ఒంటరి బతుకుల్లో రాఖీ వసంతం
బృందావనంలో తొలిసారి వితంతువుల వేడుకలు
బృందావనం: భర్తను కోల్పోయి ఇంటికే పరిమితమైన వితంతువులను సమాజంలో భాగం చేయడానికి ఓ స్వచ్ఛంద సంస్థ చేసిన ప్రయత్నం ఫలించింది. శనివారం దాదాపు 800 మంది వితంతువులు అన్ని కట్టుబాట్లను విడనాడి తొలిసారిగా రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. తమకు దక్కిన భాగ్యానికి మురిసిపోతూ ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు. శ్రీకృష్ణుడి రంగ స్థలమైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బృందావనం ఇందుకు వేదికైంది. ఢిల్లీలోని వివిధ స్కూళ్ల నుంచి వచ్చిన పిల్లలకు, బృందావనంలో తిరుగాడే సాధువులకు వితంతువులు రాఖీలు కట్టారు. వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్న సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ ఇక్కడి మీరా సహభాగినీ ఆశ్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ సంస్థ ఇక్కడి ఐదు ఆశ్రమాల్లో ఉంటున్న దాదాపు వెయ్యి మంది వితంతువుల బాగోగులు చూసుకుంటోంది. వీరంతా గతంలో హోలీ, దీపావళి వేడుకల్లో కూడా ఇలాగే పాల్గొన్నారు. ఇప్పుడు రక్షా బంధన్ పండుగనూ ఉత్సాహంగా జరుపుకొన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా వీరు కట్టిన రంగురంగుల రాఖీలను కూడా వితంతువులే తయారు చేయడం విశేషం. దాదాపు వంద మంది వృద్ధ మహిళలు వీటిని రూపొందిం చారు. వితంతువుల పట్ల సమాజ దృక్పథంలో మార్పు తేవడానికే ఈ ప్రయత్నమని సులభ్ సంస్థ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ తెలిపారు. ఇక తమ సంక్షేమానికి కృషి చేయాలని కోరుతూ బృందావన్‌లోని వితంతువుల తరఫున దాదాపు 2 వేల రాఖీలతో ఓ బృందం ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.