కిమ్ శవపరీక్ష మీరెలా చేస్తారు? ఉత్తర కొరియా ఫైర్
సియోల్: మలేషియాపై ఉత్తరకొరియా మండిపడింది. తమ దేశ అధ్యక్షుడి సోదరుడి హత్య జరిగిన పది రోజుల తర్వాత స్పందిస్తూ చనిపోయిన ఆయనకు పోస్టుమార్టం నిర్వహించడం పూర్తిగా చట్టవిరుద్ధం, అనైతిక చర్య అని అభివర్ణించింది. ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సోదరుడు(సవతి తల్లి కుమారుడు) కిమ్ జాంగ్ నామ్ మలేషియాలోని విమానాశ్రయంలో విషపు దాడి వల్ల చనిపోయిన విషయం తెలిసిందే. అయితే, చనిపోయిన వెంటనే తమకు సమాచారం ఇవ్వకుండా, ఆయన మృతదేహాన్ని అప్పగించకుండా మలేషియా ఎలా పోస్టు మార్టం నిర్వహిస్తుందని ఉత్తర కొరియా మీడియా, అక్కడి జ్యూరిస్ట్ కమిటీ నిలదీసింది.
‘శవపరీక్ష, ఫొరెన్సిక్ పరీక్షవంటి అనైతిక, చట్టవిరుద్ధ చర్యలు చేసిన తర్వాతే ఉత్తర కొరియాకు నామ్ మృతదేహాన్ని ఇస్తానని మలేషియా చెప్పింది. అంతేకాకుండా చనిపోయిన వ్యక్తి కుటుంబంలోని మరో వ్యక్తి డీఎన్ఏ అవసరం అని అది సరిపోలితేనే తాము మృతదేహాన్ని ఇస్తామని అంటోంది. ఈ విషయాన్ని రాజకీయం చేయాలని మలేషియా అనుకుంటోందని ఈ పరిణామాలు చూస్తేనే అర్ధమవుతోంది’ అంటూ ఉత్తర కొరియా ఆరోపించింది. మరోపక్క, నామ్ సోదరుడు కిమ్నే ఈ హత్య చేయించాడా అనే విషయాన్ని మలేషియా అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, ఇన్ని రోజులు స్పందించిన ఉత్తర కొరియా ఇప్పుడెందుకు ప్రశ్నిస్తోందని దక్షిణ కొరియా ప్రశ్నిస్తోంది.