న్యూఢిల్లీ : పనామా పేపర్లలో, బోఫోర్స్ కుంభకోణంలో తాజాగా ప్యారడైజ్ పేపర్స్‌లో తన పేరు వెలుగులోకి రావడంపై బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ స్పందించారు. తాను ఎల్లవేళలా వ్యవస్థకు సహకరిస్తానని, కానీ ఈ వయసులో తనని ఒంటరిగా వదిలివేయాలని కోరారు. తన బ్లాగ్‌లో అమితాబ్ ఓ బాధాకరమైన పోస్టును పెట్టారు. '' రేపు మరింత ఎక్కువుంటుంది. ఈ ప్రక్రియకు సహకారం అందిస్తుంటా..'' అని తెలిపారు. పన్నులను తప్పించుకుంటూ విదేశాల్లో అక్రమంగా సొమ్మును దాచుకుంటున్న కుబేరుల బండారాన్ని ప్యారడైజ్ పేపర్స్ పేరుతో ఇంటర్నేషనల్ కన్సోర్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు లీక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లీకేజీల్లో 714 మంది భారతీయులున్నారని వెల్లడైంది. వారిలో అమితాబ్ పేరు ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ ప్యారడైజ్ పేపర్లలో తన పేరు ఉన్నట్టు అమితాబ్‌కు తెలుసో? లేదో? ఇంకా స్పష్టత లేదు.
అమితాబ్ పోస్టు చేసిన బ్లాగ్‌లో కేవలం అక్రమంగా ప్రాపర్టీని నిర్మించినందుకు గాను బీఎంసీ జారీచేసిన నోటీసులు, పనామా పేపర్లలో తన పేరు, బోఫోర్స్ కుంభకోణాన్ని మాత్రమే ప్రస్తావించారు. ప్యారడైజ్ పేపర్లలో తన పేరు ఉన్నట్టు వచ్చిన వార్తలపై ఆయన స్పందించలేదు. ఈ వయసులో, ఈ సమయంలో తనకు శాంతి, స్వేచ్ఛను మాత్రమే కోరుకుంటున్నానని తెలిపారు. నాకోసం, నా జీవితం కోసం గడపడానికి కొన్ని సంవత్సరాలు వదిలి పెట్టాలంటూ అమిత్ తన పోస్టులో అభ్యర్థించారు. ఇటీవల కాలంలో పనామా పేపర్లలో మరోసారి తన పేరు వచ్చిందన్నారు. తన పేరును దుర్వినియోగం చేసినందుకు వెనువెంటనే సమాధానమిచ్చానని, అయినప్పటికీ ప్రశ్నలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఇప్పటికే 6 సమన్లను అందుకున్నానని, ఇంకా వస్తున్నాయని బాధాకరం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment