నాల్గవ రోజు 194 కూల్చివేతలు
- 646కు చేరిన ఆక్రమణల తొలగింపు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో చెరువులు, నాలాలపై ఆక్రమణల కూల్చివేత కొనసాగుతూనే ఉంది. జీహెచ్ఎంసీ అధికారులు గురువారం సుమారు 194 అక్రమ కట్టడాలను కూల్చివేశారు. నాలుగు రోజులు కలిపి ఆక్రమణల తొలగింపు సంఖ్య 646కు చేరింది. గురువారం కూల్చివేతకు గురైన వాటిలో చెరువులు, నాలాలపై ఉన్న 142 కట్టడాలు, అనుమతి లేని 27 కట్టడాలు, శిథిలావస్థకు గురైన 25 కట్టడాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా శుక్రవారం సెలవు ప్రకటించడంతో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలకు ఒక రోజు విరామం ప్రకటించారు. తిరిగి శనివారం ఉదయం అక్రమ కట్టడాల కూల్చివేతలు యథాతథంగా కొనసాగనున్నాయి.