ఆన్లైన్ బుకింగ్.. అంతా మాయ!
సాక్షి, రాజమండ్రి : నెల రోజుల ముందు నుంచి నెట్లో అసలు రైలు టికెట్లు బుక్ చేయనే లేదు. అయినా ‘మీకు ఇంకా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం లేదు’ అని వస్తున్న మెసేజ్‌లతో విస్తుపోవడం రైలు ప్రయాణికుల వంతవుతోంది. ఫలితంగా తమ పాస్వర్డ, లేదా ఐపీ అడ్రస్‌తో ఎవరు టికెట్లు బుక్ చేశారా.. అని వారు ఆందోళన చెందుతున్నారు. రాజమండ్రికి చెందిన ఓ అధికారి ఏదో అర్జంటు పని మీద ఆది వారం హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. దీని కోసం తత్కాల్లో టికెట్లు బుక్ చేసుకునేందుకు ఐఆర్సీటీసీ సైట్లోకి శనివారం లాగిన్ అయ్యారు. ఉదయం రెండు టికెట్లు బుక్ చేద్దామని యత్నిస్తే రైలు రిజర్వేషన్ క్లాస్ ఎంపిక చేసుకున్న వెంటనే ఓ వర్తమానం వచ్చింది. ‘మీకు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకూ రెండు టికెట్లే బుక్ చేసుకునే అవకాశం ఉంది.’ అంటూ ఎర్ర అక్షరాలతో దర్శనమిచ్చింది. దీంతో అవాక్కవడం ఆయన వంతైంది. అప్పటికే తన ఐపీపై టికెట్ బుక్ చేసుకున్నట్టు వచ్చిన వర్తమానం ఆయనను గందరగోళానికి గురిచేసింది. అకౌంట్లను ఎవరైనా హ్యాక్ చేస్తున్నారా... లేదా ఇతర సాంకేతిక కారణాలా అనేది స్థానిక రైల్వే అధికారులూ చెప్పలేకపోతున్నారు.ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఈ సమస్య పది రోజుల నుంచి వేధిస్తోంది.
ముగ్గురు, నలుగురికి ఇదే పరిస్థితి
దీంతో ఆ ప్రభుత్వ ఉద్యోగి తన కార్యాలయంలో పనిచేసే మరో ఉద్యోగికి ఫోన్ చేసి మీ లాగిన్ నుంచి రెండు టిక్కెట్లు హైదరాబాద్‌కు బుక్‌చేయాలని కోరారు. ఆ ఉద్యోగి యత్నిం చగా, అతనికీ అదే సమాచారం వచ్చింది. దీంతో వారు విషయాన్ని ‘సాక్షి’ దృష్టికి తీసుకొచ్చారు. సాక్షి ప్రతినిధి రెండు వేర్వేరు ఇంటర్నెట్ కనెక్షన్లు కలిగిన కంప్యూటర్లలో ఉదయం 10.30 నుంచి 11.15 గంటల మధ్యలో గౌతమి, గోదావరి, శేషాద్రి మరో రెండు రైళ్లలో టిక్కెట్లు బుకింగ్‌కి యత్నించగా ఇదే ఎర్రర్ మెసేజ్ వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల వరకూ తత్కాల్ బుకింగ్ పేజీలోకి వెళ్లేందుకు ఐఆర్సీటీసీ వెబ్సైట్ అనుమతించలేదు. అప్పటికి తత్కాల్ కోటా నిండింది.
నిబంధన ఇలా..
ఎవరైనా తమ వ్యక్తిగత కంప్యూటర్ నుంచి ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల్లోపు తత్కాల్ కోటాలో రెండు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అదనంగా కావాలంటే ఇటువంటి మెసేజ్ వస్తుంది. లేదా ఒకసారి ఒక రైల్లో టికెట్లు బుక్‌చేసుకుని మళ్లీ అదే ఐడీ నుంచి కానీ, కంప్యూటర్ నుంచి కానీ మరోసారి టికెట్లు బుక్చేసుకునేందుకు వీల్లేదు. పెరుగుతున్న తత్కాల్ అవసరాలకు అనుగుణంగా. ఎక్కువ మందికి టికెట్లు లభించేందుకు ఈ నిబంధనను రైల్వే శాఖ అమలు చేస్తోంది. ఒక్కోసారి టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ సైట్ బిజీ వల్ల పేమెంట్ గేట్‌వే వద్ద సాంకేతిక లోపం తలెత్తితే ఆ టికెట్లు కూడా దక్కని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఒకసారి ప్రయత్నించారు కనుక మరోసారి బుక్ చేసుకునేందుకు అవకాశం ఉండదు. కానీ అసలు అంతకు ముందు లాగిన్ అవకుండానే.. తొలి యత్నంలోనే ఎర్రర్ మెసేజ్‌లు దారుణమనేది ప్రయాణికుల ఆవేదన.
సాంకేతిక కారణాలు ఇవి :
మనం ఒక సారి కంప్యూటర్ ద్వారా ఇంటర్నెట్కు కనెక్ట్ అయితే సిస్టంకు ఒక ఐపీ అడ్రస్ వస్తుంది. ఆ ఐపీ నంబరు కల సిస్టం నుంచి.. మీ యూజర్ ఐడీతో లాగిన్ అయితే రెంటికీ అనుసంధానం ఏర్పడుతుంది. ఐఆర్సీటీసీ సైట్లో ఒకసారి లాగిన్ అయి టికెట్లు బక్ చేసేందుకు యత్నించినప్పుడు ఈ రెండూ స్టోర్ అవుతాయి. మరో సారి యత్నించేందుకు వీలుండదు. కాగా కంప్యూటర్ రీస్టార్ట్ట్చేసి మళ్లీ నెట్‌కు కనెక్ట్ అయితే మరో ఐపీ నంబరు వస్తుంది. మరో యూజర్ ఐడీతో లాగిన్ అయి యత్నించవచ్చు. కానీ అసలు అంతకు ముందెప్పుడూ కనెక్ట్ కాకుం డా అసలు బుకింగ్‌కు యత్నించకుండా ఇటువంటి మెసేజ్‌లు రావడం విచిత్రమని కంప్యూటర్ నిపుణులు చెబుతున్నారు.
హ్యాకర్ల పనా?
తత్కాల్ టికెట్లను ముందుగా ఒప్పందాలు కుదుర్చుకున్న వారి పేర్లతో అడ్డదారిలో బుక్ చేసేందుకు కొందరు ఏజెంట్లు యూజర్ ఐడీలను పాస్‌వర్డ్‌లను హ్యాక్ చేస్తున్నారా... అనే అనుమానాలను ప్రయాణికులు వ్యక్తం చే స్తున్నారు. ఈ వ్యవహారంపై రైల్వే అధికారులు దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు.