జేఎన్‌యూ వీసీగా తెలుగు వ్యక్తి
* నల్లగొండ జిల్లా వాసి జగదీశ్‌కు కుమార్‌కు పట్టం
* వర్సిటీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్యూ) వైస్ చాన్స్‌లర్ గా నల్లగొండ జిల్లాకు చెందిన ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. జగదీశ్ కుమార్ త్వరలో నియమితులు కానున్నారు. అన్ని కేంద్ర విశ్వవిద్యాలయాల విజిటర్ అయిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పంపించిన 4 పేర్ల జాబితా నుంచి జగదీశ్ కుమార్‌ను ఎంపిక చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రముఖ శాస్త్రవేత్త వీఎస్ చౌహాన్, జేఎన్‌యూ లోని అప్లైడ్ హ్యూమన్ జెనెటిక్స్ నేషనల్ సెంటర్ కో-ఆర్డినేటర్ ఆరెన్కే బమేజాయ్, జేఎన్‌యూ భౌతిక శాస్త్ర విభాగానికి చెందిన రామకృష్ణ రామస్వామి పేర్లు జాబితాలో ఉన్నాయి.
జెఎన్యూ ప్రస్తుత వైస్‌చాన్స్‌లర్ సుధీర్ కుమార్ పదవీకాలం ఈ నెల 27తో ముగుస్తుంది. ఢిల్లీ ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న జగదీశ్ కుమార్ నల్లగొండ జిల్లాలోని మామిడాల గ్రామంలో జన్మించారు. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా లో సభ్యులుగా కూడా ఆయన కొనసాగుతున్నారు. వివిధ ఐఐటీలలో పని చేసిన విశేష అనుభవం ఉన్న జగదీశ్ కుమార్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్టీచింగ్ను కూడా అందుకున్నారు. తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత ఢిల్లీ ఐఐటీ, జేఎన్‌యూల మధ్య సహకారంతో రెండు సంస్థల బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.
ఇంజనీరింగ్ విద్యతో పాటు హ్యుమానిటీస్ కూడా చాలా ప్రధానమైనవని.. ఈ రెండూ కలిసి ముందుకు సాగాలని ఆయన అన్నారు. ‘‘జేఎన్‌యూ ఒక విశిష్టమైన సంస్థ. దీని పరిధిలో భాషలు, అంతర్జాతీయ విద్య, న్యాయశాస్త్రం వంటి వివిధ కోర్సులను బోధించే సంస్థలతో పాటు పాఠశాలలు కూడా ఉన్నాయి. వీటిని బలోపేతం చేయటం నా లక్ష్యం’ అని ఆయన పేర్కొన్నారు.