అక్రమ ప్రాజెక్టులపై ఎట్టకేలకు కదలిక
► ఏపీ చేపట్టిన 9 ప్రాజెక్టులపై తొలిసారి స్పందించిన కృష్ణా బోర్డు
► 22న జరిగే భేటీలో ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లపై చర్చ
► ఏపీ వినతితో మళ్లీ మైనర్ జలాల వినియోగం తెరపైకి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎట్టకేలకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు స్పందించింది. ఇన్నాళ్లుగా మౌనం వహి స్తూ వచ్చిన బోర్డు, తెలంగాణ ఏకంగా కేంద్ర జల వనరుల శాఖకే ఫిర్యాదు చేయడంతో తొలి సారి 9 ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టుల నివేదిక (డీపీఆర్)ల అంశాన్ని ఈ నెల 22న జరిగే సమావేశపు ఎజెండాలో చేర్చింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 85(సీ) నిబంధన మేరకు ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వినియోగం జరుగుతోందా? అన్న అంశాలపై చర్చిద్దామం టూ గురువారం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసింది.
తెలంగాణ ఫిర్యాదుతో కదలిన బోర్డు..
పాలమూరు–రంగారెడ్డి, డిండి, భక్తరామదాస పథకాలు కొత్తవి కావని పదేపదే వివరణ ఇస్తున్నా, వీటిపై అపెక్స్ కౌన్సిల్లో చర్చించాలని ఏపీ పట్టుబట్టిన తీరుతో విసిగిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అక్రమ ప్రాజెక్టులపై గురిపెట్టింది. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లాలో చేపట్టిన 1.23 టీఎంసీలు ఎత్తిపోసే పులికనుమ, 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సిద్దాపురం, మరో 2 టీఎంసీలు తరలిస్తున్న గాజులదిన్నె అంశాలను తెరపైకి తెచ్చింది. ఏపీలోని గుండ్రేవుల రిజర్వాయర్ ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో 2,371 హెక్టార్ల భూమి ప్రభావితం అవుతున్న అంశాన్నీ లేవనెత్తింది.
అలాగే శివభాష్యంసాగర్ ప్రతిపాదన ఉమ్మడి ఏపీలో ఎక్కడా లేదని, మున్నేరు బ్యారేజీతో తెలంగాణలో ముంపు ఉంటున్నా పట్టించుకోకుండా నిర్మాణం చేపడుతున్న విషయాన్ని ఎత్తిచూపింది. వీటితో పాటే ముచ్చుమర్రి, గురు రాఘవేంద్ర, ఆర్డీఎస్ కుడికాల్వ ద్వారా ఏపీ అక్రమ వినియోగం చేస్తోందని గుర్తించి, ఈ 9 ప్రాజెక్టులపై నెల రోజుల కిందట నేరుగా కేంద్ర జల వనరుల శాఖకు లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది.
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 85(సీ) నిబంధన కింద ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపడితే దానికి బోర్డు నుంచి కచ్చితంగా అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా, ఈ ప్రాజెక్టుల విషయంలో అలా జరగలేదని, ఎలాంటి అనుమతులు, కేటాయింపులు లేకుండా చేపడుతున్న ఈ ప్రాజెక్టులను కేంద్రం నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. తెలంగాణ రాసిన ఈ లేఖ కృష్ణా బోర్డులో చలనం తెచ్చింది. దీంతో ఈ నెల 22న అమరావతిలో జరిగే బోర్డు సమావేశంలో ఈ తొమ్మిది ప్రాజెక్టుల అంశాన్ని, వాటి డీపీఆర్‌లపై ఏపీ ప్రభుత్వ వివరణ తీసుకోవాలని బోర్డు నిర్ణయించింది. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–1లో లేని ఈ ప్రాజెక్టులను ఏ హక్కుతో నిర్మిస్తున్నారన్న అంశాలపై బోర్డు వివరణ తీసుకోనుంది. ఇక వీటితో పాటే ఇప్పటికే పలుమార్లు చర్చించిన తెలంగాణకు చెందిన పాలమూరు, డిండి, భక్తరామదాస, వాటర్‌గ్రిడ్, కల్వకుర్తి, తుమ్మిళ్ల ప్రాజెక్టులను ఎజెండాలో చేర్చింది.
మళ్లీ తెరపైకి మైనర్ వినియోగం
ఇక ఇదే ఎజెండాలో బోర్డు ప్రత్యేకంగా మైనర్ ఇరిగేషన్ కింద జరుగుతున్న నీటి వినియోగాన్ని చేర్చింది. కేవలం ఏపీ చేసిన ఫిర్యాదుతో ఈ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చినట్లుగా తెలంగాణ అనుమానిస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఉమ్మడి ఏపీకి మైనర్ ఇరిగేషన్ కింద 111.26 టీఎంసీలు కేటాయించగా, ఇందులో తెలంగాణకు గరిష్టంగా 89.15 టీఎంసీలు, ఏపీకి 22.11 టీఎంసీలు కేటాయించారు.
అయితే తెలంగాణ మైనర్ ఇరిగేషన్ కింద గత మూడేళ్లుగా పెద్దగా నీటిని వాడుకుంటున్న దాఖలాలే లేవు. మొత్తంగా చెరువుల కింద ఈ ఏడాది 20 నుంచి 25 టీఎంసీలకు మించి వినియోగం ఉండటం లేదు. అయితే ఇవేమీ పట్టని ఏపీ, చెరువుల్లోకి చేరుతున్న నీటిని నమోదు చేయకుండా, కృష్ణా జలాల్లో అధిక వాటా కొట్టేసేందుకు తెలంగాణ యత్నిస్తోందంటూ కొత్త వాదన తెరపైకి తెస్తోంది. ప్రస్తుతం మళ్లీఅదే వాదనను చర్చకు పెట్టింది. ఇక వీటితోపాటే తొలి విడత టెలిమెట్రీ పరికరాల అమరిక, రెండో విడత ప్రతిపాదనల అంశంపైనా చర్చిస్తామని బోర్డు తన లేఖలో పేర్కొంది.