శాంతి భద్రతలపై కఠిన వైఖరి
కేసీఆర్ ఆలోచన మేరకు ఫ్రెండ్లీ పోలీసింగ్
వీలైంతన వరకూ స్టేషన్లోనే సమస్యల పరిష్కారం
తొగుట: తెలంగాణ రాష్ట్రాన్ని నేర రహిత సమాజంగా మార్చే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తున్నట్టు హైదరాబాద్ ఐజీ వై నాగిరెడ్డి అన్నారు. మంగళవారం తొగుట సర్కిల్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ సీఎం కెసీఆర్ ఆలోచన మేరకు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని ప్రజలకు మరింత చేరువ చేయనున్నట్టు చెప్పారు. సంఘటన జరిగిన ప్రదేశానికి పోలీసులు వీలైనంత తొందరగా చేరుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రజలు తమ సమస్యలను వీలైనంత వరకు స్టేషన్ పరిధిలోనే పరిష్కరించుకునే విధంగా ప్రజలను చైతన్యం చేయాలని చెప్పారు. ఇందుకోసం పోలీస్ శాఖ తమవంతు సహకారాన్ని ప్రజలకు ఎప్పటికీ అందిస్తుందని పేర్కొన్నారు. చట్ట ప్రకారం కావాల్సిన సూచనలు, సలహాలను కూడ స్టేషన్‌కు వచ్చే బాధితులకు పోలీసులు వివరిస్తారన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో రికార్డులను సమర్ధవంతంగా నిర్వహించాలని పోలీసులకు సూచించారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం తొగుట సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో క్రైమ్ రేటు తగ్గినట్లు తెలిపారు. ఇందుకోసం కృషిచేసిన పోలీస్ అధికారులను ఐజీ అభినందించారు. అలాగే స్టేషన్ ఆవరణలో సిద్దిపేట కమిషనర్ శివకుమార్‌తో కలిసి మొక్కలు నాటారు.
పోలీసులు ఆత్మ స్థైర్యంతో ఉండాలి
ప్రజల రక్షణ, శాంతి భద్రతలు, ప్రభుత్వంలో ఉన్న వీఐపీలకు భద్రత కల్పించడంలో పోలీసులు ఎప్పుడూ ముందుంటారని ఐజీ నాగిరెడ్డి చెప్పారు. అయితే స్టేషన్ పరిధిలో పనిచేసే సిబ్బంది నిబ్బరంతో పనిచేస్తున్నా.. కొందరు సిబ్బంది ఆత్మస్థైర్యం కోల్పోవడం సరికాదన్నారు. విధి నిర్వాహణలో క్షేత్రస్దాయి సిబ్బందికి ఎలాంటి ఒత్తిడులు ఎదురైనా వెంటనే ఉన్నతాధికారుల దష్టికి తీసుకుపోయి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఎస్ఐ స్థాయి అధికారులకు ట్రెయినింగ్ పిరియడ్‌లోనే మానసిక, ఆత్మస్థైర్యం కోల్పోకుండా శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట కమిషనర్ శివకుమార్, గజ్వేల్ ఏసీపీ గిరిధర్, తొగుట సీఐ సోంనారాయణసింగ్, ఎస్ఐలు రంగ కృష్ణ, పరశురాములు, స్వామి, ప్రభాకర్‌రెడ్డి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.