మలిదశలో మెరవాలంటే..
మేనేజ్మెంట్ విద్యకు మేలైన మార్గాలుగా విరాజిల్లుతున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లతో పాటు, ప్రముఖ బి-స్కూళ్లలో అడుగుపెట్టేందుకు దారిచూపే ‘క్యాట్-2013’ ఫలితాలు జనవరి 14న వెలువడ్డాయి. మెరుగైన స్కోర్‌ను సాధించిన వారు లక్ష్య సాధనలో ఒక మెట్టు ఎక్కినట్లే! ఇప్పటి నుంచి ప్రతిష్ఠాత్మక ఐఐఎంలలో మేనేజ్మెంట్ పీజీ సీట్లను చేజిక్కించుకునే దిశగా చేసే ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లు- విజయ వ్యూహాలపై ఫోకస్..
ఓ సంస్థ ప్రగతి పథంలో నడవాలంటే పక్కా ప్రణాళిక అవసరం.. ఆ ప్రణాళికను పదునైన వ్యూహాలతో పట్టాలకెక్కించగల నిర్వాహకులూ అవసరం. అందుబాటులో ఉన్న ఆర్థిక, సాంకేతిక వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ సంస్థలను లాభాల బాటలో పయనింపజేసే వారి కోసం యాజమాన్యాలు నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుశిక్షితులైన ‘మేనేజ్మెంట్’ మానవ వనరులను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లు అందిస్తున్నాయి. వీటిలో విద్యార్జన చేయాలని చాలామంది కలలు కంటారు.
ఐఐఎం- ఎంపిక విధానం:
క్యాట్-2013లో సాధించిన స్కోర్, గత అకడమిక్ రికార్డు, పని అనుభవం ఆధారంగా ఐఐఎంలు అభ్యర్థులను రెండో దశ.. జీడబ్ల్యూపీఐ (బృంద చర్చ/ రిటెన్ ఎబిలిటీ టెస్ట్ - పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తాయి. ఇందులో ప్రతిభ ఆధారంగా వెయిటేజ్ ఇస్తాయి. తుది జాబితాను రూపొందించే క్రమంలో ఐఐఎంలు క్యాట్-2013 స్కోర్; జీడబ్ల్యూపీఐ వెయిటేజ్; అకడమిక్ ప్రతిభ; పని అనుభవం; పాఠ్యేతర కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకుంటాయి.
వన్నె తగ్గిన జీడీ:
గతంలో ఐఐఎంలు ఎంపిక ప్రక్రియకు సంబంధించిన రెండో దశలో బృంద చర్చ (జీడీ)కు అధిక ప్రాధాన్యం ఇచ్చేవి. అయితే 2014-16 బ్యాచ్ ఎంపిక విధానంలో మొత్తం 13 ఐఐఎంలలో ఐఐఎం-లక్నో, ఐఐఎం-కోజికోడ్ మాత్రమే జీడీకి చోటు కల్పించాయి. మిగిలినవన్నీ దీన్ని తొలగించాయి. ఇవి జీడీ స్థానంలో రిటెన్ ఆప్టిట్యూడ్ టెస్ట్/రిటెన్ ఎబిలిటీ టెస్ట్/ రిటెన్ అనాలసిస్ టెస్ట్ (గిఅఖీ)ను నిర్వహించనున్నాయి. చాలా సందర్భాల్లో బృంద చర్చలో కొందరు అభ్యర్థులు అత్యుత్సాహం ప్రదర్శించి, మిగిలిన వారు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదు. ఇలాంటి సందర్భాల్లో మంచి మేనేజీరియల్ నైపుణ్యాలున్నప్పటికీ కొందరు అభ్యర్థుల ప్రతిభ బయటకు రావడం లేదు. ఈ కారణాల వల్ల జీడీకి బదులు రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌ను నిర్వహించేందుకు ఐఐఎంలు ఆసక్తి చూపుతున్నాయి.
రిటెన్ ఎబిలిటీ టెస్ట్:
11 ఐఐఎంలు, టాప్ బి-స్కూల్స్ రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ పరీక్షను ఒక రకంగా వ్యాస రచన పరీక్ష అని చెప్పొచ్చు. స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో తమ కమ్యూనికేషన్ నైపుణ్యాలను బయటపెట్టుకునే అవకాశాన్ని మేనేజ్మెంట్ ఔత్సాహికులందరికీ ఇవ్వడమే లక్ష్యంగా ఈ పరీక్షను ప్రవేశపెట్టారు. ఈ పరీక్ష ద్వారా అభ్యర్థుల భావ ప్రసార నైపుణ్యాలను, విశ్లేషణ సామర్థ్యాన్ని, ఆలోచనా శక్తిని, నిర్దేశ అంశంపై అవగాహనను పరిశీలిస్తారు. ఈ పరీక్షకు సంబంధించిన అంశాలు జనరల్ లేదా వర్తమాన వ్యవహారాలకు సంబంధించినవి ఉంటాయి. నిర్దేశ అంశంపై అభ్యర్థులు తమ ఆలోచనలకు అక్షరరూపం ఇవ్వాల్సి ఉంటుంది.
దీనికి సాధారణంగా 10 నిమిషాల నుంచి 30 నిమిషాల సమయం ఇస్తున్నారు. మంచి ఉపోద్ఘాతం, సమకాలీన అంశాలను ఉదాహరణలుగా పేర్కొనడం, వివిధ కోణాలను స్పృశించడం, అవసరమైన చోట పాయింట్ల వారీగా వివరణ, చక్కని ముగింపు ఇస్తే ఇందులో ఎక్కువ స్కోర్ సాధించవచ్చు. అక్షర దోషాలు లేకుండా చూసుకోవడం, చేతి రాతను మెరుగుపరచుకోవడం తప్పనిసరి. వేగంగా ఆలోచించే సామర్థ్యాన్ని ఒంటబట్టించుకుంటూ, సరైన ప్రాక్టీస్ చేస్తే ఈ విభాగంలో రాణించగలరు.
ఉదా: ఐఐఎం- బెంగళూరు గతంలో ‘భారతీయ క్రీడా రంగానికి విదేశీ కోచ్‌లు తెల్ల ఏనుగుల మాదిరి తయారయ్యారు’ అంశాన్ని రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లో ఇచ్చింది.
బృంద చర్చ:
సాధారణంగా బృంద చర్చలో 8 నుంచి 12 మంది అభ్యర్థులను ఒక బృందంగా ఏర్పాటు చేస్తారు. వీరికి ఒక అంశాన్ని ఇచ్చి, దానిపై విశ్లేషణాత్మకంగా చర్చించమంటారు. 15-20 నిమిషాల పాటు జరిగే బృంద చర్చ ద్వారా భావ ప్రసార నైపుణ్యాలు, విశ్లేషణ సామర్థ్యం, బృంద స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, సమయస్ఫూర్తి వంటి అంశాలను పరిశీలిస్తారు. భవిష్యత్తు జీవితంలో ఓ సంస్థ నిర్వహణలో కీలకపాత్ర పోషించేందుకు అవసరమైన నైపుణ్యాలు అభ్యర్థిలో ఉన్నాయా? లేదా? అనేదాన్ని జీడీ ద్వారా అంచనా వేస్తారు. బృంద చర్చలో అభ్యర్థులు చివరకు అందరికీ ఆమోదయోగ్యమైన ముగింపును ఇవ్వాల్సి ఉంటుంది.
బృంద చర్చలో ఎట్టి పరిస్థితిలోనూ ఇతరులతో వాదనకు దిగకూడదు. ఇతరులు చెప్పిన విషయాలతో ఏకీభవించకపోతే, అవి ఎందుకు సరైనవి కావో విఫులంగా, సున్నితంగా చెప్పాలి.
బృందంలోని ఇతర అభ్యర్థులను మాట్లాడనీయకుండా అడ్డుకోరాదు.
చెప్పాలనుకున్న అంశాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడంతోపాటు ఇతరులు చెప్పేవాటిని వినాలి. మీరు చెప్పిన విషయాలకు, ఉదాహరణలు జోడిస్తూ మీరు చెప్పింది నిజమని నిరూపించుకోవాలి.
చివరకు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం/ముగింపు కోసం ఎవరినీ బలవంతపెట్టకూడదు.
గ్రూప్ డిస్కషన్లో సాధారణంగా కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన అంశాలు వస్తుంటాయి. ఈ విభాగంలో విజయం సాధించేందుకు దినపత్రికలు, మేగజైన్లలోని అంశాలపై స్నేహితులతో చర్చించాలి. ఎడిటోరియల్స్, టీవీ చర్చలను గమనించాలి.
పర్సనల్ ఇంటర్వ్యూ
ఎంపిక విధానంలో ఇంటర్వ్యూ కీలక దశ. దీనిద్వారా అభ్యర్థులకు తమ లక్ష్యంపై స్పష్టమైన అవగాహన ఉందో? లేదో? చూస్తారు. భావ ప్రసార నైపుణ్యాలను పరీక్షిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ అంటే కేవలం వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయనుకుంటే పొరపాటే. మేనేజ్మెంట్ కెరీర్ వైపు ఎందుకు అడుగులు వేయాలనుకుంటున్నారు? వంటి ప్రశ్నలు అడుగుతారు.
అభ్యర్థులు తమ భవిష్యత్ లక్ష్యాలపై స్పష్టమైన అభిప్రాయాలను ఏర్పరుచుకొని, ఇంటర్వ్యూకు సిద్ధపడాలి.
మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం, మీ అభిరుచులు, మీ బలాలు, బలహీనతలపై ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో భాగంగా పత్రికల్లోని సంపాదకీయాలను చదవడం, వివిధ అంశాలపై సొంత అభిప్రాయాలను ఏర్పరుచుకోవడం చేయాలి. తక్కువ సమయంలో ఒక సమస్యకు పరిష్కార మార్గం చూపించే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. మాక్ ఇంటర్వ్యూలకు హాజరవడం వల్ల మెరుగైన ఫలితాలుంటాయి.
మెరుగైన క్యాట్ స్కోర్‌తో ఐఐఎం!
మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు దేశంలో టాప్-15లో ఉన్న సంస్థలు సాధారణంగా ఒక సీటుకు 10 నుంచి 15 మందిని రెండో దశకు ఎంపిక చేస్తాయి. రెండు దశల్లోనూ విద్యార్థులు చూపిన ప్రతిభ, అకడమిక్ నేపథ్యం, పని అనుభవం ఆధారంగా తుది జాబితాను రూపొందిస్తాయి. ఎంపిక ప్రక్రియలో వివిధ అంశాలకు ఇచ్చే వెయిటేజ్‌లు ఇన్స్టిట్యూట్లు ఎప్పటికప్పుడు మారుస్తున్నాయి. ఐఐఎం యేతర విద్యా సంస్థలు సాధారణంగా ఎంట్రన్స్ పరీక్ష స్కోర్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ఇప్పటి వరకు పూర్తిచేసిన అకడమిక్ కోర్సుల్లో 90 శాతం సాధించడంతో పాటు కనీసం మూడేళ్లు పని అనుభవం లేకుంటే ఐఐఎంలలో సీటు సంపాదించడం కష్టమని చాలామంది భావిస్తారు. అయితే ఇది నిజం కాదు. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 13 ఐఐఎంలలో కేవలం రెండు ఐఐఎంలు (బెంగళూరు, ఇండోర్) మాత్రమే ఈ రెండు అంశాలకు 20 శాతం కంటే ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నాయి. అందువల్ల క్యాట్, జీడబ్ల్యూపీఐ దశల్లో మంచి ప్రతిభ కనబరిస్తే ఏదో ఒక ఐఐఎంలో సీటు పొందడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
- రామనాథ్ కనకదండి,
కోర్సు డెరైక్టర్ (క్యాట్), T.I.M.E ఇన్స్టిట్యూట్.
వర్తమాన అంశాలపై పట్టుండాలి
బృంద చర్చ అంశాలు సాధారణంగా కరెంట్ అఫైర్స్ ఆధారంగా ఉంటాయి. మరికొన్ని అంశాలు అభిప్రాయాల ఆధారంగా ఉండొచ్చు. అందువల్ల అభ్యర్థులు ఎప్పటికప్పుడు చోటుచేసుకుంటున్న ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తుండాలి. దీనికోసం పత్రికలు, మ్యాగజైన్లను ఉపయోగించుకోవాలి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో భాగంగా అభ్యర్థులు వర్తమాన వ్యవహారాలపై ముఖ్యంగా బిజినెస్ సంబంధిత అంశాలపై పట్టు సాధించాలి. ఒక సమస్యకు పరిష్కార మార్గం సూచించేలా వివిధ అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఒక సంఘటన అలాగే ఎందుకు జరిగింది? ఆ స్థానంలో నువ్వుంటే ఏం చేస్తావు? వంటి పశ్నలు ఎదురవుతాయి. అభ్యర్థులు తమ వ్యక్తిగత సమాచారం, జీవితంలో సాధించిన విజయాలపై ప్రశ్న లు రావొచ్చు. ఎందుకు ఎంబీఏ చేయాలనుకుంటున్నావు? ఈ సంస్థలోనే ఎందుకు చదవాలనుకుంటున్నావు? వంటి సాధారణ ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు ఇవ్వగలగాలి. ఇంటర్వ్యూలో విజయానికి ఆత్మవిశ్వాసం, నిజాయితీ ప్రధానం.
- పల్లా రవితేజ,
మేనేజ్మెంట్ స్టూడెంట్, ఐఐఎం కలకత్తా.
జీడీ/రిటెన్ ఎబిలిటీ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ దశకు ఎంపిక చేసేందుకు ఐఐఎంలు నిర్దేశించిన క్యాట్- 2013 పర్సంటైల్ కటాఫ్స్ (జనరల్ కేటగిరీ)
ఐఐఎం, అహ్మదాబాద్ 90
ఐఐఎం, బెంగళూరు 90
ఐఐఎం, కోల్‌కతా 95
ఐఐఎం, లక్నో 90
ఐఐఎం, ఇండోర్ 90
ఐఐఎం, కోజికోడ్ 90
రాజీవ్ గాంధీ ఐఐఎం, షిల్లాంగ్ 90
ఐఐఎం, రాంచీ 90
ఐఐఎం, రోహ్తక్ 90
ఐఐఎం, రాయ్‌పూర్ 90
ఐఐఎం, తిరుచ్చి 90
ఐఐఎం, ఉదయ్‌పూర్ 90
ఐఐఎం, కాశీపూర్ 90
టాప్ పబ్లిక్ బి-స్కూల్స్
ఐఐఎం- అహ్మదాబాద్
ఐఐఎం- బెంగళూరు ఐఐఎం-కోల్‌కతా
డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఐఐటీ ఢిల్లీ
డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఐఐటీ చెన్నై