భవన శిథిలాలను పడేస్తే చర్యలు
సాక్షి, ముంబై: అక్రమంగా ఎక్కడ పడితే అక్కడ భవన శిథిలాలను వేసేస్తుండటంతో నవీముంబై వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సిడ్కోలోని ఖాళీ ప్లాట్లలో, అలాగే వాషిలోని సెక్టార్ 30(ఏ)లో ఎన్ఎంఎంసీకి చెందిన ఖాళీ స్థలాల్లో ఈ అక్రమ డంపింగ్ భారీగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో నవీముంబై మున్సిపల్ కార్పొరేషన్ నగర వాసుల కోసం ఓ హెల్ప్‌లైన్ నంబర్‌ను త్వరలోనే ప్రారంభించనుంది.
తమ పరిధిలో ఎవరైనా అక్రమంగా భవన శిథిలాలను పారబోస్తే హెల్ప్‌లైన్ నంబర్‌ను ఆశ్రయించి కార్పొరేషన్‌ను అప్రమత్తం చేయాల్సిందిగా కోరింది. ఈ సందర్భంగా ఎన్‌ఎంఎంసీ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ జగన్నాథ్ సిన్నార్కర్ మాట్లాడుతూ.. అక్రమ డంపింగ్ విషయమై నవీ ముంబై వాసులు హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించాల్సిందిగా కోరారు. ఇదేకాకుండా త్వరలోనే జనరల్ హెల్ప్‌లైన్‌ను కూడా ప్రారంభించేందుకు యోచిస్తున్నామన్నారు. డెంగీ, మలేరియా తదితర విషయాలపై కూడా కాల్ చేయవచ్చని పేర్కొన్నారు. అలాగే వాట్సప్ ద్వారా కూడా సమాచారం పంపించవచ్చని తెలిపారు.
దీంతో హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించాల్సి వచ్చిందని అధికారి పేర్కొన్నారు. వాస్తవానికి భవన శిథిలాలను డంప్ చేయడానికి కార్పొరేషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్లాట్ల వద్ద డంపింగ్ చేయడానికి వాహనాలకు కార్పొరేషన్ అనుమతి ఇస్తుంది. అవసరమున్న అనుమతి పత్రాలు లేకుండా డంప్ చేస్తే సదరు వాహనాలను సీజ్ చేసే అధికారం కార్పొరేషన్‌కు ఉంది.