అసంపూర్తిగా వంతెన నిర్మాణం
► పదినెలలైనా పూర్తికాని వైనం
► ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు
లక్ష్మణచాంద : మండల కేంద్రంలోని అంకెన చెరువు కింద దాదాపు 500 ఎకరాల ఆయకట్టు ఉంది. అంకెన చెరువు పూర్తిగా నిండినప్పుడు దీని నుంచి పొంగిన నీరు వాగులోకి చేరుతోంది. ఇలా వచ్చిన వాగు నీరు ఎక్కువై వాగు ఉదృతంగా ప్రవహించడంతో దాటడం ప్రజలకు కష్టమవుతుంది. దీనితో వాగుకు అవతలి వైపు పొలాలు గల రైతులు చాలా సంవత్సరాల నుంచి అనేక అవస్థలు పడుతున్నారు.దీంతో అంకెన చెరువు కింద ఆయకట్టు గల రైతులు అందరు కలిసి అనేక సార్లు ప్రజా ప్రతినిదలకు విన్నవించగా అప్పటి ప్రభుత్వం రైతుల కష్టాలకు కరగలేదు.అందువల్ల అక్కడ పొలాలు గల రైతులు ప్రతి సంవత్సరం ఇలాగే అనేక బాదలు పడేవారు.
అనేకసార్లు ప్రమాదాలు..
వర్షాకాలం వర్షాలు ఎక్కువగా ఉన్న ప్రతి సారి వాగు ఉదృతంగా పొంగటంతో పాటు అటువైపుగా వెళ్లే రైతులకు చెందిన పశువులు వరదకు కొట్టుకొని పోయాయి. అంతేగాకుండా రైతులు కూడా అనేకసార్లు గాయాలపాలయ్యారు.తమ పొలాలు నాటువేసే సమయంలో అటువైపు రమ్మంటేనే రైతులు భయపడుతున్నారని రైతులు వాపోతున్నారు.పంట పొలాలు వేసే సమయంలో ఎరువులు తీసుక వెళ్లడంకూడా కష్టంగా ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
మంత్రి ఐకేరెడ్డి చొరవతో..
మండల వాసుల రైతుల కష్టాలు తెలుసుకున్న రాష్ట్ర గృహనిర్మాణ,దేవాదాయ,న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చొరవతో బ్రిడ్జి మంజూరి అయ్యింది. రూ.35 లక్షల రూపాయలతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చేతులమీదుగా బ్రిడ్జి నిర్మాణ పనులకు 04–03–2016 రోజున శంకుస్థాపన చేశారు. రైతులకు ఎటు వంటి కష్టం కలగకుండా త్వరగా బ్రిడ్డి పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌నుమంత్రి ఐకేరెడ్డి ఆదేశించారు.
పదినెలలైనా అసంపూర్తిగానే..
బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలుపెట్టి ఇప్పటికే పది నెలలు గడిచిన బ్రిడ్జి నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు.కాంట్రాక్టర్ అలసత్వం వల్ల సకాలంలో పూర్తి కావలసిన బ్రిడ్జి నిర్మాణం పనులు ఇప్పటికి అసంపూర్తిగానే ఉన్నాయి.పిల్లర్లు వేసి పది నెలలు గడుస్తున్న స్లాబు మాత్రం వేయడం లేదు.దీనితో అంకెన చెరువు కింద ఆయకట్టు గల రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వాగు నీరు ఎక్కువగా రావడంతో అటువైపుగా వెళ్లడానికి మహిళ రైతులు భయపడుతున్నారు.