హరియాణా సీఎంపై కేసు నమోదు చేసిన సీబీఐ
న్యూఢిల్లీ: హరియాణా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాపై సీబీఐ కేసు నమోదు చేసింది. హరియాణా అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (హుడా) చైర్మన్ గా ఉన్న సమయంలో పాంచ్ కులాలో అక్రమాలకు పాల్పడినట్టు ఆయనపై కేసు నమోదైంది. విజిలెన్ప్ బ్యూరో నుంచి కేసును సీబీఐ స్వీకరించింది. సీఎం, ముగ్గురు మాజీ ఉన్నతాధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై విచారణ చేపట్టనున్నట్టు సీబీఐ పేర్కొంది.
సీబీఐ ఇప్పటి వరకు 16 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. దరఖాస్తు చివరి తేదీ ముగిసిన తర్వాత 14 మందికి పారిశ్రామిక వాడలో నిబంధనలకు విరుద్ధంగా స్థలాలను కేటాయించారని ఎఫ్ఐఆర్ లో అభియోగాలు నమోదు చేసింది. అయితే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై కేసును నమోదు చేశారని, రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని హుడా ఆరోపించారు. అధికారంలోకొచ్చి రెండేళ్లవుతున్నా ఒక్క హామీని నెరవేర్చని కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.