సాక్షి, ముంబై: నగరంలో మరో రెండు జోన్లను ఏర్పాటు చేయడానికి ముంబై పోలీసులు యోచిస్తున్నారు. నగరంలో జనాభా పెరగడంతో నేరాల సంఖ్య కూడా పెరుగుతోంది. వీటిని పరిగణనలోకి తీసుకొని మరో రెండు జోన్ల ఏర్పాటుకు పూనుకున్నట్లు అధికారి తెలిపారు. ప్రస్తుతం నగరంలో 13 పోలీస్ జోన్లు ఉన్నాయి. ప్రతి జోన్‌కు డిప్యూటీ పోలీస్ కమిషనర్ బాధ్యత వహిస్తారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన సిద్ధం చేసిన వెంటనే అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపిపంచనున్నట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ధనుంజయ్ కమలాకర్ తెలిపారు. ఉత్తర, తూర్పు శివారు ప్రాంతాల్లో ఈ జోన్‌లను ఏర్పాటు చేయడానికి నిర్ణయించామన్నారు.
ఇక్కడ జనాభాతోపాటు నేరాల సంఖ్య కూడా పెరుగుతోందని ఆయన తెలిపారు. అంతేకాకుండా శాంతి భద్రతల విషయంలో కూడా సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. ఉత్తర శివారు ప్రాంతాల్లోని 11వ, 12వ జోన్‌లు గోరేగావ్ నుంచి దహిసర్ వరకు కవర్ చేస్తాయి. అదేవిధంగా తూర్పు శివారు ప్రాంతాల్లోని ఆరు, ఏడవ జోన్‌లు ఘాట్కోపర్ నుంచి ములుండ్ వరకు విస్తరించి ఉన్నాయి. అంతేకాకుండా చెంబూర్ నుంచి ములుండ్ వరకు వీటి పరిధి ఉంటుందని కమలాకర్ వెల్లడించారు. కొత్త జోన్‌ల పరిధిలోకి ఏఏ స్టేషన్లు వస్తాయో త్వరలోనే నిర్ణయిస్తామన్నారు.
పెరిగిన అక్రమ ఆయుధాల రవాణా..
ముంబై నగరం అక్రమ ఆయుధాలకు అడ్డాగా మారింది. ఈ నేపథ్యంలో నేర శాఖ, ముంబై పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ మంచి ఫలితాలను సాధించింది. ఈ ఏడాది 257 రివాల్వర్లు, పిస్టళ్లు, 715 బుల్లెట్లు హస్తగతం చేసుకున్నారు. 1990 దశకంలో ముంబైని అండర్ వరల్డ్ డాన్‌లు గడగడలాడించారు. ఏకే-47 లాంటి అత్యాధునిక మెషిన్ గన్స్ వంటి వినియోగించేవారు. ఆ రోజుల్లో నగరంలో ఏదో ఒక ప్రాంతంలో గ్యాంగ్‌స్టర్ల మధ్య కాల్పులు సర్వసాధారణంగా కనిపించేవి.
కాగా, పోలీస్ శాఖ కఠినచర్యలు తీసుకోవడంతో అనంతర కాలంలో వారంతా కనుమరుగయ్యారు. మళ్లీ ఇప్పుడు చిన్న చిన్న రౌడీ మూకలు నగరంలో దోపిడీలకు పాల్పడటం మొదలుపెట్టారు. దీనికోసం వారు బయట రాష్ట్రాల నుంచి ఆధునాతన ఆయుధాలను తీసుకువచ్చి ఇక్కడ తమ కార్యకలాపాలను చేపడుతున్నారు. ఇదిలా ఉండగా, వీరిని నియంత్రించేందుకు పోలీస్‌శాఖ చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో ఆయుధాలతోపాటు సుమారు 300 మంది నేరస్తులు పట్టుబడ్డారు. వీరిపై మొత్తం 292 కేసులు నమోదు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ నేరాల సంఖ్య రెట్టింపు ఉందని పోలీసులు వెల్లడించారు.
నగరానికి మరో రెండు జోన్లు!
Published Sun, Nov 30 2014 10:27 PM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM
Advertisement
Advertisement