Illegal Transportation
-
అక్రమ రవాణా.. ఆపై అతివేగం
కొత్తపల్లి(కరీంనగర్) : అసలే అక్రమంగా తరలిస్తున్న ఇసుక.. ఆపై అతివేగం.. అనుభవంలేని, లైసెన్స్ లేకుండా.. ఇష్టారాజ్యమైన డ్రైవింగ్‌తో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మితిమీరిన వేగం ప్రజలకు ప్రాణసంకటంగా మారుతోంది. వేగంగా దూసుకొస్తున్న వాహనాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో..? అన్న అభద్రతాభావంలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇటీవల అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్ మల్కాపూర్‌లో ఓ ఇంట్లోకి దూసుకురాగా.. అదే శివారులోని బైపాస్ సమీపంలో గల మూలమలుపు వద్ద శనివారం అతివేగంతో అదుపుతప్పిన ఓ ఇసుక ట్రాక్టర్ బోల్తాపడింది. ఎలాంటి నష్టమూ వాటిల్లనప్పటికీ.. రోడ్డంతా ఇసుక నిండుకోవడంతో పాటు ఇతర వాహనాల ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. ఆదరాబాదరగా ఆ ఇసుక ట్రాక్టర్‌ను అక్కడి నుంచి తరలించడంతో కేసునుంచి బయటపడినట్లయ్యింది. మల్కాపూర్ బైపాస్‌పై గతేడాది ఆటోను ట్యాంకర్ ఢీకొట్టిన సంఘటనలో ఎనిమిది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి సమీపంలోనే ఇసుక ట్రాక్టర్ బోల్తా పడటంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. కొత్తపల్లి మండలం ఖాజీపూర్, ఆసిఫ్‌నగర్, ఎలగందుల, కమాన్‌పూర్, బద్ధిపల్లి, నాగులమల్యాల, గంగాధర మండలం ఒడ్యారం గ్రామాల్లోని ఖనిజ సంపదను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు నిత్యం వేలాది చిన్న, పెద్ద వాహనాలు వెళ్తుంటాయి. ఆ వాహనాలన్నీ కమాన్‌పూర్, చింతకుంట, మల్కాపూర్, లక్ష్మీపూర్, రేకుర్తి గ్రామాల మీదుగా అతివేగంతో ప్రయాణిస్తుండటంతో ఆయా గ్రామాల ప్రజలు రోడ్డు దాటాలంటేనే వణుకుతున్నారు. మానేరు వాగు నుంచి ఇసుక, ఆసిఫ్‌నగర్, నాగులమల్యాల, ఒడ్యారం, కమాన్‌పూర్, బద్ధిపల్లి గ్రామాల నుంచి గ్రానైట్, మొరం రవాణా చేసే వాహనాలు, ఆటోలు తదితర ఇతర వాహనాలు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తుండటంతో అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ వాహనాల వేగానికి ప్రజలు దూరంగా పరుగెత్తాల్సి వస్తుందే తప్ప డ్రైవర్లు మాత్రం వేగాన్ని నియంత్రించడం లేదు. అడ్డు అదుపులేకుండా వేగంగా ప్రయాణిస్తున్న వాహనాలపై రవాణా శాఖ కొరడా ఝులిపించాల్సి అవసరం ఉన్నా.. ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. అడపాదడపా తనిఖీలు చేస్తూ వదిలేస్తుండటంతో భయం లేకుండా పోతోంది. లైసెన్స్‌లు లేకుండా వాహనాలను నడుపుతున్నా చర్యలు లేకపోవడంతో దర్జాగా డ్రైవింగ్ చేస్తున్నారు. గ్రానైట్ లారీల్లోంచి బండలు పడిపోయినా, అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు బోల్తా పడ్డ ఎలాంటి చర్యలు లేకపోవడంతో అతి వేగానికి కళ్లెం పడటం లేదని గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇసుక ట్రాక్టర్ల వేగానికి కళ్లెమేది ? మండలంలోని ఖాజీపూర్ మానేరు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న ట్రాక్టర్లు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారుల కళ్లెదుటే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా నిలువరించలేకపోతున్నారు. అధికారులెక్కడ చూస్తారోనన్న భయంతో అక్రమ రవాణాదారులు ట్రాక్టర్ల స్పీడును పెంచుతూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అతివేగం ప్రమాదమని తెలిసినా ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. లైసెన్స్‌లు లేని డ్రైవర్లు, లేబర్లే డ్రైవర్లుగా అవతారమెత్తుతూ ట్రాక్టర్లను తోలుతుండటంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత నెల 22న మల్కాపూర్ మాజీ సర్పంచ్ ఇంట్లోకి ఇసుక ట్రాక్టర్ దూసుకెళ్లిన విషయం మరువకముందే.. అదేగ్రామంలో బైపాస్ సమీపంలోని మూలమలుపు వద్ద ఇసుక ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో రోడ్డంతా ఇసుక నిండుకోవడమే కాకుండా ఇతరుల ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. ధనార్జనే ధ్యేయంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఇసుక ట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వేగాన్ని అదుపు చేయాలి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు, గ్రానైట్, మొరం లారీల వేగాన్ని అదుపు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇసుక ట్రాక్టర్లు, లారీలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆ వాహనాల వేగానికి రోడ్డు దాటాలంటేనే భయం వేస్తోంది. చిన్న పిల్లలు, వృద్ధులకు మరీ కష్టంగా ఉంది. మితిమీరిన వేగం వల్ల ఇసుక ట్రాక్టర్లు బోల్తా పడుతున్నాయి. అతి వేగానికి కళ్లెం వేయాలి. – కాసారపు శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్ మల్కాపూర్ -
వీడియో: దళితులపై బీజేపీ నేత దాష్టీకం..
సాక్షి, నవీపేట : నిజామాబాద్ జిల్లా నవీపేటలో దారుణం చోటుచేసుకుంది. మట్టిని అక్రమ రవాణా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నందుకు ఇద్దరు దళితు వ్యక్తులపై ఓ బీజేపీ నేత భరత్ రెడ్డి దాడికి పాల్పడ్డారు. తాము ఎంత వేడుకున్నా వినిపించుకోని ఆ నేత కర్రతో బాధిత దళితులను బెదిరిస్తూ నీటి కుంటలో మునగాలంటూ ఆదేశించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నవీపేట మండలంలోని ఎర్రగుంట్ల వద్ద గ్రామపంచాయతీ పర్మిషన్ లేకుండా బీజేపీ నేత మట్టిని అక్రమ రవాణా చేస్తున్నారు. అయితే ఈ అక్రమ రవాణాపై ఇద్దరు దళిత వ్యక్తులు భరత్ రెడ్డిని ప్రశ్నించారు. 'నన్నే ప్రశ్నిస్తారా.. మీకెంత ధైర్యమంటూ' బాధిత దళితులను దుర్భాషలాడాతూ వారిపై తన జులుం ప్రదర్శించినట్లు సమాచారం. దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగుచూసింది. అన్యాయం, అక్రమాలను ప్రశ్నించినందుకు ఇద్దరు దళితులపై దాడి జరగడాన్ని దళిత సంఘాలు తీవ్రంగా ఖండించాయి. దాడికి పాల్పడ్డ నేత భరత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
'రంగుల' కలలు !
* అధికార పార్టీ నేతల కనుసన్నల్లో రంగురాళ్ల వేట * దాచేపల్లి మండలం శంకరాపురం అడవుల్లో యథేచ్ఛగా తవ్వకాలు * పగలు, రాత్రి తేడా లేకుండా 20 అడుగుల లోతు సొరంగాలు * హైదరాబాద్ దళారీల ద్వారా రాజస్థాన్‌కు అక్రమ రవాణా * పట్టనట్టు పోలీస్, రెవెన్యూ, అటవీశాఖ అధికారులు * తవ్వకాలు జరుపుతుండగా ప్రమాదవశాత్తు ఓ కూలీ మృతి ? సాక్షి, గుంటూరు : అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్న టీడీపీ నేతలు ఇప్పుడు అటవీ ప్రాంతాలపైనా కన్నేశారు. కడప, కర్నూలు, చిత్తూరు వంటి జిల్లాల్లో అక్కడి అధికార పార్టీ నేతలు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతుండగా, ఇక్కడ ఆ అవకాశం లేక తెలుగు తమ్ముళ్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. పల్నాడులోని దాచేపల్లి, బెల్లంకొండ వంటి ప్రాంతాల్లో అటవీ భూముల్లో రంగురాళ్ల వేట సాగిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన కొందరు దళారుల సహాయంతో తవ్వకాల్లో లభ్యమైన రంగురాళ్ల ముడిసరుకును నేరుగా రాజస్థాన్‌కు అక్రమ రవాణా చేస్తూ రూ. లక్షలు గడిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ, అటవీశాఖ అధికారులు సైతం ఆ వైపు తిరిగి చూడడం లేదు. నెలనెలా మామూళ్లు తీసుకుంటూ తమకేమీ తెలియనట్లు నిద్రనటిస్తున్నారు. అధికార పార్టీనేతలు దాచేపల్లి మండలం భట్రుపాలెం, కాట్రపాడు, శంకరాపురం గ్రామాల నిరుపేద కూలీలను తవ్వకాలకు వినియోగిస్తూ వారికి కొద్దిగా ముట్టజెబుతూ భారీఎత్తున డబ్బు సంపాదిస్తున్నారు. బృందాలుగా ఏర్పడి తవ్వకాలు... దాచేపల్లి మండలం శంకరాపురం సమీప అటవీ ప్రాంతంలో కొన్ని రోజులుగా భట్రుపాలెం, కాట్రపాడు, శంకరాపురం గ్రామాలకు చెందిన కూలీలు గ్రూపులుగా ఏర్పడి తవ్వకాలు జరుపుతున్నారు. ఈ గ్రూపులన్నీ అధికార పార్టీకి చెందిన కొందరు నేతల కనుసన్నల్లోనే అటవీ ప్రాంతంలో రంగు రాళ్ల వేట జరుపుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా శంకరాపురం అడవుల్లో 15 నుంచి 20 అడుగుల లోతు సొరంగాలు తవ్వుతూ వేట సాగిస్తున్నారు. రంగు రాళ్ల ముడిరాయి అధికంగా దొరుకుతుండడంతో రోజురోజుకు తవ్వకాలను ఉధృతంం చేస్తున్నారు. ఇక్కడ రంగురాళ్లతోపాటు, బంగారు ఆభరణాల్లో ఉపయోగించే ఖరీదైన జాతిరాళ్లు సైతం దొరుకుతుండడంతో భారీగా తవ్వకాలు జరుపుతున్నారు. అధికార పార్టీ నేతలు హైదరాబాద్‌కు చెందిన కొందరు దళారుల ద్వారా రంగు రాళ్ల ముడిసరుకును ముక్కలుగా చేసి రాజస్థాన్‌కు ఎగుమతి చేస్తూ లక్షలు గడిస్తున్నారు. అన్నీ తెలిసినా అటువైపు చూడని అధికారులు అటవీ ప్రాంతంలో రంగురాళ్ల కోసం అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్న విషయం అక్కడి పోలీసు అధికారులు, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులందరికీ తెలిసినప్పటికీ నిలువరించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. అటవీ ప్రాంత తండాల్లో మంచినీరు బోరువేసుకోవాలన్నా నిబంధనల పేరిట ఇబ్బందులు పెట్టే అటవీశాఖ అధికారులు రంగురాళ్ల తవ్వకాలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల రూ.15 నుంచి రూ.20 లక్షల విలువచేసే రంగురాళ్ల మూటను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా తవ్వకాల్లో ఓ కూలి ప్రమాదవశాత్తు మృతి చెందిగా, దాన్ని బయటకు పొక్కనీయకుండా అంత్యక్రియలు కానిచ్చేశారనే ఆరోపణలు వినవస్తున్నాయి. స్పెషల్ ఫోర్స్‌ను నియమించాం.. దాచేపల్లి మండలం శంకరాపురం వద్ద అటవీ ప్రాంతంలో రంగురాళ్ల తవ్వకా లు జరుగుతున్న విషయం వాస్తవమే. రాత్రి పూట అధిక సంఖ్యలో కూలీలు అటవీ ప్రాంతానికి చేరుకుని తవ్వకాలు జరుపుతున్న విషయం నా దృష్టికి వ చ్చింది. భారీస్థాయిలో గుంతలు ఏర్పడడంతో పొక్లయిన్ల ద్వారా వాటిని పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. స్థానిక పోలీసుస్టేషన్లో దీనిపై ఫిర్యాదు కూడా చేశాం. మావైపు నుంచి కూడా స్పెషల్ ఫోర్స్‌ను నియమించి రంగురాళ్ల తవ్వకాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. - కె. మోహన్‌రావు, డీఎఫ్‌వో (టెరిటోరియల్)