ముందుకు పడని ‘దత్తత’ అడుగులు
సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన..కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం ఇది. అన్ని రంగాల్లో వెనుకబడిన గ్రామాలను ప్రజాప్రతినిధులు దత్తత తీసుకుని అభివృద్ధి పథంలో నిలపడమే ఈ పథకం ఉద్దేశం. అయితే జిల్లాలోని నాలుగు గ్రామాలను ప్రజాప్రతినిధులు దత్తత తీసుకున్నారు. కానీ వాటికి సంబంధించిన అభివృద్ధి పనుల్లో అడుగు కూడా ముందుకు పడలేదు. జిల్లాలోని దత్తత గ్రామాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
- దేవరకొండ / భువనగిరి / వలిగొండ / మర్రిగూడ / ఆలేరు
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన’కు దారితెన్నూ లేకుండా పోయింది. ఆర్భాటంగా దత్తత గ్రామాలను ప్రకటించి నాలుగు నెలలు కావస్తున్నా ఇంకా నివేదికల పర్వమే కొనసాగుతోంది. ఈ పథకంపై మండల స్థాయి అధికారులకు సరైన మార్గదర్శకాలు లేకపోవడం గమనార్హం. జిల్లాలోని పలువురు నేతలు తీసుకున్న దత్తత గ్రామాల పరిస్థితిపై ‘సాక్షి’ ఫోకస్.
దేవరకొండ : నియోజకవర్గ కేంద్రమైన దేవరకొండ పరిధిలో గల చింతకుంట్ల గ్రామాన్ని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి సంసద్ ఆదర్శ్ గ్రామీణ్ యోజన పథకం కింద డిసెంబర్లో దత్తత తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు అభివృద్ధి అడుగులు పడలేదు. సర్వేలు, సమావేశాలు, నివేదికలకే సమయం గడిచిపోయింది. వీఆర్వో స్థాయి అధికారులతో ఒకసారి ఇంటింటి సర్వే నిర్వహించారు. మరోసారి చింతకుంట్ల గ్రామ పంచాయతీలోని అన్నిశాఖల అధికారులతో సమావేశం నిర్వహించి అవసరాలను గుర్తించారు. నోడల్టీమ్ గ్రామ పరిధిలోని కొర్రతండా, దేశ్ముఖోనితండాల్లో పర్యటించి.. అక్కడి అవసరాలను గుర్తించి సీపీఓకు నివేదిక అందించినట్లు సమాచారం. కానీ, ఇప్పటి వరకు అందుకు సంబంధించిన నివేదిక డేటా ఎంట్రీ ప్రక్రియ కూడా పూర్తికానట్లు తెలుస్తుంది. అయితే దత్తత గ్రా మాలపై అన్ని శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ కొంతమంది అధికారులకు సరైన మార్గదర్శకాలు లేకపోవడం, దత్తత గ్రామాలకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై స్పష్టత లేకపోవడంతో ఇంకా ముందడుగే పడలేదు.
దత్తత గ్రామానికి ఒక్కసారే వచ్చిన గుత్తా
మూడు నెలల క్రితం చింతకుంట్లను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన ఎంపీ సుఖేందర్రెడ్డి ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే గ్రామానికి వచ్చారు.
కృష్ణా జలాలు అందించాలి
గ్రామంలో మంచినీటి కోసం ఓవర్హెడ్ ట్యాంక్ నిర్మించి తాగడానికి కృష్ణా జలాలు అందించాలి. దీంతో పాటు తండాలో సీసీ రోడ్ల నిర్మాణం, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలి. గతంలో ఇళ్లు నిర్మించుకోలేనివారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలి. అధికారులు గత నెల ఇంటింటి సర్వే నిర్వహించి మౌలిక వసతుల గురించి తెలుసుకున్నారు.
-కొర్ర పాండు, కొర్రతండా
అధికారుల దృష్టికి తీసుకెళ్లాం
చింతకుంట్లలో సమకూర్చాల్సిన మౌలిక వసతుల గురించి నోడల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. గ్రామంలో పీహెచ్సీ సెంటర్, హైస్కూల్ భవనం, ఎస్సీ, ఎస్టీ హాస్టల్, డ్రెయినేజీ, గ్రంథాలయం, పశువైద్యశాల, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతుల ఏర్పాటు విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేశాం. అంతేకాకుండా గ్రామానికి కృష్ణా జలాలు సరఫరా చేయాలి.
- యాదమ్మ, సర్పంచ్, చింతకుంట్ల
రోడ్డు అధ్వానంగా ఉంది
మా గ్రామానికి బీటీ రోడ్డు లేదు. చిల్కమర్రి గేటు నుంచి దేశ్ముఖోనికుంట వరకు మట్టి రోడ్డు అధ్వాన్నంగా ఉంది. దీనికి తోడు గతంలో గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టలేదు. మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నారు. దత్తత గ్రామంగా ఎంపికైనా ఎలాంటి అభివృద్ధి జరగలేదు.
-మాణిక్యం,
దేశ్ముఖోనికుంట