తుపాకులకు ‘సుపరిచితులే’! | Illegal arms cases on Chain Snatchers | Sakshi
Sakshi News home page

తుపాకులకు ‘సుపరిచితులే’!

Published Fri, Jan 11 2019 9:05 AM | Last Updated on Mon, Mar 11 2019 11:12 AM

Illegal arms cases on Chain Snatchers - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో రెండు రోజుల్లో 11 నేరాలు చేసి హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కిన సీరియల్‌ స్నాచర్లు మోను వాల్మికి, ఛోకపై అక్రమ ఆయుధాల కేసులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిలో ఒకరు పోలీసు కాల్పుల నుంచి తప్పించుకోగా, మరొకరు మూడు నెలల క్రితం తూటా తగిలి గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో వీరిని పట్టుకోవడానికి వెళ్లిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించాల్సి వచ్చింది. మరోపక్క గత నెలలో ‘సీరియల్‌ స్నాచింగ్స్‌’కు పథకం వేసిన ఈ గ్యాంగ్‌ మొత్తం ఆరుగురిని రంగంలోకి దింపినట్లు తేలింది. 

నొయిడా డెకాయ్‌ ఆపరేషన్‌లో ‘మోను’..
సీరియల్‌ స్నాచింగ్స్‌ కేసులో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కిన ముగ్గురిలో ఒకడు నగరానికి చెందిన సూత్రధారి చింతమల్ల ప్రణీత్‌ చౌదరి కాగా, మిగిలిన ఇద్దరూ ఉత్తరప్రదేశ్‌ వారే. వీరిలో ఒకడైన మోను వాల్మికీకి ‘రాహుల్, గుడువా’ అనే మారుపేర్లూ ఉన్నాయి. నొయిడాలోని శ్రోక ప్రాంతంలో నివసించే ఇతగాడు పందుల పెంపకం చేస్తుండేవాడు. ఆపై నేరబాట పట్టి నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్సీఆర్‌) పరిధిలోకి వచ్చే ఢిల్లీ, నొయిడా, ఘజియాబాద్‌ తదితర చోట్ల 150 స్నాచింగ్స్, దోపిడీలకు పాల్పడ్డాడు. స్నాచర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి నొయిడా పోలీసులు 2016లో డెకాయ్‌ ఆపరేషన్లు నిర్వహించారు. ఆ ఏడాది జూలై 11న అక్కడి న్యూ స్పైస్‌ మాల్‌ ప్రాంతంలో కానిస్టేబుల్‌ అనురాధను డెకాయ్‌ పార్టీగా రంగంలోకి దింపారు. సాధారణ మహిళలా ఉన్న అనురాధ తన మెడలో బంగారం గొలుసుతో అక్కడ నిలబడ్డారు. ఈమెను గమనించిన వాల్మీకి తన అనుచరుడు రాజేంద్ర గౌతమ్‌తో కలిసి బైక్‌పై వచ్చి ఆమె మెడలోని చైన్‌ లాక్కుపోవడానికి ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో ఘర్షణకు దిగి తమ వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు ప్రారంభించారు. వెంటనే అక్కడకు చేరుకున్న సమీపంలోని పోలీసు బృందం గౌతమ్‌ కాళ్లపై కాల్చడంతో అతడితో పాటు వాల్మీకి సైతం లొంగిపోయాడు. 

మూడు నెలల క్రితం ఛోకపై..
హైదరాబాద్‌లో స్నాచింగ్స్‌కు వచ్చేప్పుడు కత్తితో తిరిగిన ఛోక స్వస్థలం యూపీలోని బులంద్‌ షహర్‌. దాదాపు 40కి పైగా స్నాచింగ్‌ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతడు మూడు నెలల క్రితం కాల్పులకు తెగబడ్డాడు. వృత్తిరీత్యా ఆటోడ్రైవర్‌ అయిన ఇతడు మరో వ్యక్తితో కలిసి వరుస స్నాచింగ్స్‌ చేస్తుండడంతో బులంద్‌ షహర్‌ పోలీసులు అప్రతమత్తమయ్యారు. ఓ ప్రాంతంలో కాపుకాసి పట్టుకోవడానికి ప్రయత్నించగా తుపాకీతో పోలీసులపై కాల్పులు ప్రారంభించాడు. పోలీసులు ఎదురు కాల్పులు జరపగా కుడి కాలుల్లోంచి తూటా దూసుకెళ్లింది. దీనికి సంబంధించి పోలీసులు తమపై హత్యాయత్నానికి పాల్పడినట్లు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఈ గాయం మానకుండానే బెయిల్‌పై వచ్చి హైదరాబాద్‌లో పంజా విసరడానికి వాల్మీకితో వచ్చాడు. 

మరో నలుగురితో కలిసి రంగంలోకి..
ప్రణీత్‌ పథకం మేరకు హైదరాబాద్‌ను టార్గెట్‌ చేసుకున్న ఈ గ్యాంగ్‌ వరుసపెట్టి స్నాచింగ్స్‌ చేయాలని పథకం వేసింది. గత నెల 24న మరో నలుగురితో కలిసి వాల్మీకి, ఛోక హైదరాబాద్‌ చేరుకున్నారు. మిగిలిన వారు కాచిగూడలోని లాడ్జిలోనే ఉండగా.. ప్రణీత్, వాల్మీకి రెక్కీ చేసి వచ్చారు. తొలుత వాల్మీకి... ఛోకతో కలిసి వరుస స్నాచింగ్స్‌ చేసి నగరం వదిలి పారిపోవాలని పథకం వేశాడు. ఇది జరిగిన ఒకటిరెండు రోజుల తర్వాత మరో ఇద్దరు, ఆపై ఇంకో ఇద్దరు ఇలా వరుస స్నాచింగ్స్‌ చేయాలని వాల్మీకి సూచించాడు. దీని కోసమే సెకండ్‌ హ్యాండ్‌లో పల్సర్‌ వాహనం ఖరీదు చేశారు. అయితే, డిసెంబర్‌ 26, 27 తేదీల్లో వాల్మీకి, ఛోక చేసిన వరుస స్నాచింగ్స్‌ నగరంలో అలజడి సృష్టించాయి. దీంతో పోలీసులు అప్రమత్తం కావడం, మీడియాలో సీసీ కెమెరాల ఫుటేజ్‌ ప్రచారం చేయడంతో మిగిలిన వారు సిటీ నుంచి పారిపోయారు. విషయం తెలిసిన పోలీసులు ప్రస్తుతం వారి కోసం గాలిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement