సాక్షి, కడప : ‘ప్యారడైజ్ పత్రాల వ్యవహారంతో వైఎస్ జగన్‌కు సంబంధం లేకపోయినా కావాలనే టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు పార్టీ నాయకులు ఇష్టానుసారంగా ప్రచార ఆర్భాటం కోసం మాట్లాడారు. ప్యారడైజ్ పత్రాల కుంభకోణంలో తన పేరుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, నిరూపించలేకపోతే సీఎం పదవి నుంచి బాబు వైదొలగాలి’ అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విసిరిన సవాల్‌ను చంద్రబాబు స్వీకరించకపోవడం సిగ్గుచేటని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నిరూపించలేకనే వెనక్కి తగ్గారని, ఎందుకంటే ఎలాగూ ప్యారడైజ్ పత్రాల వ్యవహారం ఒట్టిదే కాబట్టి అనవసరంగా సీఎం పదవిని పోగొట్టుకోవాల్సి వస్తుందని భయపడ్డారని ఎంపీ విమర్శించారు. వైఎస్ జగన్ ఏ కార్యక్రమం చేపట్టినా ఏదో ఒక తప్పుడు ప్రచారంతో ఆయనపై విషం చిమ్మడం టీడీపీ నేతలకు అలవాటైందని ఆయన ఆరోపించారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజా సంకల్ప పాదయాత్రకు అన్నిచోట్ల జనం బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే జిల్లాలో స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా పరోక్షంగా 15 వేలమందికి, ప్రత్యక్షంగా మరో 15 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆయన వివరించారు. ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీల అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు వైఎస్ అవినాష్ తెలిపారు. లక్షలాది మంది ఉద్యోగులకు సంబంధించిన సీపీఎస్ విధానాన్ని రద్దుచేస్తామనడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని, అలాగే కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను అధికారంలోకి రాగానే ప్రాధాన్యత క్రమంలో రెగ్యులర్ చేస్తామని వైఎస్ జగన్ ప్రకటించడంతో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఇవే కాకుండా జిల్లాకు సంబంధించి అనేక అభివృద్ధి పనులు పరుగులు తీయడం ఖాయమన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పనులు కూడా పూర్తి చేసి సాగునీటిని అందించేందుకు కృషిచేస్తామని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు.
అందరికీ కృతజ్ఞతలు
ఈనెల 6న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజా సంకల్ప పాదయాత్ర జిల్లాలో విజయవంతానికి కృషిచేసిన అందరికీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, పార్లమెంటు ఇన్‌చార్జులు, సమన్వయకర్తలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, పార్టీ అనుబంధ విభాగ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో అందరం ముందుకు కదులుదామన్నారు. పాదయాత్ర విజయవంతానికి సహకరించిన అందరికీ రుణపడి ఉంటామని ఆయన తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment