మెసేజ్ కొట్టు.. గుట్కా పట్టు.. సరిహద్దులో జోరుగా సాగుతున్న దందా..
సాక్షి, తానూరు(నిర్మల్): జిల్లా సరిహద్దుల్లో నిషేధిత గుట్కా దందా యథేచ్ఛగా సాగుతోంది. లాక్డౌన్ సాకు చూపి కొరత పేరుతో అధిక ధరలకు విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు అక్రమార్కులు. సరికొత్త ఎత్తుగడలతో పోలీసులకు చిక్కుకుండా తప్పించుకుంటున్నారు. అంతకుముందు గోదాముల్లో భారీగా నిల్వలు ఉంచి, చిరు వ్యాపారులకు సరఫరా చేసేవారు. ప్రస్తుతం సంబంధిత వ్యాపారి సెల్‌ఫోన్‌కు మెసేజ్ చేస్తే చాలు సరుకును నేరుగా దుకా ణాల వద్దకే బైక్‌లపై చేరవేస్తున్నారు.
పక్కా ప్రణాళికతో ...
నిషేధిత గుట్కా, ఇతరత్రా నిషేధిత ఉత్పత్తులను సరఫరా చేసే అక్రమార్కులు పోలీసులకు చిక్కకుండా తమ పంథా మార్చుకుంటున్నారు. ఉన్నతాధికారులు దర్యాప్తు చేసినా పట్టుబడకుండా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. గతంలో హైదరా బాద్, నిజామాబాద్ నుంచి గుట్కా తెప్పించేవారు. కరోనా లాక్డౌన్ కారణంగా పోలీసులు తనిఖీలు అధికమయ్యాయి. దీంతో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల మీదుగా ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. నిర్మల్, భైంసాతోపాటు గ్రామీణ మండలాలకు చెందిన వారు కూడా ఈ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తుండటంతో స్థానిక వ్యాపారులు మహారాష్ట్ర వ్యాపారులతో కలిసి ఈ దందా సాగిస్తున్నట్లు సమాచారం. పక్కా ప్రణాళికతోనే సరిహద్దు ప్రాంతాలైన తానూరు, ముధోల్, కుభీర్, కుంటాల, సారంగపూర్, బాసర మండలాల మీదుగా నిషేధిత గుట్కా రవాణా సాగుతోంది.
రవాణా ఇలా..
నిషేధిత గుట్కా అర్ధరాత్రి సమయంలో మహారాష్ట్ర నుంచి నిర్మల్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్న తా నూరు, ముధోల్, బాసర, కుభీర్, కుంటాల, సారంగాపూర్ మండలాల మీదుగా గుట్టుచప్పుడు కాకుండా తెప్పిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వాహనం బయలుదేరిన వెంటనే వాట్సప్ మెసేజ్ ద్వారా స్థానిక వ్యాపారులకు సమాచారం అందిస్తారు. ఏ గుట్కా ఎన్ని బస్తాలు.. ఎక్కడ దించాలో అప్పుడే సమాచారం ఇస్తారు. ప్రణాళిక ప్రకారమే వాహనం నిర్దేశిత ప్రాంతానికి చేరుకుంటుంది. ఆ తర్వాత వ్యాపారులు ద్విచక్ర వాహనాలపై వెళ్లి సరుకు తెచ్చుకుంటున్నట్లు సమాచారం. ఆ తర్వాత రోజు గ్రామాల వారీగా ద్విచక్ర వాహనాలతోపాటు ట్రాలీ ఆటోల ద్వారా చిరువ్యాపారులకు సరఫరా చేస్తున్నారు.
లాక్డౌన్ పేరుతో దోపిడీ..
కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా హైదరాబాద్, నిజామాబాద్ నుంచి గుట్కా సరఫరా నిలిచిపోయింది. చిరువ్యాపారుల వద్ద కూ డా పూర్తిగా నిల్వలు అడుగంటాయి. దీంతో స్థానిక వ్యాపారులు మహారాష్ట్రకు చెందిన వ్యాపారుల సా యంతో గుట్కా దిగుమతి చేసుకుంటున్నారు. గ్రా మాల్లో గుట్కా కొరత ఉండటంతో వ్యసనపరులకు లాక్డౌన్ పేరు చెప్పి భారీగా దోపిడీకి పాల్పడుతున్నారు. గతంలో అంబర్ ప్యాకెట్ రూ.180కి లభించగా.. ప్రస్తుతం రూ.నాలుగు వందల వరకు విక్రయిస్తున్నారు. అలాగే సాగర్, తోట వంటి గుట్కా ప్యాకెట్ల ధరలనూ అమాంతం పెంచి అమ్ముతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సరిహద్దులో కొనసాగుతున్న నిషేధిత గుట్కా వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.
అక్రమ రవాణాకు సహకరిస్తే చర్యలు
మహారాష్ట్ర నుంచి తెలంగాణకు నిషేధిత గుట్కా అక్రమంగా సరఫరా అవుతున్నట్లు మా దృష్టికి రాలేదు. గతంలో తానూరు, ముధోల్‌లో దాడులు నిర్వహించి, గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నాం. అక్రమ రవాణాకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
– అజయ్‌బాబు, సీఐ, ముధోల్
ఇటీవల పట్టుబడిన ఘటనలు..
► ఐదు నెలల క్రితం ఎల్వత్ గ్రామానికి చెంది న వ్యాపారి కిరాణా షాపులకు గుట్కా ప్యాకె ట్లు సరఫరా చేస్తుండగా పోలీసులు సింగన్‌గాం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు.
► మూడు నెలల క్రితం ఎల్వి గ్రామంలో ఓ వ్యాపారి బైక్‌పై వెళ్లి దుకాణాలకు గుట్కా ప్యాకెట్లు సరఫరా చేస్తుండగా తానూరు పోలీసులు పట్టుకున్నారు.
► రెండు నెలల క్రితం భైంసా నుంచి తానూరుకు అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను హిప్నెల్లి సమీపంలో పోలీసులు పట్టుకున్నారు.