అజహరుద్దీన్ కుమారుడితో... ‘ఇద్దరికీ కొత్తగా’
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ కుమారుడు అబ్బాస్ హీరోగా పరిచయం కానున్న చిత్రం ‘ఇద్దరికీ కొత్తగా’. చిత్తూరుకు చెందిన కొత్త దర్శకుడు కె.సురేష్‌బాబు స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించ నున్నారు. లొకేషన్లను చూసుకోవడానికి మంగళవారం చిత్తూరులోని పలు ప్రాంతాలను హీరో, దర్శకుడు పరిశీలించారు.
హీరో అబ్బాస్ మాట్లాడుతూ, ‘‘మా నాన్న ప్రోత్సాహంతోనే వెండి తెరపైకి వస్తున్నా. సంగీతా బిజ్లానీ ఆంటీ నాకు స్ఫూర్తి. నాన్న బయోగ్రఫీ ఆధారంగా రూపొందించిన ‘అజహర్’కు సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాను. హైదరాబాదీని కావడంతో తొలి సినిమా తెలుగులో చేయాలని దర్శకుడు సురేష్‌బాబు చెప్పిన కథకు ఓకే చెప్పాను’’ అని చెప్పారు. ‘‘తెలుగుతో పాటు హిందీలో వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తాం’’ అని దర్శకుడు తెలిపారు.