వాషింగ్టన్ : అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి విల్‌బర్ రాస్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితులకు చెందిన షిప్పింగ్ కంపెనీతో ఉన్న వ్యాపార సంబంధాలు బట్టబయలయ్యాయి. ఇంటర్నేషనల్ కన్సోర్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) ఇందుకు సంబంధించిన ప్యారడైజ్ పేపర్లను లీక్ చేసింది. ప్రపంచంలోని పలువురు ప్రముఖుల పేర్లు ఈ ఆఫ్ షోర్ ఇన్వెస్ట్‌మెంట్ పేపర్లలో ఉన్నాయి.
బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2తో పాటు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడూకు చెందిన టాప్ ఫండ్ రైజర్, సీనియర్ సలహాదారు స్టీఫెన్ బ్రౌన్ఫ్‌మన్‌ల పేర్లు కూడా ‘ప్యారడైజ్ పేపర్లు’ లో ఉన్నాయి. కెనడా ప్రధానమంత్రికి చెందిన సన్నిహిత వర్గం పన్నును ఎగవేసేందుకు మాజీ సెనేటర్ లియో కొల్బెర్‌తో కలసి 60 మిలియన్ల డాలర్లు సీ గ్రామ్ ఫార్చూన్‌లో పెట్టుబడి పెట్టినట్లు ఐసీఐజే పేర్కొంది.
రాస్, ఎలిజబెత్ 2, బ్రౌన్ఫ్‌మన్‌లు అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే, రాస్‌కు రష్యా కంపెనీలతో సంబంధాలు ఉండటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాస్ రష్యన్ కంపెనీల్లో 31 శాతం వాటాను కలిగివున్నట్లు ప్యారడైజ్ పేపర్ల ద్వారా తెలుస్తోంది. మరోవైపు ట్రుడూకు చెందిన సన్నిహితుల పేర్లు బయటకు రావడంతో ఆయన చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది.
వివాదంలో రాణి ఎలిజబెత్-2 :
కేమన్ ద్వీపాలు, బెర్ముడాల్లో క్వీన్ 13 మిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టినట్లు ప్యారడైజ్ పేపర్లలో వెల్లడైంది. ఇందులో రెంట్ టూ బై రీటైలర్‌ను బ్రైట్ హౌస్‌ను కూడా క్వీన్ కొనుగోలు చేశారు. దీనివల్ల పేదవారు దోపిడీకి గురయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
‘ప్యారడైజ్ పేపర్లు’ ఏంటి?
బెర్ముడా తదితర ప్రాంతాల్లో ఉన్న ఆఫ్ షోర్ కంపెనీలకు చెందిన డాక్యుమెంట్లే పార్యడైజ్ పేపర్లు. దాదాపు 1,34 లక్షల ప్యారడైజ్ పేపర్లను ఐసీఐజే క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం వివరాలను బయట పెట్టింది. ఈ పేపర్లను తొలుత జర్మనికి చెందిన న్యూస్‌పేపర్ సుడ్డేట్చే జీటంగ్ సంపాదించింది. నిశిత పరిశీలన కొరకు ఐసీఐజే, సహ మీడియా సంస్థలకు అందజేసింది.
Comments
Please login to add a commentAdd a comment