పనామా సిటీ: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్లు తాజాగా ప్రజలకు ఆన్ లైన్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలో గొప్ప స్థానాల్లో ఉన్న కొందరి అక్రమాలను పనామా పేపర్లు బయటపెట్టిన విషయం తెలిసిందే.
ఈ ఇన్వేస్టిగేటివ్ జర్నలిజంలో ముఖ్య పాత్ర పోషించిన ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వేస్టిగేటివ్ జర్నలిజం (ఐసీఐజే) కోటికిపైగా ఉన్న ఈ డాక్యుమెంట్లన్నింటినీ డిజిటల్ రూపంలో అందరికీ అందుబాటులో ఉండేలా చేసేవిధంగా నిర్ణయించింది. భారతకాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ఆరుగంటల నుంచి పనామా పేపర్లన్నీ ఆఫ్ షోర్ లీక్స్.ఐసీఐజే.ఓఆర్జీ లో అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలో సంపద కలిగి ఆఫ్ షోర్ కంపెనీలను కలిగివున్న 2,00,000 మంది పేర్లను ఇందులో వెల్లడించనున్నట్లు ఐసీఐజే తెలిపింది.
ఇప్పటివరకు కేవలం పెద్ద ప్రొఫెల్ ఉన్న వ్యక్తుల వివరాలను(ఐస్ ల్యాండ్ ప్రధానమంత్రి, బ్రిటన్ ప్రధాని, రష్యా ప్రెసిడెంట్, అర్జెంటీనా ప్రధానమంత్రి, చైనా రాజకీయ నాయకులు) మాత్రమే న్యూస్ పేపర్ల ద్వారా బయటపెట్టిన ఐసీఐజే తాజాగా తీసుకున్న నిర్ణయంతో నల్లకుబేరుల జాబితా బయటకు రానుంది. అయితే, సమాచారాన్ని ప్రజలకు తెలియజేయండం తప్పంటూ మొస్సాక్ ఫోన్సెకా ఐసీఐజే మీద పిటిషన్ దాఖలు చేసేందుకు లాయర్ ను నియమించుకుంది. దీనికి సంబంధించి ఐసీఐజే ఎటువంటి ప్రకటనా చేయలేదు. డాక్యుమెంట్లను బయటపెట్టడంలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది.