Identity documents
-
ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్.. అన్నిటికీ ఒకటే కార్డు
న్యూఢిల్లీ: ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి అనేక గుర్తింపు కార్డుల స్థానంలో దేశవ్యాప్తంగా ఒకే ఒక్క బహుళార్థక గుర్తింపు కార్డు ఉండాల్సిన అవసరముందని హోం మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. సమాచారాన్నంతటినీ డిజిటల్ రూపంలోకి తీసుకువచ్చేందుకు 2021లో దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణకు మొబైల్ యాప్‌ను వాడనున్నట్లు ప్రకటించారు. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, జనగణన కమిషనర్ కార్యాలయ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేసిన అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ.. ‘2021 నాటి జనాభా లెక్కల సేకరణకు మొట్టమొదటి సారిగా మొబైల్ ఫోన్ అప్లికేషన్‌ను ఉపయోగించనున్నాం. జనగణనలో ఇదో విప్లవాత్మకమైన మార్పు కానుంది. అన్ని వివరాలను ఒకే కార్డులో నిక్షిప్తం చేసేందుకు ఇది సాయపడుతుంది’ అని వివరించారు. దేశ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలకు, సంక్షేమ పథకాలకు 2021 జనాభా లెక్కలే ప్రాతిపదికగా మారనున్నాయన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ‘‘దేశంలోని 130 కోట్ల మందికి జనాభా లెక్కల సేకరణ వల్ల కలిగే లాభాలను వివరించాలి. ప్రభుత్వ పథకాలకు ఈ జాబితా, వివరాలను ఎలా ఉపయోగకరమో తెలియజేయాలి. ఈ సమాచారం దేశ పురోగతిలో కీలకమైన పాత్ర పోషిస్తుంది’’అన్నారు. 2011 జనగణన ఆధారంగా కేంద్రం చేపట్టిన 22 సంక్షేమ పథకాల్లో విజయవంతంగా అమలవుతున్న ‘ఉజ్వల’, ‘బేటీ బచావో బేటీ పఢావో’ ఉన్నాయన్నారు. అధికారులూ పుణ్యం కట్టుకోండి..! జనాభా లెక్కలను నిజాయతీతో నిర్వహించడం ద్వారా అధికారులు పుణ్యం కట్టుకోవాలని, జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని హోం మంత్రి కోరారు. జనగణన మున్సిపాలిటీ వార్డుల హద్దులు నిర్ణయించడం మొదలుకొని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలను గుర్తించడం వరకూ ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఇప్పటివరకూ ప్రభుత్వం అరకొర పద్ధతుల్లోనే సంక్షేమ పథకాలను చేపట్టిందని, గత ప్రభుత్వాలు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయకపోవడమే దీనికి కారణమని వ్యాఖ్యానించారు. 2021 నాటి జనగణనపై హోం మంత్రి మాట్లాడుతూ.. మంచు ప్రాంతాలతో కూడిన జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో రెఫరెన్స్ డేట్ 2020 అక్టోబరు ఒకటో తేదీ కాగా దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు 2021 మార్చి 21గా ఉండనుందని చెప్పారు. మొత్తం 16 భాషల్లో రూ.12 వేల కోట్ల ఖర్చుతో జనగణన చేపట్టనున్నామని వివరించారు. దీంతోపాటు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కోసం కూడా వివరాలు సేకరిస్తామని మంత్రి తెలిపారు. దేశవ్యాప్త ఎన్ఆర్సీకి ఈ జాబితా ప్రాతిపదిక కావచ్చునని అధికారుల అంచనా. -
సిమ్ కార్డులతో నయా మోసం
వినియోగదారుల గుర్తింపు కార్డుల ఫోర్జరీతో మరికొన్ని సిమ్‌కార్డులు నకిలీ నోకియా 1100 సెల్ఫోన్ల విక్రయం జంట హత్యకేసులో వాడిన సిమ్‌కార్డులతో వ్యవహారం బట్టబయలు నంద్యాలటౌన్: వినియోగదారులు కొత్త సిమ్‌కార్డు కోసం ఇచ్చిన ఫొటోలు, గుర్తింపు పత్రాలను ఫోర్జరీ చేసి, వారి పేరిట, వారికి తెలియకుండా మరికొన్ని సిమ్‌కార్డులను కొని, యాక్టివేషన్ చేసి నలుగురు సెల్ పాయింట్ల యజమానులు అమ్ముకున్నారు. ఓ కేసులో పోలీసులు తమకు లభించిన క్లూ లాగితే సిమ్‌కార్డుల డొంక కదిలింది. వన్‌టౌన్ ఇన్చార్జ్ సీఐ జయరాం గురువారం విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలు.. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ సెల్ పాయింట్ యజమాని రామమడుగు వెంకటేష్, లక్ష్మి సెల్పాయింట్ యజమాని గుజరాతి శ్రీనివాసులు, బైర్మల్ వీధిలోని కొత్త మసీదు వద్ద ఉన్న సల్మా సెల్పాయింట్ యజమాని షేక్ ఉద్యోగి నయూమ్ అక్రమాలకు పాల్పడ్డారు. వీరు కొత్తగా సిమ్‌కార్డుల కోసం వినియోగదారులు ఇచ్చిన ఫొటోలను, గుర్తింపు పత్రాలను జెరాక్స్ చేసి, ఫోర్జరీకి పాల్పడ్డారు. తర్వాత ఈ ఫొటోలు గుర్తింపు కార్డుల జిరాక్స్ పత్రాలను మరికొన్ని సిమ్‌కార్డుల దరఖాస్తులకు జత చేసి, యాక్టివేషన్ చేశారు. ఇలా యాక్టివేషన్ చేసిన సిమ్‌కార్డుల ధరపై రూ.వంద అదనంగా విక్రయించారు. ఇదలా ఉంచితే, ఇటీవల శ్రీనివాస నగర్‌లోని జరిగిన జంట హత్య కేసులో నిందితులు, హతులు ఈ సిమ్‌కార్డులను ఉపయోగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో సెల్ పోయింటపై దాడుల చేసి, సిమ్ కార్డులను, దరఖాస్తులను పరిశీలించగా బండారం బయట పడింది. నకిలీ నోకియా సెల్ఫోన్లు స్వాధీనం సల్మా సెల్ పాయింట్ నిర్వాహకులు షేక్, నయూమ్ నకిలీ నోకియా సెల్ ఫోన్లను విక్రయించేవారు. చెన్నై, హైదరాబాద్‌లలో నోకియా 1100 మోడల్‌ను పోలిన నకిలీలను రూపొందించారు. వీటిని వీరిద్దరూ రూ.250 కొని వినియోగదారులకు రూ.1250కు అమ్మేవారు. వీరి నుంచి సిమ్ కార్డులు, దరఖాస్తులు, గుర్తింపు కార్డుల జెరాక్స్ పత్రాలు, 12నకిలీ నోకియా సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ వెల్లడించారు. దాడులను నిర్వహించిన సిబ్బంది సుధీష్, చంద్రశేఖర్, గంగాధర్, సుబ్బరాజు, శివయ్య, జంబులయ్య, బేగ్, మల్లికార్జునలను ఆయన అభినందించారు.