Illegal arms transport
-
తుపాకులకు ‘సుపరిచితులే’!
సాక్షి,సిటీబ్యూరో: రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల్లో 11 నేరాలు చేసి హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కిన సీరియల్ స్నాచర్లు మోను వాల్మికి, ఛోకపై అక్రమ ఆయుధాల కేసులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిలో ఒకరు పోలీసు కాల్పుల నుంచి తప్పించుకోగా, మరొకరు మూడు నెలల క్రితం తూటా తగిలి గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో వీరిని పట్టుకోవడానికి వెళ్లిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించాల్సి వచ్చింది. మరోపక్క గత నెలలో ‘సీరియల్ స్నాచింగ్స్’కు పథకం వేసిన ఈ గ్యాంగ్ మొత్తం ఆరుగురిని రంగంలోకి దింపినట్లు తేలింది. నొయిడా డెకాయ్ ఆపరేషన్‌లో ‘మోను’.. సీరియల్ స్నాచింగ్స్ కేసులో టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కిన ముగ్గురిలో ఒకడు నగరానికి చెందిన సూత్రధారి చింతమల్ల ప్రణీత్ చౌదరి కాగా, మిగిలిన ఇద్దరూ ఉత్తరప్రదేశ్ వారే. వీరిలో ఒకడైన మోను వాల్మికీకి ‘రాహుల్, గుడువా’ అనే మారుపేర్లూ ఉన్నాయి. నొయిడాలోని శ్రోక ప్రాంతంలో నివసించే ఇతగాడు పందుల పెంపకం చేస్తుండేవాడు. ఆపై నేరబాట పట్టి నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలోకి వచ్చే ఢిల్లీ, నొయిడా, ఘజియాబాద్ తదితర చోట్ల 150 స్నాచింగ్స్, దోపిడీలకు పాల్పడ్డాడు. స్నాచర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి నొయిడా పోలీసులు 2016లో డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించారు. ఆ ఏడాది జూలై 11న అక్కడి న్యూ స్పైస్ మాల్ ప్రాంతంలో కానిస్టేబుల్ అనురాధను డెకాయ్ పార్టీగా రంగంలోకి దింపారు. సాధారణ మహిళలా ఉన్న అనురాధ తన మెడలో బంగారం గొలుసుతో అక్కడ నిలబడ్డారు. ఈమెను గమనించిన వాల్మీకి తన అనుచరుడు రాజేంద్ర గౌతమ్‌తో కలిసి బైక్‌పై వచ్చి ఆమె మెడలోని చైన్ లాక్కుపోవడానికి ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో ఘర్షణకు దిగి తమ వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు ప్రారంభించారు. వెంటనే అక్కడకు చేరుకున్న సమీపంలోని పోలీసు బృందం గౌతమ్ కాళ్లపై కాల్చడంతో అతడితో పాటు వాల్మీకి సైతం లొంగిపోయాడు. మూడు నెలల క్రితం ఛోకపై.. హైదరాబాద్‌లో స్నాచింగ్స్‌కు వచ్చేప్పుడు కత్తితో తిరిగిన ఛోక స్వస్థలం యూపీలోని బులంద్ షహర్. దాదాపు 40కి పైగా స్నాచింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతడు మూడు నెలల క్రితం కాల్పులకు తెగబడ్డాడు. వృత్తిరీత్యా ఆటోడ్రైవర్ అయిన ఇతడు మరో వ్యక్తితో కలిసి వరుస స్నాచింగ్స్ చేస్తుండడంతో బులంద్ షహర్ పోలీసులు అప్రతమత్తమయ్యారు. ఓ ప్రాంతంలో కాపుకాసి పట్టుకోవడానికి ప్రయత్నించగా తుపాకీతో పోలీసులపై కాల్పులు ప్రారంభించాడు. పోలీసులు ఎదురు కాల్పులు జరపగా కుడి కాలుల్లోంచి తూటా దూసుకెళ్లింది. దీనికి సంబంధించి పోలీసులు తమపై హత్యాయత్నానికి పాల్పడినట్లు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఈ గాయం మానకుండానే బెయిల్‌పై వచ్చి హైదరాబాద్‌లో పంజా విసరడానికి వాల్మీకితో వచ్చాడు. మరో నలుగురితో కలిసి రంగంలోకి.. ప్రణీత్ పథకం మేరకు హైదరాబాద్‌ను టార్గెట్ చేసుకున్న ఈ గ్యాంగ్ వరుసపెట్టి స్నాచింగ్స్ చేయాలని పథకం వేసింది. గత నెల 24న మరో నలుగురితో కలిసి వాల్మీకి, ఛోక హైదరాబాద్ చేరుకున్నారు. మిగిలిన వారు కాచిగూడలోని లాడ్జిలోనే ఉండగా.. ప్రణీత్, వాల్మీకి రెక్కీ చేసి వచ్చారు. తొలుత వాల్మీకి... ఛోకతో కలిసి వరుస స్నాచింగ్స్ చేసి నగరం వదిలి పారిపోవాలని పథకం వేశాడు. ఇది జరిగిన ఒకటిరెండు రోజుల తర్వాత మరో ఇద్దరు, ఆపై ఇంకో ఇద్దరు ఇలా వరుస స్నాచింగ్స్ చేయాలని వాల్మీకి సూచించాడు. దీని కోసమే సెకండ్ హ్యాండ్లో పల్సర్ వాహనం ఖరీదు చేశారు. అయితే, డిసెంబర్ 26, 27 తేదీల్లో వాల్మీకి, ఛోక చేసిన వరుస స్నాచింగ్స్ నగరంలో అలజడి సృష్టించాయి. దీంతో పోలీసులు అప్రమత్తం కావడం, మీడియాలో సీసీ కెమెరాల ఫుటేజ్ ప్రచారం చేయడంతో మిగిలిన వారు సిటీ నుంచి పారిపోయారు. విషయం తెలిసిన పోలీసులు ప్రస్తుతం వారి కోసం గాలిస్తున్నారు. -
35 మందికి ఐదేళ్ల శిక్ష నుంచి విముక్తి
సాక్షి ప్రతినిధి, చెన్నై: హద్దుమీరి భారత సముద్రతీరంలోకి ప్రవేశించిన నేరంపై ఐదేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న 35 మందికి విముక్తి లభించింది. అమెరికా ఆయుధ నౌక కెప్టెన్ సహా 35 మందికి పడిన శిక్షను మదురై హైకోర్టు శాఖ సోమవారం కొట్టివేసింది. తూత్తుకూడికి తూర్పున భారత సముద్రతీరంలో అత్యాయు ధమైన ఆయుధాలతో కూడిన ‘సీమేన్ గార్డు ఒకియా’ అనే పేరుగల అమెరికా నౌక 2013 అక్టోబరు 11న భారత కోస్ట్‌గార్డుకు పట్టుబడింది. ఈ నౌకలో కెప్టెన్ టుట్నిక్ వాలంటైన్తోపాటు 12 మంది భారతీయులు, ఉక్రెయిన్, ఇంగ్లాండ్, ఎస్టోనియా తదితర దేశాలకు చెందిన 23 మంది సహా మొత్తం 35 మంది ఉన్నారు. వీరందరినీ అరెస్ట్ చేశారు. ఈ నౌకలో జీపీఎస్‌లు, 35 అత్యాధునికమైన తుపాకీలు, 5,680 తూటాలను కనుగొన్నారు. 2013 డిసెంబర్ 30న చార్జిషీటు దాఖలు చేయగా 2015 ఆగస్టు 12న తూత్తుకూడి ఫస్ట్‌క్లాస్ కోర్టు మేజిస్ట్రేటు రాజశేఖర్ విచారణ ప్రారంభించారు. 2016 జనవరి 11న వీరికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు తూత్తుకూడి న్యాయస్థానం ప్రకటించింది. నిందితులు మధురై హైకోర్టులో శిక్షపై సవాలు చేశారు. ఉద్దేశపూర్వకంగా సరిహద్దులు దాటలేదన్న నిందితుల తరఫు న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన కోర్టు... తూత్తుకూడి ఇచ్చిన తీర్పును శిక్షను రద్దు చేసింది. -
నగరానికి మరో రెండు జోన్లు!
సాక్షి, ముంబై: నగరంలో మరో రెండు జోన్లను ఏర్పాటు చేయడానికి ముంబై పోలీసులు యోచిస్తున్నారు. నగరంలో జనాభా పెరగడంతో నేరాల సంఖ్య కూడా పెరుగుతోంది. వీటిని పరిగణనలోకి తీసుకొని మరో రెండు జోన్ల ఏర్పాటుకు పూనుకున్నట్లు అధికారి తెలిపారు. ప్రస్తుతం నగరంలో 13 పోలీస్ జోన్లు ఉన్నాయి. ప్రతి జోన్‌కు డిప్యూటీ పోలీస్ కమిషనర్ బాధ్యత వహిస్తారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన సిద్ధం చేసిన వెంటనే అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపిపంచనున్నట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ధనుంజయ్ కమలాకర్ తెలిపారు. ఉత్తర, తూర్పు శివారు ప్రాంతాల్లో ఈ జోన్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయించామన్నారు. ఇక్కడ జనాభాతోపాటు నేరాల సంఖ్య కూడా పెరుగుతోందని ఆయన తెలిపారు. అంతేకాకుండా శాంతి భద్రతల విషయంలో కూడా సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. ఉత్తర శివారు ప్రాంతాల్లోని 11వ, 12వ జోన్లు గోరేగావ్ నుంచి దహిసర్ వరకు కవర్ చేస్తాయి. అదేవిధంగా తూర్పు శివారు ప్రాంతాల్లోని ఆరు, ఏడవ జోన్లు ఘాట్కోపర్ నుంచి ములుండ్ వరకు విస్తరించి ఉన్నాయి. అంతేకాకుండా చెంబూర్ నుంచి ములుండ్ వరకు వీటి పరిధి ఉంటుందని కమలాకర్ వెల్లడించారు. కొత్త జోన్ల పరిధిలోకి ఏఏ స్టేషన్లు వస్తాయో త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. పెరిగిన అక్రమ ఆయుధాల రవాణా.. ముంబై నగరం అక్రమ ఆయుధాలకు అడ్డాగా మారింది. ఈ నేపథ్యంలో నేర శాఖ, ముంబై పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ మంచి ఫలితాలను సాధించింది. ఈ ఏడాది 257 రివాల్వర్లు, పిస్టళ్లు, 715 బుల్లెట్లు హస్తగతం చేసుకున్నారు. 1990 దశకంలో ముంబైని అండర్ వరల్డ్ డాన్లు గడగడలాడించారు. ఏకే-47 లాంటి అత్యాధునిక మెషిన్ గన్స్ వంటి వినియోగించేవారు. ఆ రోజుల్లో నగరంలో ఏదో ఒక ప్రాంతంలో గ్యాంగ్స్టర్ల మధ్య కాల్పులు సర్వసాధారణంగా కనిపించేవి. కాగా, పోలీస్ శాఖ కఠినచర్యలు తీసుకోవడంతో అనంతర కాలంలో వారంతా కనుమరుగయ్యారు. మళ్లీ ఇప్పుడు చిన్న చిన్న రౌడీ మూకలు నగరంలో దోపిడీలకు పాల్పడటం మొదలుపెట్టారు. దీనికోసం వారు బయట రాష్ట్రాల నుంచి ఆధునాతన ఆయుధాలను తీసుకువచ్చి ఇక్కడ తమ కార్యకలాపాలను చేపడుతున్నారు. ఇదిలా ఉండగా, వీరిని నియంత్రించేందుకు పోలీస్‌శాఖ చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో ఆయుధాలతోపాటు సుమారు 300 మంది నేరస్తులు పట్టుబడ్డారు. వీరిపై మొత్తం 292 కేసులు నమోదు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ నేరాల సంఖ్య రెట్టింపు ఉందని పోలీసులు వెల్లడించారు.