సిమ్ కార్డులతో నయా మోసం
వినియోగదారుల గుర్తింపు కార్డుల ఫోర్జరీతో మరికొన్ని సిమ్‌కార్డులు
నకిలీ నోకియా 1100 సెల్‌ఫోన్ల విక్రయం
జంట హత్యకేసులో వాడిన సిమ్‌కార్డులతో వ్యవహారం బట్టబయలు
నంద్యాలటౌన్: వినియోగదారులు కొత్త సిమ్‌కార్డు కోసం ఇచ్చిన ఫొటోలు, గుర్తింపు పత్రాలను ఫోర్జరీ చేసి, వారి పేరిట, వారికి తెలియకుండా మరికొన్ని సిమ్‌కార్డులను కొని, యాక్టివేషన్ చేసి నలుగురు సెల్ పాయింట్ల యజమానులు అమ్ముకున్నారు. ఓ కేసులో పోలీసులు తమకు లభించిన క్లూ లాగితే సిమ్‌కార్డుల డొంక కదిలింది. వన్‌టౌన్ ఇన్‌చార్జ్ సీఐ జయరాం గురువారం విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలు.. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ సెల్ పాయింట్ యజమాని రామమడుగు వెంకటేష్, లక్ష్మి సెల్‌పాయింట్ యజమాని గుజరాతి శ్రీనివాసులు, బైర్మల్ వీధిలోని కొత్త మసీదు వద్ద ఉన్న సల్మా సెల్‌పాయింట్ యజమాని షేక్ ఉద్యోగి నయూమ్ అక్రమాలకు పాల్పడ్డారు. వీరు కొత్తగా సిమ్‌కార్డుల కోసం వినియోగదారులు ఇచ్చిన ఫొటోలను, గుర్తింపు పత్రాలను జెరాక్స్ చేసి, ఫోర్జరీకి పాల్పడ్డారు. తర్వాత ఈ ఫొటోలు గుర్తింపు కార్డుల జిరాక్స్ పత్రాలను మరికొన్ని సిమ్‌కార్డుల దరఖాస్తులకు జత చేసి, యాక్టివేషన్ చేశారు. ఇలా యాక్టివేషన్ చేసిన సిమ్‌కార్డుల ధరపై రూ.వంద అదనంగా విక్రయించారు. ఇదలా ఉంచితే, ఇటీవల శ్రీనివాస నగర్‌లోని జరిగిన జంట హత్య కేసులో నిందితులు, హతులు ఈ సిమ్‌కార్డులను ఉపయోగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో సెల్ పోయింటపై దాడుల చేసి, సిమ్ కార్డులను, దరఖాస్తులను పరిశీలించగా బండారం బయట పడింది.
నకిలీ నోకియా సెల్‌ఫోన్లు స్వాధీనం
సల్మా సెల్ పాయింట్ నిర్వాహకులు షేక్, నయూమ్ నకిలీ నోకియా సెల్ ఫోన్లను విక్రయించేవారు. చెన్నై, హైదరాబాద్‌లలో నోకియా 1100 మోడల్‌ను పోలిన నకిలీలను రూపొందించారు. వీటిని వీరిద్దరూ రూ.250 కొని వినియోగదారులకు రూ.1250కు అమ్మేవారు. వీరి నుంచి సిమ్ కార్డులు, దరఖాస్తులు, గుర్తింపు కార్డుల జెరాక్స్ పత్రాలు, 12నకిలీ నోకియా సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ వెల్లడించారు. దాడులను నిర్వహించిన సిబ్బంది సుధీష్, చంద్రశేఖర్, గంగాధర్, సుబ్బరాజు, శివయ్య, జంబులయ్య, బేగ్, మల్లికార్జునలను ఆయన అభినందించారు.