ఒకే ఇంజనీరింగ్ ఎంట్రన్స్!
ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహణ యోచనలో కేంద్రం
ప్రస్తుతం బీటెక్ ఔత్సాహిక విద్యార్థులు సగటున పది ప్రవేశ పరీక్షలకు హాజరవుతున్నారు. వీటిలో జేఈఈ, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఎంట్రన్స్‌లు, ప్రైవేటు యూనివర్సిటీలు సొంతంగా నిర్వహిస్తున్న పరీక్షలు ఉన్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే క్రమంలో దరఖాస్తు దశ నుంచి ప్రిపరేషన్ వరకు విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వీటికి స్వస్తి పలకాలనే ఆలోచనతో 2018 నుంచి జాతీయస్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలన్న ఉద్దేశంతో కేంద్రం ఉన్నట్లు సమాచారం. పరీక్ష నిర్వహణ, పర్యవేక్షణకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరిధిలో సెంటర్ ఫర్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ స్టడీస్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
జేఈఈ మెయిన్‌కు స్వస్తి?
ప్రతిపాదిత జాతీయస్థాయి ఉమ్మడి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష కార్యరూపం దాల్చితే.. జేఈఈ మెయిన్ విధానానికి స్వస్తి పలికేందుకు అవకాశముంది. అయితే ఐఐటీల్లో ప్రవేశాలకు మాత్రం విద్యార్థులు ఇప్పటి (జేఈఈ–అడ్వాన్స్డ్) మాదిరిగానే మరో ప్రత్యేక ఎంట్రన్స్‌కు హాజరవ్వాల్సిందే. దీనిపై విద్యావేత్తలు పెదవి విరుస్తున్నారు. ఇలాచేస్తే ఉమ్మడి పరీక్ష వల్ల ప్రత్యేక ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు.
రెండు రకాలుగా ర్యాంకులు
ఉమ్మడి ఇంజనీరింగ్ పరీక్షను నిర్వహించడం ద్వారా ర్యాంకులను రెండు రకాలుగా (ఆలిండియా ర్యాంకు, లోకల్ ర్యాంకు) ఇచ్చే అవకాశం ఉంది. ఆలిండియా ర్యాంకు ద్వారా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర ఇన్స్టిట్యూట్లలో ప్రవేశాలు చేపట్టే అవకాశం ఉంది. లోకల్ ర్యాంకును రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకొని కేటాయించే అవకాశముంది. దీని ద్వారా ఆయా రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌లు నిర్వహించే అవకాశముంది.
సిలబస్‌ల విషయంలో గందరగోళం
జాతీయ స్థాయి ఉమ్మడి పరీక్ష ఆలోచన నేపథ్యంలో వినిపిస్తున్న మరో ప్రతికూల వ్యాఖ్య.. సిలబస్‌ల విషయంలో గందరగోళం నెలకొంటుందనేది. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ సిలబస్‌ను సీబీఎస్ఈకి సరితూగే విధంగా మార్చినప్పటికీ.. వివిధ రాష్ట్రాల్లో సిలబస్ సీబీఎస్ఈ స్థాయికి అనుగుణంగా లేదని ఆ రాష్ట్రాలు నిరసన వ్యక్తం చేసే పరిస్థితులు కనిపిస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెడికల్ కోర్సులకు నీట్‌ను ప్రతిపాదించినప్పుడు ఎదురైన అనుభవాలే మళ్లీ ఎదురవుతాయని
అంటున్నారు.
పరీక్ష విధానంపైనా ఆందోళన
జేఈఈ మెయిన్‌కు బదులు ఉమ్మడి ఇంజనీరింగ్ పరీక్ష ఉంటుందనే సంకేతాల నేపథ్యంలో పరీక్ష విధానంపైనా సాధారణ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఒక నిర్దిష్ట విధానంలో జరుగుతున్న రాష్ట్రాల స్థాయిలోని సెట్లు, వాటి పరీక్ష శైలికి అలవాటు పడిన విద్యార్థులు జేఈఈ మెయిన్ తరహా విధానాన్ని అందిపుచ్చుకోవడం కష్టమవుతుందని, వాస్తవానికి జేఈఈ కోసం రెండు, మూడేళ్లు కష్టపడిన విద్యార్థుల్లో సైతం సక్సెస్ రేట్ 25 నుంచి 30 శాతం మధ్యలోనే ఉంటోందని విద్యావేత్తలు అంటున్నారు.
2019 నుంచి అమలు చేయాలి
కొందరు విద్యావేత్తలు ఉమ్మడి ప్రవేశ పరీక్షను స్వాగతిస్తున్నప్పటికీ, దాన్ని 2018 నుంచే అమలు చేయాలనే నిర్ణయం విద్యార్థులను ఇబ్బందికి గురిచేస్తుందని అంటున్నారు. పరీక్షను 2019 నుంచి నిర్వహించాలని సూచిస్తున్నారు. ఈలోగా పరీక్ష విధానానికి అనుగుణంగా 2017–19లో ఇంటర్మీడియెట్ బోర్డ్‌ల సిలబస్‌లో తగిన మార్పులు చేయాలని అంటున్నారు. దీనివల్ల విద్యార్థులకు కొత్త పరీక్షకు సంబంధించిన ఆందోళన నుంచి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు.
2013లోనే ప్రయత్నాలు
వాస్తవానికి ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయస్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహణకు 2012లో అప్పటి హెచ్ఆర్డీ వర్గాలు యత్నించాయి. ఐసీట్ పేరుతో ఉమ్మడి ప్రవేశ పరీక్షను ప్రతిపాదించి, 2013 నుంచి నిర్వహించాలని నిర్ణయించాయి. కానీ, దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఆ ప్రతిపాదన మరుగునపడింది.
ఏఐసీటీఈ పనితీరు, సాంకేతిక విద్యలో నాణ్యతకు సంబంధించి సమీక్షకు కేంద్ర ప్రభుత్వం 2014లో కమిటీని నియమించింది. హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ మాజీ సెక్రటరీ ఎం.కె.కా అధ్యక్షులుగా ఉన్న ఈ కమిటీ 2015లో నివేదికను అందజేసింది. ఇందులోనే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆవశ్యకతను బలంగా వినిపించింది. అమెరికాలోని స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ తరహాలో ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తే భవిష్యత్తులో నాణ్యమైన ఇంజనీర్లు రూపొందుతారని పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగానే హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ ఉమ్మడి పరీక్షపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
జాతీయ స్థాయి ఉమ్మడి ప్రవేశపరీక్షను నిర్వహించడం ఖాయమైతే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జాతీయ స్థాయిలో ఇప్పటికే నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్ష మంది పోటీపడుతున్నారు. వీరంతా ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థులే. కాబట్టి కొత్త ఉమ్మడి పరీక్షపై ఆందోళన అనవసరం.
– ప్రొఫెసర్ ఎన్.యాదయ్య, రిజిస్ట్రార్, జేఎన్టీయూ–హెచ్.
జాతీయ స్థాయి ‘సెట్’ను ప్రవేశపెట్టే ముందు, దాన్ని అంది
పుచ్చుకునేందుకు వీలుగా కొంత సమయం ఇస్తే బాగుంటుంది. ఈ పరీక్ష ద్వారా ప్రైవేటు యూనివర్సిటీల వాణిజ్య దృక్పథానికి ఫుల్స్టాప్ పడుతుందనేది వాస్తవం. అయితే అవి ఫీజులను పెంచే ప్రమాదం లేకపోలేదు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాలతో సంప్రదింపులు చేశాక, తుది నిర్ణయం తీసుకోవడం సముచితంగా ఉంటుంది.
– డా. డీఎన్ రెడ్డి, డైరెక్టర్, ఈఎస్సీఐ–హైదరాబాద్.