Paradise Papers
-
930 భారతీయులు, వాటిల్లో రూ.20వేల కోట్ల అక్రమ నగదు!
న్యూఢిల్లీ: పనామా, ప్యారడైజ్ పేపర్ లీకేజీ ఘటనల్లో దాదాపు 930 భారతీయులకు సంబంధించిన సంస్థల ఖాతాల్లో ఏకంగా రూ.20,353 కోట్లు జమయ్యాయని కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మంగళవారం రాజ్యసభలో ఈ విషయం చెప్పారు. ‘ఈ ఏడాది అక్టోబర్ ఒకటినాటికి ఆయా ఖాతాల్లోని మొత్తాలపై రూ.152.88 కోట్ల పన్నులను వసూలుచేశాం’ అని మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. చట్టాలను అతిక్రమించిన సంబంధిత వ్యక్తులపై ఆదాయ పన్ను శాఖ చర్యలు తీసుకుందని చెప్పారు. వీటిపై 52 కేసులు నమోదయ్యాయన్నారు. మరో 130 కేసులు కోర్టుల్లో విచారణలో ఉన్నాయన్నారు. విదేశాల్లో అక్రమంగా పెట్టుబడులు పెట్టిన కొందరు భారతీయుల పేర్లు బహిర్గతమైన విషయం తెల్సిందే. మల్టీ ఏజెన్సీ గ్రూప్(ఎంఏజీ) ఆధ్వర్యంలో కేసుల దర్యాప్తు జరుగుతోందన్నారు. -
వైఎస్ జగన్ సవాల్‌కు బాబు సిద్ధపడాలి
సాక్షి, కడప : ‘ప్యారడైజ్ పత్రాల వ్యవహారంతో వైఎస్ జగన్‌కు సంబంధం లేకపోయినా కావాలనే టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు పార్టీ నాయకులు ఇష్టానుసారంగా ప్రచార ఆర్భాటం కోసం మాట్లాడారు. ప్యారడైజ్ పత్రాల కుంభకోణంలో తన పేరుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, నిరూపించలేకపోతే సీఎం పదవి నుంచి బాబు వైదొలగాలి’ అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విసిరిన సవాల్‌ను చంద్రబాబు స్వీకరించకపోవడం సిగ్గుచేటని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నిరూపించలేకనే వెనక్కి తగ్గారని, ఎందుకంటే ఎలాగూ ప్యారడైజ్ పత్రాల వ్యవహారం ఒట్టిదే కాబట్టి అనవసరంగా సీఎం పదవిని పోగొట్టుకోవాల్సి వస్తుందని భయపడ్డారని ఎంపీ విమర్శించారు. వైఎస్ జగన్ ఏ కార్యక్రమం చేపట్టినా ఏదో ఒక తప్పుడు ప్రచారంతో ఆయనపై విషం చిమ్మడం టీడీపీ నేతలకు అలవాటైందని ఆయన ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజా సంకల్ప పాదయాత్రకు అన్నిచోట్ల జనం బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే జిల్లాలో స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా పరోక్షంగా 15 వేలమందికి, ప్రత్యక్షంగా మరో 15 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆయన వివరించారు. ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీల అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు వైఎస్ అవినాష్ తెలిపారు. లక్షలాది మంది ఉద్యోగులకు సంబంధించిన సీపీఎస్ విధానాన్ని రద్దుచేస్తామనడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని, అలాగే కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను అధికారంలోకి రాగానే ప్రాధాన్యత క్రమంలో రెగ్యులర్ చేస్తామని వైఎస్ జగన్ ప్రకటించడంతో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఇవే కాకుండా జిల్లాకు సంబంధించి అనేక అభివృద్ధి పనులు పరుగులు తీయడం ఖాయమన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పనులు కూడా పూర్తి చేసి సాగునీటిని అందించేందుకు కృషిచేస్తామని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. అందరికీ కృతజ్ఞతలు ఈనెల 6న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజా సంకల్ప పాదయాత్ర జిల్లాలో విజయవంతానికి కృషిచేసిన అందరికీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, పార్లమెంటు ఇన్చార్జులు, సమన్వయకర్తలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, పార్టీ అనుబంధ విభాగ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో అందరం ముందుకు కదులుదామన్నారు. పాదయాత్ర విజయవంతానికి సహకరించిన అందరికీ రుణపడి ఉంటామని ఆయన తెలియజేశారు. -
ఎల్లో మాయ.. అదో ఫూల్స్ ప్యారడైజ్
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి): నిజం! ఎల్లో మీడియాకిది అలవాటే!!. వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ప్రజల మధ్యలోకి వెళ్లే కార్యక్రమం ఏదైనా ఆరంభిస్తే... దానికొచ్చే జన స్పందనకు భయపడో లేక జనం దృష్టిని దాన్నుంచి మళ్లించటానికో.. కారణం ఏదైతేనేం..!! ఎల్లో మీడియా ఆ రోజు జగన్‌కు వ్యతిరేకంగా పతాక శీర్షికల్లో ఏదో ఒక కథనాన్ని వండి వారుస్తుంది. తాజాగా ప్యారడైజ్ పేపర్స్ లీకులంటూ జగన్మోహన్రెడ్డి ఫొటో ప్రచురించిన తీరు కూడా ఇలాంటిదే. కావాలంటే మీరే చూడండి... ప్యారడైజ్ పత్రాలుగా పిలుస్తున్న బెర్ముడా పత్రాల్లో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పేరు ఎక్కడా ప్రస్తావనే లేదు. ఆయన పేరుగానీ, ఆయనకు సంబంధించిన కంపెనీల పేరు గానీ బెర్ముడా పత్రాల్లో అణుమాత్రమైనా లేదు. మరి ఆయన పేరు, ఫొటోను ఎల్లో మీడియా సహా కొన్ని పత్రికలు, చానళ్లు ఎందుకు ప్రసారం చేస్తున్నాయి? నిజానికి ఈ పత్రాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన హెటెరో గ్రూపు ప్రమోటర్ల పేర్లున్నాయి. హెటెరో డ్రగ్స్ సంస్థ ‘హెటెరో మాల్టా’ పేరిట అక్కడో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. దాన్లో డైరెక్టర్లుగా హెటెరో ప్రమోటర్లు ఎ.నరసారెడ్డి, బి.పార్థసారథి రెడ్డి పేర్లున్నాయి. దీనిపై వారిద్దరూ వివరణ కూడా ఇచ్చారు. ఆ కంపెనీ ఉన్న మాట నిజమేనని, అది తమ వ్యక్తిగతం కాదని, హెటెరోకు అనుబంధ సంస్థ అని, యూరప్ కార్యకలాపాల కోసం ఆ కంపెనీని తమ సంస్థే ఏర్పాటు చేసిందని, ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌తో సహా వివిధ రెగ్యులేటరీ సంస్థలకు తెలియజేస్తూనే ఉన్నామని స్పష్టం చేసింది. ఈ వివరణను కూడా ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక ప్రచురించింది. అంటే! దీన్లో ఎలాంటి అక్రమాలకూ తావులేదనే అనుకోవాలి. పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సైతం తన విదేశీ కంపెనీలకు సంబంధించి సమస్త సమాచారాన్నీ దర్యాప్తు, నియంత్రణ సంస్థలకు అందజేసినట్లు గతంలోనే చెప్పారు. మరి జగన్మోహన్రెడ్డి ఫొటోను ఎందుకు ప్రచురించినట్లు? ప్యారడైజ్ పత్రాల్ని ఐసీఐజే బయటపెట్టింది. ఐసీఐజేకు ఇండియాలో భాగస్వామి అయిన ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక ఈ వివరాలను ప్రచురించింది. వివిధ కేసులతో సంబంధం ఉన్న సంస్థలు, వ్యక్తుల పేర్లు ఈ రికార్డుల్లో ఉన్నాయని పేర్కొంటూ.... సన్ టీవీ– మ్యాక్సిస్ కేసు; ఎస్సార్ –లూప్ 2జీ కేసు; ఎస్ఎన్సీ – లావాలిన్ కేసు (ఈ కేసులో కేరళ సీఎం విజయన్ పేరుంది కానీ తరవాత క్లీన్చిట్ ఇచ్చారు); రాజస్తాన్ అంబులెన్స్ స్కామ్ (ఈ స్కామును ఇటీవలే సీబీఐకి అప్పగించారు. దీన్లో జిక్విస్టా హెల్త్‌కేర్ అనే కంపెనీ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ కంపెనీలో తొలినాళ్లలో సచిన్ పైలట్, కార్తీ చిదంబరం ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా ఉన్నారు); వై.ఎస్. జగన్మోహన్రెడ్డిపై సీబీఐ దాఖలు చేసిన కేసు..’’ అంటూ కేసుల్ని ఉదహరించింది. అదీ జగన్ పేరు ప్రస్తావనకు వచ్చిన తీరు. ఇప్పటికైనా అర్థమయిందా? అసలు జగన్మోహన్రెడ్డిపై సీబీఐ కేసు... అంటే ఏంటి? అది ‘సాక్షి మీడియా’లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారం. ‘సాక్షి’లో ఇండియా సిమెంట్స్, అరబిందో ఫార్మా, రాంకీ వంటి లిస్టెడ్ సంస్థలే కాక... హెటెరో వంటి అన్‌లిస్టెడ్ సంస్థలు, నిమ్మగడ్డ ప్రసాద్ వంటి పారిశ్రామికవేత్తలూ పెట్టుబడులు పెట్టాయి. దీనికి సంబంధించి హెటెరోపై, నిమ్మగడ్డ ప్రసాద్‌పై చార్జిషీట్లు కూడా దాఖలయ్యాయి. అంటే... జగన్మోహన్రెడ్డి కేసుతో సంబంధం ఉన్న హెటెరో సంస్థకు బెర్ముడాలో కంపెనీ ఉన్నదనేది ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించిన వార్త తాత్పర్యం. మరి దాన్ని ఎల్లో మీడియా ఎలా తీసుకుంది? జగన్‌కే బెర్ముడాలో కంపెనీలున్నట్లుగా... భూమి బద్దలైపోయిందా అన్న రీతిలో పతాక శీర్షికల్లో ఆయన ఫొటోను ప్రచురించేశారు. కొన్ని గంటల పాటు ఎల్లో చానళ్లలో కథనాలు నడిపించారు. ఇంతా చూస్తే... మొదటి పేజీలో ఆయన ఫొటో తప్ప బెర్ముడా పేపర్లలో ఆయన పేరు ఎక్కడ ఉందో చెప్పిన కథనం ఒక్కటీ లేదు. దీనర్థమల్లా ఒక్కటే!! వారికి కావాల్సింది సెన్సేషన్! ఆ సెన్సేషన్లో జగన్మోహన్రెడ్డి ఏదో చేసేశారన్నట్లుగా జనానికి చూపించటం. కానీ జనాలు ఆ మాత్రం నిజాలు తెలుసుకోలేరా? నిజానికి విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే ప్రతి కంపెనీకీ అక్కడ అనుబంధ సంస్థలుండటమనేది సహజం. అంతర్జాతీయ దిగ్గజం గూగుల్‌తో మొదలెడితే దేశీ ఐటీ అగ్రగాములు ఇన్ఫోసిస్, టీసీఎస్ సహా దాదాపు ప్రతి కంపెనీకీ విదేశాల్లో అనుబంధ సంస్థలుంటాయి. వాటి వార్షిక నివేదికల్లో అవన్నీ బయటపెడతాయి కూడా!!. ‘మోటపర్తి’ – చంద్రబాబు లింకుల్ని ఏం చేశారు? ఇదే ఐసీఐజే ఇంతకుముందు ‘పనామా’ పత్రాల పేరిట పనామాలో రిజిస్టరయిన ఆఫ్‌షోర్ కంపెనీల పేర్లు, వ్యక్తుల చరిత్రలు బయటపెట్టింది. ఆ వ్యవహారంతో కొన్ని దేశాల్లో అధ్యక్షులు కూడా రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. ఆ పత్రాల్లో రాష్ట్రానికి చెందిన మోటపర్తి శివరామ కృష్ణ ప్రసాద్ పేరు స్పష్టంగా బయటపడింది. ఆయనకు బోలెడన్ని కంపెనీలున్నట్లు వెల్లడైంది. నిజానికి ఆయనెవరో కాదు. సాక్షాత్తూ చంద్రబాబు నాయుడు వ్యవస్థాపకు డిగా ఏర్పాటు చేసిన ఆయన కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్‌లో డైరెక్టర్. ఈ ఆరోపణలు వచ్చిన వెంటనే ఆయన చేత హెరిటేజ్ ఫుడ్స్ రాజీనామా చేయించేసింది. చిత్రమేంటంటే ఆ రోజున ఏ ఎల్లో పత్రిక, చానల్ కూడా చంద్రబాబు నాయుడి పేరును ప్రస్తావించింది లేదు. కనీసం హెరిటేజ్ ఫుడ్స్ పేరునూ ప్రస్తావించలేదు. ఇక్కడ గమనించాల్సిందొక్కటే. బాబుతో నేరు గా సంబంధాలున్న... బినామీగా ఉండి పలు దేశాల్లో వ్యాపారాలు నడిపిస్తున్నారన్న ఆరోపణలెదుర్కొంటున్న ఎంవీఎస్‌ఆర్‌కే ప్రసాద్ పేరు పనామా పత్రాల్లో వస్తే ఏ ఎల్లో మీడియా కూడా ప్రచురించ లేదు. అదే ప్యారడైజ్ పత్రాల్లో హెటెరో డ్రగ్స్ అనుబంధ కంపెనీ పేరొస్తే... అది చట్టబద్ధమైనదే అని తెలిసీ జగన్ ఫొటో ప్రచురించారు. అదీ ఎల్లో మాయ!! ప్యారడైజ్ పత్రాలంటే... పన్నులు తక్కువగా ఉండే బెర్ముడాలో పలువురు సంపన్నులు, అంతర్జాతీయ కంపె నీలు తమ అనుబంధ సంస్థల్ని రిజిస్టరు చేసుకు న్నారు. ఆయా కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్లు కూడా చేశారు. ఇవన్నీ యాపిల్బై అనే రిజిస్ట్రా్టర్ ద్వారా జరిగాయి. ఆ యాపిల్బై తాలూకు పత్రాల్ని ఐసీఐజే సంపాదించింది. అవే ప్యారడైజ్ పేపర్స్. విదేశాల్లో కంపెనీలు, ఖాతాలు ఉండటం తప్పేమీ కాదని, అవన్నీ అక్రమమని చెప్పలేమని కూడా ఐసీఐజే తన కథనంలో ముందే చెప్పింది. కాకపోతే కొన్ని అక్రమమైనవి కూడా ఉండి ఉండొచ్చని... వాటిపై దర్యాప్తు చేయాల్సింది ఆయా దేశాల సంస్థలేనని కూడా ఐసీఐజే స్పష్టంచేసింది. -
‘ప్యారడైజ్ పేపర్లు’ లీక్
-
‘ప్యారడైజ్ పేపర్స్’పై బిగ్ బి స్పందన
న్యూఢిల్లీ : పనామా పేపర్లలో, బోఫోర్స్ కుంభకోణంలో తాజాగా ప్యారడైజ్ పేపర్స్‌లో తన పేరు వెలుగులోకి రావడంపై బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ స్పందించారు. తాను ఎల్లవేళలా వ్యవస్థకు సహకరిస్తానని, కానీ ఈ వయసులో తనని ఒంటరిగా వదిలివేయాలని కోరారు. తన బ్లాగ్‌లో అమితాబ్ ఓ బాధాకరమైన పోస్టును పెట్టారు. '' రేపు మరింత ఎక్కువుంటుంది. ఈ ప్రక్రియకు సహకారం అందిస్తుంటా..'' అని తెలిపారు. పన్నులను తప్పించుకుంటూ విదేశాల్లో అక్రమంగా సొమ్మును దాచుకుంటున్న కుబేరుల బండారాన్ని ప్యారడైజ్ పేపర్స్ పేరుతో ఇంటర్నేషనల్ కన్సోర్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు లీక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లీకేజీల్లో 714 మంది భారతీయులున్నారని వెల్లడైంది. వారిలో అమితాబ్ పేరు ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ ప్యారడైజ్ పేపర్లలో తన పేరు ఉన్నట్టు అమితాబ్‌కు తెలుసో? లేదో? ఇంకా స్పష్టత లేదు. అమితాబ్ పోస్టు చేసిన బ్లాగ్‌లో కేవలం అక్రమంగా ప్రాపర్టీని నిర్మించినందుకు గాను బీఎంసీ జారీచేసిన నోటీసులు, పనామా పేపర్లలో తన పేరు, బోఫోర్స్ కుంభకోణాన్ని మాత్రమే ప్రస్తావించారు. ప్యారడైజ్ పేపర్లలో తన పేరు ఉన్నట్టు వచ్చిన వార్తలపై ఆయన స్పందించలేదు. ఈ వయసులో, ఈ సమయంలో తనకు శాంతి, స్వేచ్ఛను మాత్రమే కోరుకుంటున్నానని తెలిపారు. నాకోసం, నా జీవితం కోసం గడపడానికి కొన్ని సంవత్సరాలు వదిలి పెట్టాలంటూ అమిత్ తన పోస్టులో అభ్యర్థించారు. ఇటీవల కాలంలో పనామా పేపర్లలో మరోసారి తన పేరు వచ్చిందన్నారు. తన పేరును దుర్వినియోగం చేసినందుకు వెనువెంటనే సమాధానమిచ్చానని, అయినప్పటికీ ప్రశ్నలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఇప్పటికే 6 సమన్లను అందుకున్నానని, ఇంకా వస్తున్నాయని బాధాకరం వ్యక్తంచేశారు. -
ప్రపంచ వ్యాప్తంగా ‘ప్యారడైజ్’ ప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ : పనామా పత్రాలు సృష్టించిన కల్లోలం ఇంకా పూర్తిగా మార్చిపోకముందే అదే తరహాలో పరిశోధక జర్నలిస్టులు విడుదల చేసిన ‘ప్యారడైజ్ పత్రాలు’ ప్రపంచవ్యాప్తంగా కుబేరుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. బ్రిటన్ రాణి ఎలిజబెత్, అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రోస్ సహా పలువురు భారతీయ కుబేరుల అక్రమాలను బహిర్గతం చేశాయి. దాదాపు 714 మంది భారతీయ సంపన్నులు, వందలాది కంపెనీలు పన్నులు ఎగ్గొట్టాయని తెలిపాయి. పన్నులు ఎగ్గొట్టేందుకు తమ ఆస్తులను బెర్ముడా, కేమాన్ ఐలాండ్స్ వంటి దేశాల్లో ఎలా దాచుకున్నదీ ఇవి వెల్లడించాయి. వివిధ దేశాల్లోని 96 వార్తాసంస్థల భాగస్వామ్యంతో విచారణ జరిపిన ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) మొత్తం 1.3 కోట్ల పత్రాలను బహిర్గతం చేసింది. ఈ అక్రమాస్తులకు సంబంధించి 180 దేశాలకు ర్యాంకులు కేటాయించగా మనదేశం 19వ స్థానంలో నిలిచింది. గతంలో పనామా పేపర్స్‌ను లీక్ చేసింది కూడా ఐసీఐజేయే! బెర్ముడా దేశంలోని ‘ఆపిల్‌బీ’ అనే న్యాయసంస్థ నుంచి, సింగపూర్‌కు చెందిన ఆసియా సిటీ సంస్థల నుంచి ఈ డాక్యుమెంట్లను రాబట్టింది. ఈ రెండు సంస్థలూ కుబేరుల సంపద, ఆస్తులను విదేశాలకు తరలిస్తుంటాయి. నంద్లాల్ ఖేమ్కా అనే భారతీయ వ్యాపారికి ఆపిల్బీలో ఏకంగా 118 కంపెనీలను నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. కేంద్ర వైమానికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా, బీజేపీ ఎంపీ ఆర్కే సిన్హా, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ పేర్లు కూడా ప్యారడైజ్పత్రాల్లో కనిపించాయి. కార్పొరేట్ లాబీయిస్టు నీరా రాడియా, సంజయ్ దత్ భార్య మాన్యత సైతం విదేశాల్లో ఆస్తులు కూడబెట్టినట్టు తేలింది. తాము ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదని, తమ ఆస్తుల లెక్కలన్నీ సక్రమంగానే ఉన్నాయని వారు వివరణ ఇచ్చారు. రెండోస్థానంలో భారతీయులు ఆపిల్‌బీ ఖాతాదారుల్లో భారతీయులు రెండోస్థానంలో ఉన్నారు. మరో రెండు రోజుల్లో ప్రభుత్వం పెద్ద నోట్లను ప్రకటించి ఏడాది పూర్తయిన క్రమంలో నల్లధన వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంలో ఈ కుంభకోణం వెలుగులోకి రావడం తీవ్ర ప్రకంపనాలను సృష్టిస్తోంది. ఈ ప్యారడైజ్ పేపర్లు ఆఫ్‌షోర్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన అంతర్జాతీయస్థాయి ప్రముఖుల వివరాలను కూడా బయటపెట్టాయి. వీటిలో అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రోస్ పేరు కూడా ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అల్లుడికి చెందిన ‘నేవిగేటర్ హోల్డింగ్స్’లో ఆయనకి వాటా ఉన్నట్టు వెల్లడయింది. పేపర్ల లీకేజీపై స్పందించిన ఆపిల్‌బీ తమ సమాచారం చోరీ అయిందని, అయితే తమ వద్ద ఎటువంటి అవకతవకలూ జరగలేని స్పష్టం చేసింది. కాగా, పనామా పేపర్స్ కుంభకోణంలో చిక్కుకున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీప్ తన పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో పాక్ మాజీ ప్రధాని షౌకత్ అజీజ్ పేరు కూడా ఈ జాబితాలో కనిపించింది. బెర్ముడా దేశంలో దాచిన నగదు గురించి ఆయన ఎన్నడూ వెల్లడించలేదని ఐసీఐజే తెలిపింది. దాదాపు 135 పాకిస్థాన్ సంపన్నుల పేర్లు అప్లెబీలో ఉన్నాయి. విచారణ జరుపుతాం : సెబీ ప్యారడైజ్ పత్రాలు పేర్కొన్న భారతీయ కార్పొరేట్ సంస్థలపై, పారిశ్రామిక వేత్తలపై విచారణ జరుపుతామని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రకటించింది. ఈ పత్రాలు పేర్కొన్న కంపెనీల్లో కొన్నింటిపై ఇది వరకే విచారణ కొనసాగుతోందని తెలిపింది. పన్నుల్లేని దేశాల్లో మదుపు చేసిన వాళ్లంతా నేరం చేసినట్టుగా భావించలేమని సెబీ అధికారి ఒకరు అన్నారు. లెక్కలు లేని ధనం, అక్రమంగా డబ్బు తరలిస్తే మాత్రం చర్యలు ఉంటాయని తెలిపింది. విజయ్ మాల్యా కంపెనీలతోపా టు జిందాల్‌స్టీల్, ఎస్సార్ షిప్పింగ్, వీడియోకాన్ ఇండస్ట్రీస్, సన్ టీవీ, అపోలో టైర్స్ సంస్థల పేర్లు ఈ పత్రాల్లో ఉన్నాయి. -
భారతీయుల బండారం బట్టబయలు
సాక్షి, న్యూఢిల్లీ : పనామా పేపర్స్ సృష్టించిన కల్లోలం ఇంకా పూర్తిగా మార్చిపోకముందే 'ప్యారడైజ్ పేపర్స్' లీకేజీలు భారతీయ కుబేరుల గుండెల్లో గుబేలు పుట్టిస్తున్నాయి. పన్నులు ఎగ్గొట్టిన 714 మంది భారతీయు కుబేరుల బండారాన్ని ప్యారడైజ్ పేపర్స్ బట్టబయలు చేసింది. పన్నుల నుంచి తప్పించుకునేందుకు తమ ఆస్తులను ఎలా దాచుకున్నదీ ఈ పేపర్లు లీక్ చేసింది. 96 న్యూస్ ఆర్గనైజేషన్ల భాగస్వామ్యంతో విచారణ జరిపిన ఇంటర్నేషనల్ కన్సోర్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు ఈ డేటాను లీక్ చేశారు.. ఐసీఐజే 13.4 మిలియన్ పేపర్లను లీక్ చేసింది. గతంలో పనామా పేపర్స్‌ను లీక్ చేసింది కూడా ఐసీఐజేనే. 199 నాటి న్యాయ సంస్థ 'అప్లెబీ' నుంచి ఈ డాక్యుమెంట్లను ఐసీఐజే రాబట్టింది. అప్లెబీ సంస్థ రికార్డుల్లో ఆఫ్‌షోర్ కంపెనీలు, క్లయింట్ల బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన డేటా ఉంది. ఈ డేటా లీక్‌లో సంఖ్యా పరంగా భారత్ 19వ స్థానంలో నిలిచింది. అప్లెబీ ఖాతాదారుల్లో భారతీయులు రెండోస్థానంలో ఉన్నారు. మరో రెండు రోజుల్లో ప్రభుత్వం పెద్ద నోట్లను ప్రకటించి ఏడాది పూర్తయిన క్రమంలో 'యాంటీ-బ్లాక్ మనీ డే'ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంలో ప్యారడైజ్ పేర్లు వెలుగులోకి రావడం తీవ్ర ప్రకంపనాలను సృష్టిస్తోంది. ఈ ప్యారడైజ్ పేపర్లు ఆఫ్‌షోర్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ప్రముఖ వ్యక్తుల వివరాలను కూడా లీక్ చేసింది. లీకైన డాక్యుమెంట్లలో అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రోస్ పేరు కూడా ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అల్లుడికి చెందిన 'నేవిగేటర్ హోల్డింగ్స్'లో ఆయనకి వాటా ఉన్నట్టు వెల్లడించింది. పేపర్ల లీకేజీపై స్పందించిన 'అప్లెబీ'తమ సమాచారం అపహరణకు గురైందని, అయితే తమ వద్ద ఎటువంటి అవకతవకలు జరగలేని స్పష్టం చేసింది. కాగా, పనామా పేపర్స్ కుంభకోణంలో చిక్కుకున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీప్ తన పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. -
‘ప్యారడైజ్ పేపర్లు’ లీక్
వాషింగ్టన్ : అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి విల్బర్ రాస్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితులకు చెందిన షిప్పింగ్ కంపెనీతో ఉన్న వ్యాపార సంబంధాలు బట్టబయలయ్యాయి. ఇంటర్నేషనల్ కన్సోర్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) ఇందుకు సంబంధించిన ప్యారడైజ్ పేపర్లను లీక్ చేసింది. ప్రపంచంలోని పలువురు ప్రముఖుల పేర్లు ఈ ఆఫ్ షోర్ ఇన్వెస్ట్మెంట్ పేపర్లలో ఉన్నాయి. బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2తో పాటు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడూకు చెందిన టాప్ ఫండ్ రైజర్, సీనియర్ సలహాదారు స్టీఫెన్ బ్రౌన్ఫ్మన్ల పేర్లు కూడా ‘ప్యారడైజ్ పేపర్లు’ లో ఉన్నాయి. కెనడా ప్రధానమంత్రికి చెందిన సన్నిహిత వర్గం పన్నును ఎగవేసేందుకు మాజీ సెనేటర్ లియో కొల్బెర్తో కలసి 60 మిలియన్ల డాలర్లు సీ గ్రామ్ ఫార్చూన్‌లో పెట్టుబడి పెట్టినట్లు ఐసీఐజే పేర్కొంది. రాస్, ఎలిజబెత్ 2, బ్రౌన్ఫ్మన్లు అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే, రాస్కు రష్యా కంపెనీలతో సంబంధాలు ఉండటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాస్ రష్యన్ కంపెనీల్లో 31 శాతం వాటాను కలిగివున్నట్లు ప్యారడైజ్ పేపర్ల ద్వారా తెలుస్తోంది. మరోవైపు ట్రుడూకు చెందిన సన్నిహితుల పేర్లు బయటకు రావడంతో ఆయన చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది. వివాదంలో రాణి ఎలిజబెత్-2 : కేమన్ ద్వీపాలు, బెర్ముడాల్లో క్వీన్ 13 మిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టినట్లు ప్యారడైజ్ పేపర్లలో వెల్లడైంది. ఇందులో రెంట్ టూ బై రీటైలర్‌ను బ్రైట్ హౌస్‌ను కూడా క్వీన్ కొనుగోలు చేశారు. దీనివల్ల పేదవారు దోపిడీకి గురయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘ప్యారడైజ్ పేపర్లు’ ఏంటి? బెర్ముడా తదితర ప్రాంతాల్లో ఉన్న ఆఫ్ షోర్ కంపెనీలకు చెందిన డాక్యుమెంట్లే పార్యడైజ్ పేపర్లు. దాదాపు 1,34 లక్షల ప్యారడైజ్ పేపర్లను ఐసీఐజే క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం వివరాలను బయట పెట్టింది. ఈ పేపర్లను తొలుత జర్మనికి చెందిన న్యూస్‌పేపర్ సుడ్డేట్చే జీటంగ్ సంపాదించింది. నిశిత పరిశీలన కొరకు ఐసీఐజే, సహ మీడియా సంస్థలకు అందజేసింది.