుధవారం వివిధ చానళ్లలో వచ్చింది. ఆ వ్యాపారి కొంతకాలం క్రితం హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే ఓ కంపెనీని నడుపుతూ స్థిరపడ్డాడు. గత రెండు రోజులుగా పనామాలో డబ్బులు దాచుకున్న పలువురు ప్రముఖుల పేర్లు ఐసీఐజే బయటపెట్టడం సంచలనం రేకిత్తించింది. ఇదే క్రమంలో కొందరి తెలుగువారి పేర్లు పనామా వ్యవహారంలో ఉన్నట్లు బుధవారం పలు టీవీ చానళ్లలో రావడం, అందులో కేసముద్రం వాసి పేరు వినిపించడం కలకలం రేపింది.