జర్నలిస్టుల సమస్యలకై 22న ధర్నా
హిమాయత్‌నగర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో జర్నలిస్టులు పోషించిన పాత్ర ఏ ఇతర వర్గానికి తీసిపోదని ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. జర్నలిస్టుల సమస్యల సాధనకై ఈ నెల 22న తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో చలో కలెక్టరేట్‌కు సంబంధించిన పోస్టర్లను టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహట్ అలీ, హెచ్‌యూజే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్.శంకర్‌గౌడ్, ఉపాధ్యక్షులు శివప్రసాద్రెడ్డిలతో కలసి ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ.. కాసింత ఇంటి జాగా దొరుకుతుందని ఆశించిన జర్నలిస్టులకు రెండేళ్లుగా నిరాశ ఎదురవుతోందన్నారు. గ్రామీణ జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన ప్రెస్‌అకాడమీ తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో కనీసం అక్రిడిటేషన్లకు కూడా దిక్కులేదని మండిపడ్డారు. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు అందేవిధంగా జీఓ239ను సవరించాలని, హెల్త్‌కార్డులు మంజూరు చేసి, ప్రతి కార్పొరేట్ ఆసుపత్రిలో హెల్త్ స్కీము అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వర్కింగ్ జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన సీఎం తన హామీని తక్షణం అమలు చేయాలని, సబ్ ఎడిటర్లకు వెంటనే అక్రిడిటేషన్‌కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
ఎలక్ట్రానిక్ మీడియాలో న్యూస్ప్రెజెంటర్లను వర్కింగ్ జర్నలిస్టులుగా గుర్తించి వారికి అన్ని సంక్షేమ పథకాలూ వర్తింపచేయాలన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో తెర వెనుక రాత్రింబవళ్ళు శ్రమిస్తూ వాయిస్ ఓవర్ బాధ్యతలు నిర్వహిస్తున్న వారిని కూడా వర్కింగ్ జర్నలిస్టులుగా గుర్తించాలని, అధికారపక్షం మేనిఫెస్టోలో వర్కింగ్ జర్నలిస్టులకు ప్రకటించిన అన్ని పథకాలూ అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో గోషామహల్ నియోజకవర్గ వర్కింగ్ జర్నలిస్టు అసొసియేషన్ అధ్యక్షులు జి.వీరేశ్, ప్రధాన కార్యదర్శి గోపాల్, నాయకులు గోపీనా«ద్, సుభాష్, ఖాజా, బాలకృష్ణ, చక్రవర్తి, వెంకట స్వామి, సుధీర్‌రెడ్డి, శ్రీధర్, రాఖేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.